Take a fresh look at your lifestyle.

ఎల్‌ఆర్‌ఎస్‌ ‌దరఖాస్తుదారులకు ఊరట

  • పాత పట్టాలకు ఆనాటి రేటు  ప్రకారమే ఫీజులు
  • జీవోను సవరిస్తామని హామీ
  • హైదరాబాద్‌ అభివృద్ధ్ది కాంగ్రెస్‌కు కనిపించడం లేదని ఎద్దేవా
  • అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చకు మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం

ఎల్‌ఆర్‌ఎస్‌ ‌దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు 131 జీవోను సవరించి.. కొత్త జీవోను విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌శాసనసభ వేదికగా ప్రకటించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో భాగంగా బుధవారం అసెంబ్లీలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజల పట్ల గౌరవం ఉన్నది కాబట్టే మొన్న తీసుకువచ్చిన 131 జీవోను సవరిస్తామన్నారు. గతంలో ఎప్పుడైతో వారు రిజిస్టేష్రన్‌ ‌చేసుకున్నారో వాటి విలువకు అనుగుణంగానే సవరించిన జీవోను గురువారం విడుదల చేస్తామని కేటీఆర్‌ ‌ప్రకటించారు. రిజిస్టేష్రన్‌ ‌సమయంలో ఉన్న మార్కెట్‌ ‌విలువ ప్రకారమే రుసుం వసూలు చేస్తామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. అనధికారిక లే అవుట్లలో తెలియక ప్లాట్లను కొనుగోలు చేసిన వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. పట్టణ, గ్రాణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఇదే మంచి అవకాశమని మంత్రి కేటీఆర్‌ ఇటీవలే చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌ 15‌వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ‌స్కీమ్‌ని సద్వినియోగం చేసుకుంటే.. యాజమానులు భూములపై సర్వహక్కులతోపాటు ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని వివరించారు. వచ్చే అక్టోబర్‌ 15‌వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ఫీజును వచ్చే ఏడాది జనవరి 31లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, అర్బన్‌ ‌ల్యాండ్‌ ‌సీలింగ్‌ ‌మిగులు భూములు, దేవాదాయ భూములు, చెరువుల శిఖం భూముల్లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ ‌స్కీమ్‌ ‌వర్తించదని స్పష్టంచేశారు.

అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌
‌భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ ‌పార్టీ అవమానించింది అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. తమకు అంబేడ్కర్‌ ‌పై గౌరవం లేదని భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. అది వారికే చెల్లుతుందన్నారు. అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్‌ ‌పార్టీనే. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో అంబేడ్కర్‌ ‌ను ఓడించింది కాంగ్రెస్‌ ‌పార్టీ కాదా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ను పార్లమెంట్‌లో అడుగు పెట్టనివ్వకుండా కాంగ్రెస్‌ ‌పార్టీ కుట్ర చేసిందన్నారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్‌ ‌నేతలు.. ఆయన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంబేడ్కర్‌ ‌ను గౌరవిస్తున్నాం కాబట్టే.. బోరబండలో సెంటర్‌ ‌ఫర్‌ ‌దళిత్‌ ‌స్టడీస్‌ ‌వద్ద దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని 28 ఫీట్ల ఎత్తులో పెట్టాం. ట్యాంక్‌బండ్‌ ‌వద్ద 125 ఫీట్ల ఎత్తులో అంబేడ్కర్‌ ‌విగ్రహాన్ని పెట్టబోతున్నాం. అంబేడ్కర్‌ ఆశయాలను అనుసరించి ఉంటే ఆ పార్టీ ఎప్పుడో బాగుపడేది. తమ పార్టీ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుందని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష సభ్యుడైన భట్టి విక్రమార్క నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వలేదు. హైదరాబాద్‌ అభివృద్ధి తామే చేశామని భట్టి విక్రమార్క చెప్పారు. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏమిటో భట్టి మాట్లాడింది వింటే అర్థమయిందన్నారు. కొత్త విషయం చెప్పలేదు. తెలంగాణ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే.. కాంగ్రెస్‌ ‌నేతలకు పట్టదు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెసోళ్లకు కడుపు మండిపోతోందన్నారు.

హైదరాబాద్‌ ‌బెస్ట్ ‌సిటీ అని అనేక సర్వే సంస్థలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే హైదరాబాద్‌ ‌మోస్ట్ ‌డైనమిక్‌ ‌సిటీ అని జేఎల్‌ఎల్‌ ‌చెప్తుంటే.. వీరేమో పట్టించుకోవడం లేదన్నారు. వేలకోట్లు ఖర్చుపెట్టి అభివృద్ది చేస్తుంటే కనీసం చూసి కూడా గుర్తించరా అని అన్నారు. కోటి మంది ఉండే హైదరాబాద్‌లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. పబ్లిక్‌ ‌టాయిలెట్లు నిర్మించలేదు. బస్తీ దవఖానాలు పెట్టలేదు. పేదల గురించి ఆలోచించలేదు అంటే సరిపోదని అన్నారు. కరెంట్‌ ‌కోసం ఇందిరా పార్కు వద్ద పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్‌ ‌హయాంలోనే జరిగింది కదా? శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. ఆరు కోట్ల మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ సెంటర్లు నగరంలో ప్రతి మూలన కనిపిస్తాయి. గాంధీ భవన్‌లో కూర్చుంటే కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గాంధీ భవన్‌ ‌దివాళా తీసింది. రేపో మాపో టూలెట్‌ ‌బోర్డు పెట్టుకోవాల్సి వస్తది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణను అభివృద్ధి చేసి ఉంటే.. 2014, 2018 ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయారు? అని అడిగారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ఎం‌త ఖర్చు పెట్టింది? 2014-20 వరకు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసుకోవాలి. తమ ప్రభుత్వం.. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 67 వేల 130 కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పది సంవత్సరాల కాలానికి రూ. 4,636 కోట్లు ఖర్చు పెట్టిందని గుర్తు చేశారు. భారతదేశంలోనే ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. రూ. 18 వేల కోట్లతో డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. వీటిలో రూ. 9,714 కోట్లతో హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణం చేస్తున్నాం. మొత్తం లక్ష ఇండ్లు డిసెంబర్‌ ‌వరకు పూర్తి చేసి పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ కృషిని అభినందించిన అక్బరుద్దీన్‌
‌ప్రపంచంలోనే హైదరాబాద్‌ అద్భుత నగరం అని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ స్పష్టం చేశారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ ‌దూసుకు పోతోందన్నారు. హైదరాబాద్‌ ‌భారతదేశానికి న్యూయార్క్ ‌లాంటిందని చెప్పారు. మొజంజాహీ మార్కెట్‌ను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిందని తెలిపారు. పాతబస్తీకి మెట్రో రైలు ఎప్పుడు వస్తుందో చెప్పాలని కోరారు. పాతబస్తీలో రహదారుల వెడల్పు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణలు కూడా తొలగించాలని సూచించారు. పాతబస్తీలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కారించాలన్నారు. మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి ఓవైసీ విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో జీహెచ్‌ఎం‌సీ సేవలు మరువలేనివి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అన్నపూర్ణ క్యాంటీన్లు పేదల ఆకలిని తీర్చాయని ఎమ్మెల్యే ఓవైసీ స్పష్టం చేశారు. ఈ చర్చలో భట్టి విక్రమార్క,వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply