లోతైన భావుకత, పదునైన అభివ్యక్తి తీవ్రతతో ఆలోచనా ప్రవాహమై నిర్ధిష్ట గమ్యం వైపు సాగే కవిత్వం గుణాత్మక మార్పుకు తోడ్పడి ప్రామాణికతను సంతరించు కుంటుంది. పోరాటమే లేకుంటే జీవితమేలేదు. సమాజ జీవితాన్ని వస్తుగతం చేసుకుని దృశ్యీకరణగా మారకుండా కవిత్వం మనుగడ సాగించలేదు. పాలబువ్వ ఉన్న వెండిగిన్నెను బూచోడెత్తుకుపోతే ప్రేమరాహిత్యంగా, బెంగగా, బరువుగా మిగిలిన పసి హృదయపు ఖాళీ జీవితానికి ప్రాణ స్పర్శను పంచకుండా కవిత్వం కొనసాగలేదు. బలీయమైన అంతరాల్లోని భావాలను కవిత్వపు శిలాఫలకంగా చెక్కారు ప్రముఖ కవయిత్రి దేవనపల్లి వీణావాణి. ఆ పాటను మళ్లీ మళ్లీ వింటానని అనడంలో రాలిపోయిన పువ్వులను కొమ్మలతో అతికి ప్రాణస్పర్శను కలిగించారు. తూలిపోతున్న అడుగులు జతపడి ఆగకుండా సాగి నడవాలని భావించారు. చెవిలో మోగిన కమ్మని పదాల వాయిద్యాన్ని పాట నేపథ్యంలో విన్నారు. అగాధాన్ని పూడ్చడానికి బ్రహ్మాస్త్రమైన పాటను ఎంచుకున్నారు.
చెట్టు కొమ్మలో దాగిన పొద్దుగూకిన బతుకు గోసలకు సాక్ష్యాన్ని వెతికారు. ఊడలై సాగిలబడ్డ కాలం బరువును మోస్తున్న చెట్టును చరిత్రగా భావించారు. రాకుండా నాకేం చెప్పాలని/ అనుకున్నావో అదే బహుశా/ నేను రాసితెచ్చి ఉంటాను/ మన ఇద్దరిది ఒకే మాట కదా అని ధ్రవించని కర్పూరపు బిళ్లలా కొన్ని ప్రేమలు మండిపోవచ్చని మనస్సులోని వేదనను ఫలించని పుష్పం చేశారు. ఏ పరిశీలనకు లొంగని దేహభాషతో చాలా మందే ఉన్నారని చెప్పారు. గోడల మీద చీమల బారుకు తీరిక లేదని సమాజ పోకడను విశ్లేషించారు. గాజు అరలో చేప పిల్ల ఈదడంలా మారిన జీవితాన్ని చూపారు. నిశ్శబ్దపు గాలిలోని నిట్టూర్పును వినిపించారు. మడతపెట్టిన కాగితంలోని ఆఖరి దుఃఖాన్ని ఒడగట్టారు. దోసిట్లో రాలిన కన్నీటి శకలాల కాలసూచీని నిర్ధారించారు. ఎన్నో జరిగినా మళ్లీ కదిలేందుకు మర్చిపో అన్న మూడక్షరాల మంత్రాన్ని మనిషికి గుర్తు చేశారు. అప్పుదాతల అంగుట్లో జీవిత కాల బందీనయ్యాయని అంటూ జన్మాంతర రుణం తీర్చడానికే పుట్టానేమోనని వేదన పడ్డారు. చెదలు తిన్న మొదలు లోంచి/ పోరాడుతూ పుడుతున్న పిలకలై/ నిన్నా మొన్నటి మాటలు/ మూగగా రోదిస్తాయి అంటూనే ఏం రాయాలో తేల్చుకోకపోయినా ఏదో ఒకటి రాస్తాను అని నిశ్చలాన్ని ప్రకటిస్తారు.
