తిరుమల,జనవరి7 : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300ల టికెట్ల ఆన్లైన్ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథిగృహాల ప్రాంతంలో ఆఫ్కాన్ నిర్మాణ సంస్థ నిర్మించిన నూతన అతిథి గృహాన్ని శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. పూజలు నిర్వహించిన అనంతరం అతిథిగృహం లోని 12 గదులకు సంబంధించిన తాళం చెవులను సంబంధిత అధికారులకు అందజేశారు.
ఎస్టేట్ ఒఎస్డీ మల్లిఖార్జున, రెవెన్యూ ఏఈవో నారాయణ చౌదరి, ఆఫ్కాన్ సంస్థ మేనేజర్ రంగ స్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆరుద్ర దర్శన మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ నటరాజ స్వామివారికి ఏకాంతంగా మహన్యా సపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ధనుర్మాస దర్శనం శ్రీ మనోన్మణి సమేత నటరాజ స్వామివారిని, శ్రీ మాణిక్యవాసక స్వామివార్లను పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం శాస్తోక్త్రగా దీపారాధన నిర్వహించారు.