Take a fresh look at your lifestyle.

బంధన తెంచుకుని బంధువుల చెంతకు…

తినడానికి తిండిలేక, ఉండేందుకు గూడులేక, చేతినిండా పనిలేక గత మండలం రోజులుగా లాక్‌డౌన్‌ ‌దీక్షలో మగ్గుతున్న వలస కార్మికులకు శుక్రవారం ఒక్కసారే స్వేచ్ఛ లభించినట్లైంది. అయినవారిని వేల కిలోమీటర్ల దూరంలో వదిలి బతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకుని వచ్చిన వీరిని తమ స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్య పంజరంలోని చిలకను బంధవిముక్తి చేసినట్లైంది. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మరో కొద్ది గంటల్లో తమవారిని కలుసుకోబోతున్నామన్న ఉత్సాహం వారిలో కనిపించింది.

దాదాపు రెండు నెలలకాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా మహమ్మారి బతుకుదెరువు కోసం ఊళ్ళు పట్టుకుని తిరిగే వలస కూలీల పాలిట గ్రహణంగా మారింది. ఒక రాష్ట్రమని, ఒక ప్రాంతమని కాకుండా దేశంలోని ఏ ప్రాంతంలో చూసినా మరో రాష్ట్రం నుండి కూలిపనుల కోసం వలస వచ్చినవారు వేలు, లక్షల సంఖ్యలోనే కనిపిస్తారు. వీరంతా రోజువారీ కూలీపైనే జీవనం సాగిస్తున్నవారే. వీరికి పని ఉంటేనే రోజు గడుస్తుంది. అలాంటి వారిపైన దాదాపు నెలన్నర కాలంగా లాక్‌డౌన్‌ ‌కన్నెర్ర చేసింది. ఆ విధంగా బీహార్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌, ‌జార్ఖండ్‌, ‌రాజస్థాన్‌, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఏపి లాంటి రాష్ట్రాల నుండి ఇటుకల తయారీ, భవన నిర్మాణం, నీటి ప్రాజెక్టుల నిర్మాణం, వివిధ రంగాల పరిశ్రమల్లో పనిచేయడానికి మనరాష్ట్రానికి కూడా దాదాపు మూడున్నర లక్షలకు పైగా వలస కూలీలు వచ్చినట్లు ఓ అంచనా. వీరిలో చాలా మంది తమ పిల్లలను, వృద్ధులైన తల్లిదండ్రులను గ్రామాల్లో వదిలివచ్చినవారె. లాక్‌డౌన్‌తో ఎక్కడి వారక్కడ స్థంభించిపోవడంతో ఎవరి ఆరోగ్య పరిస్థితిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. కాగా, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులెవరూ భయపడాల్సిన పనిలేదని, అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలంగాణ సర్కార్‌ ‌వారికిహామీ ఇచ్చినప్పటికీ వేలాదిమంది తమ స్వగ్రామలకు వెళ్ళేందుకే వారు మొగ్గుచూపారు.

