దేవుళ్ళనూ, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే మన దేశంలో ప్రజలు సహించరనే విషయం చాలా సార్లు రుజువైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను రాజకీయం చేసేందుకు బీజేపీ, తెలుగుదేశం సాగించిన యత్నాలు మరో సారి బెడిసి కొట్టాయి. జగన్ తండ్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి కూడా తిరుమల బ్రహ్మోత్సవాలకు తిరుమలేశునికి పట్టువస్త్రాలను సమర్పించినప్పుడు తెలుగుదేశం, బీజేపీలు ఇలాగే ఆందోళన చేశాయి.తిరుమల ఆలయంలో ప్రవేశానికి డిక్లరేషన్ పై సంతకాలు చేస్తేనే వెళ్ళాలని పట్టుపట్టాయి. అయితే, అప్పుడు కూడ ఇలాంటి సంప్రదాయం ఎన్నడూ లేదని అప్పటి అధికార పార్టీ నాయకులు వాదించగా, ఆందోళన సర్దుమణిగింది. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం రాజకీయంగా వేర్వేరుగా ఉన్నప్పటికీఈ విషయంలో ఒకటయ్యాయి.జగన్ తిరుమలలో డిక్లరేషన్ మీద సంతకం చేయకుండానే తిరుమలేశునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన నుదుట తిరునామాన్ని దిద్దుకున్నారు. ఏ గుడికైనా వెళ్ళినప్పుడు తిరునామమో,వీబూతో పెట్టుకోవడం సంప్రదాయం.ఆ మతం పట్ల, దేవుని పట్ల విశ్వాసం ఉందనడానికి అదే నిదర్శనం. అందువల్ల ఈ వివాదాన్ని ఇంతటితో ముగించడం అందరికీ శ్రేయస్కరం. అయితే, బీజేపీ నాయకులు, హిందు మతాభిమానులుఅంతర్వేదిలో రథం దగ్ధం సంఘటన, విజయవాడలో రథానికి ఉన్న సింహాల ప్రతిమలు మాయం కావడం వంటి సంఘటనలపై కూడా ఆందోళన సాగిస్తోంది. అంతర్వేది సంఘటనపైనా, ఆలయాల్లో ఇటువంటి సంఘటనలపైనా సీబీఐ దర్యాప్తునకు జగన్ ఆదేశించారు.అయినప్పటికీ, కమలనాథులు తమ పోరును విరమించడం లేదు. వారిదంతా రాజకీయ లబ్ధి కోసమేనన్న విషయం ప్రజలు గ్రహించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. పార్టీని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్న ఆయన మత పరమైన అంశాలతోనే జనానికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్లో అలాంటి ప్రయత్నాలకు జనం ఆదరణ చూపడం గతంలో జరగలేదు.ఇప్పుడు కూడాకమలనాథుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలప్రదం అవుతాయన్నది ప్రశ్నార్ధకమే. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీజేపీకి ఆదరణ లేదు. కేవలం తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలకే ఆ పార్టీ పరిమితం అయింది.
పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి శాసనమండలిలో బీజేపీ ప్రాతినిధ్యం రెండు చోట్లా ఎక్కువగానే ఉండేది. గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోబీజేపీ నాలుగు స్థానాలను గెల్చుకుని తన ఉనికిని కాపాడుకుంది. ఆంధ్రప్రాంతంలో తెలుగుదేశంతోజతకట్టకుండా విడిగా పోటీ చేయడం, తెలుగుదేశం పట్ల జనంలో వ్యతిరేకత తీవ్రంగా ఉండటం వల్ల బీజేపీ వోట్లు చీలిస్తే తెలుగుదేశం పుంజుకుంటుందేమోనని జగన్ నేతృత్వంలోని వైసీపీకే అత్యధిక స్థానాలను ప్రజలు కట్టబెట్టారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బాధంతా అదే. బీజేపీ అనుకూల ఓట్ల కోసం ఆయన సినీనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ సాయాన్ని ఉపయోగించుకున్నా ఫలితం దక్కలేదు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో తిరిగి పుంజుకోవడానికి తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి వ్యూహాన్ని అనుసరించేందుకు విగ్రహాల ధ్వంసం సంఘటనలనుఒక అస్త్రంగా ఉపయోగించుకు ంటున్నారన్నది జనాభిప్రాయం.తెలంగాణలో నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలను పదే పదే గుర్తు చేసి బీజేపీ కాస్తోకూస్తో బలాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రాంతంలో అటువంటి అంశాలేవీ లేవు. ఆంధ్రలో తెలుగుదేశంతో జోడీ కట్టడం వల్ల బిజేపీ ఆ పార్టీ విజయాన్ని సాధించినప్పుడు సీట్లు తెచ్చుకుంది. తెలుగుదేశంతో పాటు ఓడి పోయింది. సోము వీర్రాజు అదే అంశంపై దృష్టిని కేంద్రీకరించారు. తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఒంటరిగా బీజేపీ పోటీ చేసి బలాన్ని పెంచుకోవాలన్న అజెండాతోనే ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు.అయితే, విగ్రహాలు ధ్వంస, రథం దగ్ధం సంఘటనలనుసాకుగా చూపి బీజేపీ కన్నా ఎక్కువ లాభ పడేందుకు తెలుగు దేశం ప్రయత్నిస్తోంది. వైసీపీపై వ్యతిరేకతను పెంచడంలో రెండు పార్టీలు పరోక్షంగా కలిసి పని చేస్తున్నాయన్నవార్తలు పూర్తిగా నిరాధారం కాదు.ఈ రెండు పార్టీలు కలిసి జగన్ డిక్లరేషన్ ఇవ్వందే తిరుమల బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు సమర్పించడానికి వీలు లేదని అన్ని స్థాయిల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అనుకూల మీడియా వారి ప్రకటనలకూ,ఆందోళనలకూ ఇరవైనాలుగు గంటల చానల్స్ ద్వారాశక్తివంచన లేకుండాసాయం అందించింది. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి తిరుపతి, అలిపిరి, తిరుమలలో తమ కార్యకర్తలను సమీకరించి ఆందోళనకు సిద్ధపడింది.అయితే, ముందస్తు అరెస్టుల ద్వారా పోలీసులు వారి ప్రయత్నాలను భగ్నం చేయగలిగారు. చంద్రబాబునాయుడు మోడీ ప్రభుత్వం నుంచి బయటికి వొచ్చినప్పుడు వామపక్షాలు, కాంగ్రెస్ , ఇతర లౌకిక పార్టీలతో కలిసి వేదిక పంచుకున్నారు.
