Take a fresh look at your lifestyle.

రాష్ట్రవ్యాప్తంగా నిలచిపోనున్న రిజిస్ట్రేషన్లు

తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ నిలిపివేయాలని ఆదేశం

రిజిస్ట్రేషన్ల శాఖకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం తీసుకురానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలచిపోనున్నాయి. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఈ స్టాంపుల విక్రయాన్ని సైతం అధికారులు నిలిపివేశారు. శనివారం వరకు రిజిస్ట్రేషన్లకు సంబంధించి చలానాలు చెల్లించిన వాటికి మాత్రమే సోమవారం ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయించినట్లు సమాచారం.

వీఆర్వోల నుంచి రికార్డులను ఉన్న పళంగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ‌సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హుటాహుటిన తహశీల్దార్లు వీఆర్వోల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో కొత్త రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. ఈ చట్టం ఆధారంగా రాబోయే రోజుల్లో ఎమ్మార్వోల పరిధిలో రిజిస్ట్రేషన్లు చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పూర్తి అధికారాలను ఎమ్మార్వోలకే కట్టబెట్టనున్నందున ఈ చట్టం ఆమలులోకి వచ్చే వరకూ రాష్ట్రంలో భూములకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదనీ ఆ శాఖ సీనియర్‌ అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply