Take a fresh look at your lifestyle.

సడలింపు కొరోనాకా..!

విజృంభిస్తోన్న కరోనానా గణాంకాలను పరిశీలిస్తే లాక్‌ ‌డవున్‌ ‌సడలింపు జన జీవితాలకా లేక వైరస్‌ ‌కా అన్న సంశయమేర్పడుతోంది.. తాజా లాక్‌ ‌డవున్‌ ‌తీరు గేటుకు తాలమేసి గోడ తీసేసినట్టుంది.. గత కొద్ది రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్న కొవిడ్‌ ‌కేసులు పరిస్థికి అద్దం పడుతున్నాయి….
వైరస్‌ ‌బాధితుల సంఖ్య ఆంధ్రాలో 4 వేలు, తెలంగాణలో 3వేలు దాటేయటం దేశం మొత్తంగా 2 లక్షల కరోనా పాజిటివ్‌ ‌ల కలకలం కొనసాగుతోంది.. తొలి లక్ష కేసులు 111 రోజుల్లో నమోదుకగా  కేవలం 15 రోజుల్లో మరో లక్ష కేసులు చోటు చేసుకోవటం వైరస్‌ ఉఢృఇతిని తెలియజేస్తోంది..మహమ్మారి ఇంతగా ప్రబలుతున్నా జనానికి అవసరమైన ముందు జాగ్రత్త కరువవుతోంది..

హెడ్డింగ్స్ ‌చదివేటప్పుడో హెడ్‌ ‌లైన్స్ ‌వినేటప్పుడో తప్ప కరోనా భయం ఆవహించకపోతుండటంతో వైరస్‌ ‌వ్యాప్తి విశృంఖలమవుతోంది.. చేతులు శానిటైజ్‌ ‌చేసుకోవటం, పరిసరాలు శుభ్రపరుచుకోవటం , భౌతిక దూరం పాటించటం , మాస్కు ధరించటంలో నిర్లక్ష్యం పరిస్థితిని విషమంగా మారుస్తోంది.. కేసుల సంఖ్య రెట్టింపవుతున్నవిధం పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తోంది…. రోజూ నమోదవుతున్న తాజాకేసుల సంఖ్య భీతి గొలుపుతోంది.  తెరుచుకున్న ప్రపంచం కరోనాకూ ఆతిథ్యమిస్తోంది.. ప్రజలకు నిత్యవస్రాలు బ్యాంక్‌ ఎకౌంట్లలో ఆర్థిక సాయాలతో ఎవరినీ ఇల్లు దాటి బయటకు రానీయక ప్రభుత్వం కరోనాను చేతనైనంత కట్టడి చేసింది..ఫలితంగా కరోనా కేసుల సంఖ్య ఆ సమయంలో అతి తక్కువగా ఉంది.. ఎప్పటినుంచైతే సడలింపులిచ్చిందో అప్పటినుంచే వైరస్‌ ‌వ్యాప్తి అధికమవుతోంది..తొలుత పట్టణ నగరాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు మండల కేంద్రాలు గ్రామాలనూ పలకరిస్తోంది.. దేశ ఆర్థిక ప్రగతి దెబ్బతింటున్న ప్రమాదం, ప్రజల ఆదాయవనరులు దిగజారుతుండటం దృష్ట్యా ప్రభుత్వాలు సడలింపు వెసులుబాటుకు తలొగ్గాయి.. అయినా ఇటువంటి విపత్కర కాలాన ఆదాయం కన్న ప్రాణాలే ముఖ్యం..వైరస్‌ ‌మరింత విస్తరిస్తే జన జీవన ప్రమాణాలు మరింత దిగజారే ఆస్కారముంది..