ఆ పార్టీల నాయకులతో చెట్టపట్టాలేసుకుని ప్రచారం నిర్వహించారు. అయితే, ఆయనతో చేతులు కలపడం వల్ల తమకు సహజంగా రావల్సిన సీట్లు కూడా రాలేదనిబిజేపీయేతర పార్టీలు వాపోయాయి. చంద్రబాబునాయుడుకి వైఎస్ ఆర్ మాదిరిగా స్వయం ప్రకాశ శక్తి లేదు. ఎవరో ఒకరి చరిస్మాని అడ్డుపెట్టుకుని సీట్లు సంపాదించుకోవడం ఆయనకు అలవాటు.తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నుంచి గుంజుకోవడం నుంచి నిన్నమొన్నటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు ఉన్న జనాదరణను ఆసరాగా చేసుకోవాలన్న తపనే తప్ప సొంతంగా కేడర్ ను ఉత్సాహ పర్చే సామర్ధ్యం వయసు పైబడిన కారణంగా తగ్గిపోయింది. ఆయన ప్రతి ఎన్నికల్లో రంగులు మారుస్తారనీ, ఆయనను నమ్మడానికి లేదని వామపక్షాలు, బీజేపీ గ్రహించాయి.అయితే, సీట్ల కోసం ఆయన తో జత కడుతుంటాయి. చంద్రబాబు హిందూ మతాభిమాని అంటే ఎవరూ నమ్మరు. ఆయన బూట్లుతీయకుండా దేవాలయాలను సందర్శిస్తారనీ, పూజలు నిర్వహిస్తుంటారంటూ రాష్ట్ర మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కొంత కఠినంగా అవాస్తవం కాదు.
ఎవరో ఒకరి భుజాలమీద నుంచి అధికార పీఠాన్ని చేరడం ఎలా అని నిరంతరం ఆయన ఆలోచిస్తూ ఉంటారన్న ఆరోపణల్లో కూడా అసత్యం లేదు. చంద్రబాబు అమరావతిలో అధికారం చేపట్టిన కొత్తలోనే గోదావరి, కృష్ణ పుష్కరాలు వరుసగా వొచ్చాయి. ఈ రెండు పుష్కరాల సందర్బంగా రోడ్లు వెడల్పు, సుందరీకరణ పేరు చెప్పి ఎన్నో చిన్న ఆలయాలను పడగొట్టించారు. అలాగే గోదావరి పుష్కరాలకు వేలాది జనాన్ని పక్కన నిలిపేసి లేజర్ షూటింగ్ కోసం ప్రధాన రేవులో ఆయన కుటుంబ సమేతంగా మూడు గంటలు పైగా స్నానమాచరించడం, పూజలు నిర్వహించడం చేయడం వల్ల తొక్కిసలాట జరిగిదాదాపు 30 మంది మరణించారు. అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఆలయాలపై దాడులు , రథం దగ్ధం సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందువల్ల జగన్ పై తెలుగుదేశం నాయకులు చేసిన ఆరోపణలు విమర్శనాస్త్రాలు వెనక్కి వొచ్చి ఆ పార్టీ అధినేతకే తగిలాయి. ఎలా చూసుకున్నా, జగన్ ని బదనామ్ చేయడానికి తిరుమల బ్రహ్మోత్సవాల ను, రథం దగ్ధం వంటి సంఘటనలను అస్త్రాలుగా చేసుకోవాలన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీల వ్యూహాలు బెడిసి కొట్టాయి. జగన్ తిరుమల యాత్ర జయప్రదంగా ముగిసింది. మత విశ్వాసాలు వ్యక్తిగతం ,వాటిని ఆసరగా చేసుకుని రాజకీయ లబ్ది పొందాలని ఎవరు ప్రయత్నించినా వారికి ప్రజలు ఇదే రీతిలో సమాధానం చెబుతారని జగన్ తిరుమల పర్యటన మరోసారి రుజువు చేసింది.