Take a fresh look at your lifestyle.

ఆర్థిక రంగానికి కోలుకోని దెబ్బ

“అంతర్జాతీయ ఆర్థిక సంస్థల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొరోనా వైరస్‌ ‌కొట్టిన దెబ్బకు మన దేశ ఆర్థిక రంగం 9 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉందంట. ఈ మొత్తం భారత జీడీపీలో దాదాపు 4 శాతానికి సమానం అని  ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ ‌వేసిన అంచన. ఈ పరిణామాలతో 2020-21 ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి అంచనాలు తగ్గటంలో ఆశ్చర్యం ఏమీ ఉండదు. ముందస్తు అంచనా 5.2 నుంచి మరింత తగ్గించి 3.5గా జీడీపీ వృద్ధి రేటు ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు లెక్కలు కడుతున్నారు.”

Rehanaకరోనా మహమ్మారి విసిరిన పంజాకు యావత్‌ ప్రపంచం వణుకుతోంది. ప్రస్తుతం ఎవరికి ఎవరి నుంచి వ్యాధి సోకుతుందో అన్న ఆందోళన, వ్యాధి వ్యాప్తిని అరికట్టడం, చికిత్స, సదుపాయాలు, తినటానికి తిండి గింజల లభ్యత… ఇవే మన ముందు ఉన్న సవాళ్లు. పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుంది అని అడిగితే తలపండిన వైద్యరంగ నిపుణులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ఎన్నో రకాల విపత్తులను చూసిన మానవ సమాజం తాజా ఉపద్రవం నుంచి కూడా బయటపడుతుంది. వైరస్‌ను అరికట్టడంలో విజయం సాధిస్తుంది అని ఒక ఆశావాహ దృక్పథంతో చెప్పవచ్చు. కాని కరోనా దెబ్బ ఇక్కడికే పరిమితం కాదు. వైరస్‌ను తరిమికొట్టగలిగి, లాక్‌డౌన్‌ను ఎత్తేసిన తర్వాత అసలైన సవాళ్లు మన ముందుకు రానున్నాయి. కుదేలవుతున్న ఆర్ధిక రంగాన్ని రిపేర్‌ చేయటం అంత తేలిగ్గా, అంత తొందరగా సాధ్యమయ్యే అంశం కాదు.
ఇప్పటికే బడుగు, బలహీన వర్గాలు ఉపాధి కోల్పోయాయి. వేలాదిగా వలస కార్మికులు పనులు లేక, పస్తులుండలేక పల్లెబాట పడుతున్నారు. వెళ్లేందుకు ప్రయాణ సాధనాలు లేకపోయినా, మూట ముల్లే సర్దుకుని, కుటుంబాలకు కుటుంబాలు వందల కిలోమీటర్లు కాలి నడకన వెళ్లటానికి సైతం వెనుకంజ వేయని పరిస్థితులు మనం మీడియాల్లో చూస్తూనే ఉన్నాం. కన్నఊరు ఆదరించకపోతుందా అన్న ఆశ వారిది. దీనితో పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్రం 1.7లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇది సరిపోతుందా? అందరికి ఊరట ఇస్తుందా అనే ప్రశ్నలు పక్కన పెడితే…ఉన్నంతలో ఎంతో కొంత ఊరటగా భావించాలి. కేంద్రం ఇస్తున్నది తాత్కాలిక ఉపసమనాలే. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత లక్షలాది మందికి పోయిన ఉపాధి తిరిగి వస్తుందా? ఆర్ధిక వ్యవస్థకు ఆ వెసులుబాటు దొరుకుతుందా అంటే లేదనే చెప్పాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వేతన జీవులకు కాస్త ఊరట ఇచ్చేందుకు టర్మ్‌ లోన్స్‌ పై మూడు నెలల పాటు మారటోరియం విధించింది. మూడు నెలల పాటు గృహ, వాహన, వ్యక్తిగత లోన్స్‌ వంటి వాటి ఈఎమ్‌ఐలను మూడు నెలల పాటు కట్టనవసరం లేని సౌలభ్యం. అయితే ఇందులో కూడా మరింత స్పష్టత రావల్సి ఉంది. ఆర్‌బీఐ నిర్ణయాన్ని ప్రకటించినా, బ్యాంకులు అమలు చేయాల్సిన అవసరం లేదు సాంకేతికంగా. ఈ అంశాన్ని పక్కన పెడితే…అటు ఉత్పత్తి రంగం పూర్తిగా దెబ్బతింది. లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో పరిశ్రమలు మూతపడ్డాయి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ఈ పరిణామాలు శరాఘాతం అవుతున్నాయి. మొన్నటి వరకు మన దేశం ఆర్ధిక మాంద్య అంచుల్లోనే ఉంది. నెమ్మదిగా తేరుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి అనుకునే లోపు కరోనా రూపంలో ఉపద్రవం ముంచుకు వచ్చింది.
అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కరోనా వైరస్‌ కొట్టిన దెబ్బకు మన దేశ ఆర్ధిక రంగం 9 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉందంట. ఈ మొత్తం భారత జీడీపీలో దాదాపు 4 శాతానికి సమానం అని  ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ వేసిన అంచన. ఈ పరిణామాలతో  2020-21 ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి అంచనాలు తగ్గటంలో ఆశ్చర్యం ఏమీ ఉండదు. ముందస్తు అంచనా 5.2 నుంచి మరింత తగ్గించి 3.5గా జీడీపీ వృద్ధి రేటు ఉంటుందని ఆర్ధిక రంగ నిపుణులు లెక్కలు కడుతున్నారు. మరో సంస్థ కేర్‌ రేటింగ్స్‌ తన తాజా నివేదికలో లాక్ డౌన్ కారణంగా 80 శాతం ఉత్పత్తి నష్టం జరుగుతుందని,  నిత్యావసర సేవలు, వ్యవసాయ రంగంలో 20 శాతం ఉత్పత్తి మందగిస్తుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు రోజుకు రూ.35,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని విశ్లేషించింది. మొత్తంగా రూ.6.3 లక్షల కోట్ల నుంచి రూ.7.2 లక్షల కోట్ల వరకూ ఎకానమీ దెబ్బతింటుందని అంచనావేసింది. ఇవన్నీ మనకు హెచ్చరికలే అని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మన దేశంలో సరైన చర్యలు లేవని మరో బ్రోకరేజీ సంస్థ ఎడిల్వీజ్ విమర్శించింది. ఇప్పటికే డీమోనిటైజేషన్, జీఎస్‌టీ నిర్ణయాలతో అసంఘటిత రంగం కుదేలు కాగా, ఇప్పుడు తాజాగా కరోనాతో మరింత కష్టాల్లోకి నెట్టేసిందన్నది ఈ సంస్థ అభిప్రాయం. ‘దేశవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా పడింది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు సంసిద్ధంగా ఉండండి. రాబోయే వారాల్లో దేశ ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉండే అవకాశముంది. అనవసర, దుబారా ఖర్చులను తగ్గించుకోండి’’  అని మరాఠా లీడర్‌ శరద్ పవార్ చేసిన విజ్ఞప్తి ఇక్కడ గుర్తు చేసుకోదగ్గదే.

