వరవర రావు ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నదని, అందువల్ల ఆయనను తలోజా జైలు నుంచి ముంబాయిలోని జె జె ఆస్పత్రికి తరలించారని శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నరకు చిక్కడపల్లి పోలీసుల ద్వారా తెలిసిందని ఆయన సహచరి హేమలత శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు.ప్రకటన పూర్తి పాఠం..” పుణె పోలీసులు తమకు ఆ ఒక్క వాక్యమే చెప్పారని అంతకు మించి వివరాలేవీ తమకు తెలియవని చిక్కడపల్లి పోలీసులు చెప్పారు. ఆ తర్వాత మూడు నాలుగు గంటల దుర్భర ఆందోళన తర్వాత తెలిసిన సమాచారం ప్రకారం వరవరరావు గారు గురువారం సాయంత్రం తలోజా జైలులో కళ్లు తిరిగి పడిపోయారని, వెంటనే జెజె ఆస్పత్రికి తరలించారని, శుక్రవారం సాయంత్రానికి ఆరోగ్య స్థితి కుదుటపడిందని తెలిసింది. జెజె ఆస్పత్రి విడుదల చేసిన ఒక ఆరోగ్య బులెటిన్, ముంబాయిలో విలేఖరులతో అధికారులు చెప్పిన విషయాలు బైటికి వచ్చాయి. ఆయన మూడు రోజులుగా జైలు ఆస్పత్రిలో ఉన్నారని, ఆ తర్వాతనే జెజె ఆస్పత్రికి తరలించవలసి వచ్చిందని జైలు అధికారులు చెప్పారని ఇంకొక వార్త వచ్చింది. ఇలా వెలువడుతున్న సమాచారంలో ఏది ఎంత వాస్తవమో, ఆయన ఆరోగ్య స్థితి కచ్చితంగా ఎలా ఉన్నదో తెలియదు. ఈలోగా కుటుంబ సభ్యులు ముంబాయి వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ పోలీసు అధికారులు చేసిన ప్రకటన మరింతగా ఆందోళన కలిగిస్తున్నది.
డెబై రెండు సంవత్సరాల వయసులో, అనారోగ్యంతో, ప్రస్తుతం తీవ్రమైన ఆందోళనలో ఉన్న నేను కూడ ముంబాయి ప్రయాణం చేసే స్థితిలో లేను. పైగా ఆయనను కలవడానికి న్యాయస్థానం అనుమతి సంపాదించే ప్రయత్నం జరుగుతున్నది. ఆ అనుమతి దొరికితే కుటుంబ సభ్యులం ముంబాయి వెళతాం. కొవిడ్ వల్ల అవసరమైన అనుమతులు ప్రభుత్వం ఇస్తే చాలు. మా ప్రయాణ ఏర్పాట్లు మేం చేసుకుంటాము.
ఆయన ఆరోగ్యం గురించి, భద్రత గురించి తీవ్రమైన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేస్తున్నాను.
1. వరవరరావు గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉన్నదో కుటుంబ సభ్యులకు తెలియడానికి తక్షణమే ఆయనతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి.
2. అబద్ధపు ఆరోపణలపై, విచారణ కూడ లేకుండా పద్దెనిమిది నెలలుగా నిర్బంధంలో ఉంచిన వరవరరావు గారిని తక్షణమే బెయిల్ పై విడుదల చేయాలి.
3. కళ్లు తిరిగి పడిపోవడం అనేది నిజమే అయితే అందుకు కారణాలేమిటో సమగ్ర వైద్య పరీక్షలు జరపాలి.
4. ఆయనకు అంతకు ముందే ఉన్న పైల్స్, ప్రొస్టేట్ ఎన్లార్జిమెంట్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఎడీమా, హైపర్ టెన్షన్, ఆసిడిటీ, సైనస్/మైగ్రేన్ లలో ఏ సమస్య తీవ్రంగా మారి, ప్రస్తుత ఆందోళనాకర పరిస్థితి కల్పించిందో , లేదా ఏ కొత్త సమస్య తలెత్తిందో వైద్య బృందం చేత సమగ్ర పరీక్ష జరిపించాలి.
5. ఆయన పట్ల, మొత్తంగా ఆయన సహనిందితుల పట్ల ఎన్ ఐ ఎ వహిస్తున్న కక్షపూరిత ధోరణి వదిలిపెట్టాలని ఎన్ ఐ ఎ కు బాధ్యత వహించే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించాలి. తెలుగు వాడైన హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ బాధ్యత తీసుకోవాలి.
6. 1969 ఉద్యమం నుంచి తెలంగాణ కోసం పోరాటంలో పాల్గొన్న, ప్రపంచ ప్రసిద్ధుడైన తెలంగాణ బిడ్డ వరవరరావు గారి ఆరోగ్యం కోసం, క్షేమం కోసం, భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత పడాలి..” అని పి.హేమలత ప్రకటనలో పేర్కొన్నారు.