కొవిడ్ 19 వైరస్ రాష్ట్రంలో నియంత్రించగలిగినందుకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అభినందించారనీ, అయినంతమాత్రాన రిలాక్స్ అవ్వొద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అప్రమత్తత కొనసాగించాలని పేర్కొన్నారు. శనివారం మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపోహలు, అనుమానాల నేపథ్మంలో భరోసా కలిగించేందుకే గాంధీ ఆసుపత్రిలో కొవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వ్యక్తి దగ్గరికి స్వయంగా వెళ్లి వచ్చానని మంత్రి తెలిపారు. అతని ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాననీ, వేగంగా కోలుకుంటున్నానని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.
గాంధీ ఆసుపత్రిలో కొన్ని మార్పులు చేయాలనీ, చికిత్స అందిస్తున్న 7వ అంతస్తులోకి ఎవరూ ప్రశ్నించకుండా అన్ని ద్వారాలు మూసివేయాలని సూచించారు. విదేశాలకు వెళ్లి వచ్చిన లేదా వారితో కలసి ఉండి జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వారికి ఒక దగ్గర, విదేశాలకు వెళ్లి వచ్చి కరోనా వైరస్ లక్షణాలు లేని వారిని మరో వార్డులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. గాంధీకి వస్తున్న ప్రతీ ఒక్కరినీ వైరస్ పాజిటివ్‌గా ఉంటే ఎలా ప్రోటోకాల్ పాటిస్తామో అలాగే జాగ్రత్త వహించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతీ వ్యక్తి గాంధీ ఆసుపత్రికి రాకపోయినా లక్షణాలు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటి వద్దనే ఐసోలేషన్ వార్డులో ఉండాలనీ, ప్రతీ రోజు వైద్య సిబ్బంది వారి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఎసిడిసి ప్రతినిధులు డా.ప్రవీణ్, డా.ప్రణయ్‌లతో పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కొవిడ్ 19 వైరస్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమావళిని వారు మంత్రికి వివరించారు.
డీఎంహెచ్వోలతో సమావేశం:
కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటల రాజేందర్ అన్ని జిల్లాల వైద్య శాఖాధికారులతో శనివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఉండేలా చూడాలనీ, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతీ వ్యక్తి డాటా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాలకు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి వివరాలు సేకరించి ఐసోలేషన్‌లో ఉంచాలని ఆదేశించారు. కరోనా భయం పోగెట్టేందుకు సెక్రటరీ స్థాయి నుంచి ఆశా వర్కర్ అందరూ సమన్వయంతో పనిచేయాలని దీనికి డీఎంహెచ్వోలు బాధ్యత వహించాలని సూచించారు.