ప్రభుత్వం చెబుతున్నట్లుగా సహాయం వారిచెంతకు చేరకపోవడం, గత నెల వేతనాలను సంబంధిత యాజమాన్యాలు చెల్లించకపోవడం ప్రధానకారణంగా మారింది. కొరోనా నేపథ్యంలో ఎవరు ఆకలితో బాధపడవద్దని చెబుతున్నప్పటికీ ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తున్న ప్రభుత్వంగాని, కొన్ని స్వచ్ఛంద సంస్థలుగాని పట్టణాలకు, నగరాలకే పరిమితం కావడం, ఎక్కడో మారుమూలల్లో పనిచేస్తున్న వారికి అవిచేరక పోవడం, వారి ఆకలిబాధ వారిని తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు వివశులను చేసింది. అ ఆకలే ఆక్రోశంగా మారి పోలీసులపై తిరుగబడడానికి కారణమైంది. సంగారెడ్డి జిల్లాలో జరిగింది అదే. జిల్లాలోని కంది వద్ద కడుతున్న ఐఐటి భవన నిర్మాణంలో దాదాపు రెండువేల నాలుగువందలకు పైగా కూలీలు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పనులు చేస్తున్నారు. వారికి నిర్మాణ సంస్థలు గత రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం, లాక్‌డౌన్‌ ‌కారణంగా పనికూడా లేకపోవడంతో అసహనం వారిలో ఆగ్రహంగా మారింది. తమను వెంటనే తమ స్వస్థలాలకు వెళ్ళనీయాలని డిమాండ్‌చేస్తూ రోడ్లపై బైటాయించడం, పోలీసుల లాఠీఛార్జీ, తిరిగి వాళ్ళ రాళ్ళదాడి ఏమైతేనేమి జిల్లాకలెక్టర్‌ ‌జోక్యంతో అప్పటికైతే ఆ సమస్య చక్కబడింది. ఇలాంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్నా ఎవరూ కదలేని పరిస్థితి. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో గత మార్చ్ 22‌నుండి దేశ వ్యాప్తంగా విమాన, రైలు, రోడ్డుమార్గాలన్నీ స్థంబించిపోవడంతో వలస ప్రాంతంలో ఉండలేక, తమ గ్రామాలకు వెళ్ళే రవాణా సదుపాయం లేకపోవడంతో చాలామంది కాళ్ళకు బుద్ధిచెప్పారు. ఏనాడు కనీవినీ ఎరుగని రీతిలో వందల కిలోమీటర్లు తమ పిల్లాపాపలతో అడవిమార్గాలను దాటుకుంటూ కాలినడక సాగించారు. ఎన్నో ఆటంకాలను, మరెన్నో విషాధాలను చవిచూడాల్సిన పరిస్థితి. తెలంగాణలోని ములుగు జిల్లా నుండి తమ స్వస్థలమైన ఛత్తీస్‌ఘడ్‌కు నడవడం కారణంగా తమ 14 ఏళ్ళ పాపను పోగొట్టుకుందో తల్లి. తమ గ్రామానికి మరో 14 కిలోమీటర్ల దూరంలోనే ఈ హృదయ విదారక సంఘటన జరిగింది. బతుకుదెరువుకోసం బెంగుళూరు వెళ్ళిన ఏపిలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వందకిలోమీటర్లు ఎండలో నడిచి అలసి మృతి చెందడంలాంటి సంఘటనలెన్నో. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతనచ్చచెప్పినా ప్రధానంగా వలస కార్మికులు వినిపించుకునే పరిస్థితి ఎక్కడాలేకుండా పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు లాక్‌డౌన్‌ ‌కారణంగా నిలిచిపోయిన వలసకూలీలు, విద్యార్థులు, పౌరులను తమ స్వస్థలాలకు పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అందులో భాగంగానే మొదటిసారిగా తెలంగాణ వలస కార్మికులకోసం ఏర్పాటు చేసిన 22 బోగీలతో కూడిన ప్రత్యేక రైలు సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి భవన నిర్మాణ కార్మికులు 1240 మందితో లింగంపల్లి రైల్వేస్టేషన్‌ ‌నుండి శుక్రవారం తెల్లవారుజామున రాంచీ బయలు దేరింది. కేరళనుండి మరో ప్రత్యేకమైన రైలు ఒడిశాకు, అలాగే గుజరాత్‌ ‌నుండి విజయవాడకు 12 బస్సుల్లో సుమారు తొమ్మిది వందలమంది, అనంతపురంనుండి కదిరికి ఇలా ఏ రాష్ట్రానికి చెందిన వారారాష్ట్రాలకు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. కర్నాటక ప్రభుత్వం కూడా సుమారు పదకొండు రాష్ట్రాల్లో ఉన్న తమకార్మికులు, పౌరులు, విద్యార్థులను తమ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. వివిణ దేశాల్లో చిక్కుకున్న తమవారికోసం ఆయా దేశాలుకూడా తమ వంతు ప్రయత్నాలను మే 3 తర్వాత ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇదిలాఉంటే భారత్‌లో పెరుగుతున్న కోవిడ్‌-19 ‌మే 21నాటికిగాని అదుపులోకి వచ్చేఅవకాశాలులేవని ముంబాయి స్కూల్‌ ఆప్‌ ఎకనమిక్స్ అం‌డ్‌ ‌పబ్లిక్‌ ‌పాలసీ అధ్యయనం తెలుపడంతో లాక్‌డౌన్‌ ‌తొలగింపుపైన ఒకవైపు సందేహాలు వ్యక్తమవుతుండగా, ఆయారంగాల్లో పనిచేసే కార్మికుల కరువేర్పడనుందన్న భయాందోళనను పారిశ్రామిక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

image.png

మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌

Leave a Reply