- జనవరి 26 వరకు కార్యాచరణ ప్రకటించిన రైతులు
- నేడు ఢిల్లీలో 26న నిర్వహించే ట్రాక్టర్ల ర్యాలీకి రిహార్సల్
- వర్షంలోనూ ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఉద్యమం
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో గత నెల రోజులకు పైగా వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే విధంగా నేడు ఉదయం 11 గంటలకు రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని నాలుగు ఆందోళన ప్రాంతాల నుంచి ఇది ప్రారంభం కానుంది. ‘సింఘు నుంచి టిక్రి, టిక్రి నుంచి షాజహనపూర్, ఘాజిపూర్ నుంచి పల్వాల్, పల్వాల్ నుంచి ఘాజిపూర్ వరకు ర్యాలీలు జరగనున్నాయి. అయితేజనవరి 26న నిర్వహించే ‘ట్రాక్టర్ల ర్యాలీ’కి ఇది రిహార్సల్‌గా జరగనుంది. ‘ఇతర రైతు సంఘాలతో కేంద్రం చర్చలు
జరపడం, సవరణలతో సరిపెడతామనడం సరికాదు.
సమస్య పరిష్కారంపై కేంద్రానికి శ్రద్ధ లేదని అర్థ అవుతోంది. దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం తీవ్రతరం అవుతోంది. ఈ నెల 8న కేంద్రం రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తాం. 13, 14 తేదీల్లో లోహ్రి, మకర సంక్రాంతి సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేస్తాం. జనవరి 18న ‘మహిళా కిసాన్ దివస్’ ఆందోళనలు చేపడుతాము. జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ‘ఆజాద్ కిసాన్‘ఆందోళనలు చేపడతాం. జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్ నిర్వహిస్తాం’ అని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఇదిలా వుంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో నిరసన చేస్తున్న రైతులను ఒకవైపు చలి, మరొకి వైపు వర్షం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. చలి ముందుగా తెలిసిందే కాబట్టి.. చలిని తట్టుకునేలా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతోంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన వర్షానికి రైతులు అతలాకుతలం అయ్యారు. దీంతో వాళ్లు వర్షాల నుంచి తట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాత్కాలిక వాటర్ ప్రూఫ్ టెంట్లను నిరసన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు.
తమ ఆందోళన మరిన్ని రోజులు కొనసాగాలంటే ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతు సంఘాలు పేర్కొన్నాయి. కేంద్రం నూతనంగా తీసుకువొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 28 నుంచి ఢిల్లీ సరిహద్దులో రైతులు నిరవధిక నిరసన చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో ఏడు దఫాలు చర్చలు జరిగినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. మరోసారి 8వ తేదీన చర్చలు చేపట్టేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. మరోవైపు మూడు సాగు చట్టాలను తక్షణం రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. రైతుల గోడు వినడం ప్రభుత్వం బాధ్యతని పేర్కొన్నారు. రైతుల డిమాండ్లలో ఏమాత్రం తప్పులేదని ఆయన పునరుద్ఘాటించారు. ‘రైతులతో తగినన్ని సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్త చట్టాలు కేంద్రం తీసుకురావొచ్చు. రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించుకున్నాం. మరోసారి ఆ పని చేయవచ్చు. కొత్తగా తెచ్చిన చట్టాలను రద్దు చేయవచ్చు. రైతులు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. రైతు వాణి వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ అని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పంజాబ్‌లో ఇప్పటికే కొత్త సాగు చట్టాలను అమలు చేస్తున్నారంటూ వస్తున్న కొన్ని వార్తలు పూర్తిగా బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని అమరీందర్ సింగ్ కొట్టిపారేశారు. ఆహార మంత్రి భరత్ భూషణ్ అషు చేసిన ప్రకటన ఒక వార్తాపత్రిక వక్రీకరించగా, మిగతా వాళ్లు ఆ పత్రికనే అనుసరించారని అన్నారు. కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకించి, చట్టాల దుష్పభ్రావం పడకుండా బిల్లులకు సవరణ తెచ్చిన మొదటి రాష్ట్రం పంజాబ్ అని ఆయన గుర్తుచేశారు. తమ సవరణ బిల్లులను గవర్నర్ కూడా రాష్ట్రపతి ఆమోదానికి పంపారని, అయితే అవి అక్కడే ఉండిపోయాయని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. రైతులు, వారి కుటుంబాలకు చేయగలిగినంద సాయం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా ప్రభుత్వానికి తెలియజేసేందుకు రెరడు హెల్ప్లైన్లు కూడా ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు.
Nice info