 

ఆ రెండు రంగాలకు శరాఘాతం
కరోనా ప్రభావం ప్రధానంగా భారతీయ సేవ, తయారీ రంగం పై ఎక్కువగా పడుతుంది. దేశ జీడీపీలో సేవా రంగం తర్వాత తయారీ రంగానిదే అగ్రభాగం. భారత ఉత్పాదక రంగానికి మూల వనరుగా చైనానే ఉన్నది. కీలక రంగాలన్నింటికి ఇక్కడి నుంచే ముడి సరుకు అందుతున్నది. కానీ కరోనా తీవ్రతకు చైనా కర్మాగారాలన్నీ మూతబడ్డాయి. దీంతో అక్కడి నుంచి వచ్చే విడిభాగాల సరఫరా నిలిచిపోయింది. ఇది తయారీ రంగానికి దెబ్బ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, టోమొబైల్స్‌ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది. రవాణా, రియల్‌ ఎస్టేట్‌, ఎయిర్‌ లైన్స్‌, పర్యాటకం, పౌల్టీ, హాస్పటాలిటీ వంటి రంగాలు కుదేలయ్యాయి. ఇక వైరస్‌ ప్రభావం ప్రస్తుతం చైనా కంటే ఎక్కువగా అమెరికా పై పడింది. అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అమెరికా, యూరప్‌ మార్కెట్‌ పై మన సేవా రంగం ఆధారపడి ఉంటుంది. ఎక్కడో ఎందుకు, ప్రపంచ ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్‌ నగరమే ఇప్పుడు కరోనా దెబ్బకు నిలువెల్లా వణికిపోతోంది. . న్యూయార్క్, న్యూజెర్సీ కనెక్టికట్‌లో 86,361 మంది కరోనా బారిన పడ్డారు. తాజా లెక్కల ప్రకారం సుమారు పదిహేను వందల మంది కరోనాకు బలయ్యారు. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా న్యూయార్క్‌లోని అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఈ పరిస్థితి ఇప్పుడే చక్కబడదని , మరో మూడు నెలల పాటు ఇలాగే ఉంటుందని ఆ రాష్ట్ర గవర్నర్‌ చేసిన ప్రకటనను బట్టి మనం ఆర్ధిక రంగం పై పడే ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. ఈ నష్టం నుంచి బయటపడటానికి లేదా మరింత దివాళ తీయకుండా ఉండటానికి చాలా సంస్థలు చేసే పని ఉద్యోగులకు ఉద్వాసన పలకడమే. తాజా ఆర్ధిక సంవత్సంతో ముగిసిన 40వేల మంది ఉద్యోగుల కాంట్రాక్టుల గడువును సంస్థలు పొడిగించలేదు. సహజంగా వీరు భారతీయుల సంఖ్య తక్కువేమీ ఉండదు. వీరి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారుతుంది. హెచ్‌1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోతారని న్యూయార్క్‌ టైమ్స్‌ అంచనా. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంపే తమ దేశంలో కరోనాతో 2 లక్షల మంది ఉద్యోగాలు ఊడతాయని చెప్పారు. వీరిలో సగం మంది దేశానికి తిరిగి వచ్చినా ఉద్యోగం, ఉపాధి రంగాల పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ రంగానికి ఎటువంటి నష్టం వచ్చినా వెన్ను విరిగేది సగటు వ్యక్తుల మీదే. తమ నష్టాలను పూరించుకోవటానికి అన్ని రకాల రేట్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత సంస్థ నష్టాలు పూరించటానికి స్వయంగా ప్రభుత్వమే బస్సు ఛార్జీలను పెంచింది. ప్రైవేటు వ్యవస్థలు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తాయి. ఓ వైపు ఊడిపోయే ఉద్యోగాలు, మరోవైపు ధరల పెరుగుదల ఎలా ఉంటుందో అని సగటు జీవి ఆందోళన చెందటం కనిపిస్తోంది.

Leave a Reply