కరోనాతో కలిసి జీవించాలని సహజీవనం సాగించాలని మేధావులు చేసిన సూచన సాధారణ జనానికి సరిగా అర్థం కానట్టుంది.. ఏ పని చేసినా ముందుగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని వైరస్‌ ‌బారిన పడకుండా అనుక్షణపు అప్రమత్తత తోపాటు.. తమ కారణంగా ఇతరులకు ఆ కష్టం కలగనీయని ఎరుక కలిగి మెలగాలని, రోజువారీ ఉద్యోగ వ్యాపార కూలీ, వ్యవసాయ తదితర పనుల్లో పాల్గొంటూ దిగజారిన ఆదాయ మార్గాలను తిరిగి నిలబెట్టుకోవాలని స్వయం సమృద్ధి ప్రోధిచేసుకోవాలని మేధావుల మాటల అర్థం.. కానీ జనం దీన్ని మరోలా తీసుకున్నట్టు కనిపిస్తోంది..కరోనా భయం లేకుండా ఎప్పటిలా స్వేచ్చగా బతికేస్తాము, వైరస్‌ ‌సోకితే వైద్యం చేయించుకుంటాము క్వారంటెయిన్‌ ‌కు వెళ్ళాల్సొస్తే వెళ్ళొస్తాము, దేశంలో రికవరీ శాతమెక్కువ మరణాల శాతం తక్కువే అన్న ధీమా వ్యక్తమవుతోంది… స్థానిక వాతావరణ , దేశవాళీ వ్యాధినిరోధక శక్తి పై గల అంచనా భరోసాతో ఈ మేరకు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది..

కొనుగోలు ప్రాంతాల్లో, ప్రయాణ సమయాల్లో, దుకాణాలవద్ద, కార్యాలయాల్లో, గుమి గూడటం నిబంధనలు పాటించకపోవటం చేస్తున్నారు.. అయిదు దఫాల లాక్డవున్‌ ‌లో క్రమంగా సడలింపులివ్వటం తో కరోనా విస్టృతి అధికమవుతోంది .. కొనలు సాగదీసిన రబ్బర్‌ ‌ను వదిలేసినట్టు మన నిర్లక్ష్యం పూర్వ స్థితికి చేరుతోంది.. యధా స్థితికి చేరుతున్న బాధతా రాహిత్యం సమాజాన్ని ప్రమాదంలోకి నెడుతోంది.. ప్రభుత్వాలు చెవుల్లో ఇల్లు కట్టుకొని హెచ్చరిస్తున్నా మన తీరు ఎప్పటిలా మారుతుండటంతో అవి చేతులెత్తేసే ప్రమాదమూ కనిపిస్తోంది..
లాక్డవున్‌ ‌నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం  పదకొండుగంటలవరకు వెసులుబాటిచ్చేవారు.. పోలీసుల పహారాలో క్రయ విక్రయాలు జరిగేవి, చదరాలు వృత్తాల ద్వారా దూరం పాటింపు నిబంధన అమలయ్యేది.. రోడ్లమీద అనవసర సంచారం అరికట్టబడేది.. కానీ ఇప్పుడు రాత్రి కర్ఫ్యూ అన్నమాటే కానీ పగలంతా స్వేచ్చగా వ్యవహరిస్తున్నారు..

జనం రోడ్లపై స్వేచ్చ్చగా సంచరిస్తున్న తీరునే కరోనా తిరుగడుతోంది.. వీధులు దుకాణాలు, స్నేహాలు, బంధుత్వాలు విందులు వినోదాలు ఉద్యోగాలు వ్యాపారాల్లో వ్యాప్తి చోటు చేసుకుంటోంది.. తాజా కేసుల సంఖ్య ఇందుకు కారణమవుతోంది… కరోనా తొలినాళ్ళకు భిన్నంగా దేశంలో వైరస్‌ ‌వ్యాప్తి అతి వేగమయ్యింది…కరోనా నివేదికలు రోజూ వినటమో చదవటమో బోర్‌ ‌కావచ్చు కానీ స్వీయ నియంత్రణ చర్యలు పాటించటం మాత్రం బోర్‌ ‌కాకూడదు..రాత్రి ఎనిమిది గంటలనుండి కర్ఫ్యూ విధించామని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ జరగాల్సిన చేతంతా సడలింపు సమయానే జరుగుతోంది.. వైరస్‌ ‌సోకటానికి క్షణం చాలు ఆ క్షణాన్ని నిషేధిస్తూ తప్పించుకునేందుకు మనం రోజూ అప్రమత్తత కలిగి ఉండాలి.. క్షణమైనా నిర్లిప్తత వహిస్తే ఆరోగ్యాన్నో ప్రాణాన్నో ఫణంగా పెట్టాలి.. మన బాధ్యతా రాహిత్యానికి బలయ్యేది మన కుటుంబమూ సమాజమూ కూడా.. ఎవరిపై నెపం మోపకుండా ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు పాటించాలి కరోనా రహిత రాష్ట్రాలకు ప్రభుత్వాలతో సహకరించాలి..లాక్‌ ‌డవున్‌ ‌సడలింపు కరోనా కు కాదు జన జీవితాలకే..
– కె.శ్రీనివాస్‌ ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్, 9346611455

Leave a Reply