గేటెడ్ కమ్యూనిటీ నగరం అష్టబాహువై/ చుట్టూ ఉన్న రేగడి నేలని/ గడ్డిమోపు గుట్టల్నీ మింగుతోంది అని ముత్యాలు తొడిగిన వీధి గుమ్మాల నడుమ ఎక్కాబుడ్డికి చోటేలేదని బాధపడ్డారు. మనుషులు భిన్న స్థరాలుగా వేరుపడి/ బరువు కొద్ది విసిరివేయబడి తాళాలు బిగించుకున్న/ ఊళ్లలోకి వెళ్లిపోతున్నారన్నారు. ఇంకో ప్రపంచపు గాలివీయనీయని/ అల్లంత గోడల రక్షణ కవచాల మధ్య ఎవరి లోకంలోకి వారి మునక/ ముందుతరాల సమసమాజ సావాసం/ ఎలా కానుందో ఎవరికెరుక అన్న ప్రమాద ఘంటికను స్పష్టంగా గుర్తు చేశారు. నేల రాలిన ఆకుల గాలి చాటింపు తప్ప వాటి గమనపు గుణం మౌనమే అన్న కాల సత్యాన్ని చాటారు. మనిషి శబ్దం గాలికి తెలిసింది/ మట్టీ చెట్టూ ఆత్మహత్య చేసుకున్నాయి అని నిర్వేదం ప్రకటిస్తారు. అసలు తప్పిపోవడమే/జీవిత ఎముక మూలుగైనప్పుడు /కొత్తపొద్దు మొలుస్తున్న ప్రతిసారీ ఇంకా తప్పిపోతునే వున్నాను అని సంఘర్షణల వేటును తెలియప రుస్తారు. గొడ్డలి అంచు మీద అడవి వేదననువినిపించికాళ్లు నరుక్కుంటున్న మనుషుల్ని చూపించారు. జీవితం లాగే అంతుబట్టని లవణసమ్మేళనపు లోతు సముద్రమని, జీవత్వాన్ని, అల్పత్వాన్ని ఎగిసే చిన్ని అలలో చూడమంటారు. ప్రకృతికి మనిషి క్షమాపణ అనే బాకీని పశ్చాత్తాపంతో తీర్చాలంటారు. ఎండుకళ్ల జబ్బు సోకితే కన్నీళ్లు రావని అన్నారు. వాస్తవాల చెట్టు మీద వాలిపోతుంటానని చెప్పారు. టెర్మినేటెడ్ సీడ్లో దాగిన కత్తుల్లేని యుద్ధంలో అంతరించే రైతును శాస్త్రం పిలుచుకున్న శిథిలస్థరంగా చెప్పారు. అక్కడ రైతంటే మనిషేనని నిర్ధారిస్తారు. దొండ పందరిపై చెట్టు పోరాటాన్ని తీగల చిగురుగా పరిచారు. నేలతోనో/ గాలితోనో/ నెమలి కళ్లలో/ కళను చూసి మొగులంత మొఖంతో/ ఏదో మోసుకొని వచ్చే బడి మల్లెమొగ్గలైన పిల్లలు రేపటి పొద్దుపొడుపులని అన్నారు. కంటి వరదను ఎత్తిపోసే పనిలో చేతులు మునిగిపోయాయని చెప్పారు. నువ్వు ముందో నేను ముందో ఒకసారి వెళ్లలేని ఇరుకు దారిలో ఎవరికి తెలుసు అని ప్రశ్నిస్తారు. జవాబు లేని ప్రశ్న గాయాల గట్లమీద పచ్చని సంతకం అంటారు. నేలను తాకుతూ నడవాలనే ఆశ తీరేట్టు లేదని బాధపడ్డారు. నైపుణ్య చకోరాల చేతి నెగళ్లలో తెగిన చెప్పుతో నడుస్తూ అన్నాన్ని వెతుక్కునే మూలమలుపు చెట్టు నిట్టూర్పును చూపించారు.
చూరు కింద ఎంగిలిపడని మధుర పదార్థం ఏదీ లేదన్నారు. చిట్టిచీమ బుజ్జినడకలో ఒద్దికను బుద్ధి జీవులు గమనించాలన్నారు. గిరిగీసుకున్న తోటల్లో గాజుల పువ్వుల్లా ఒంటరి దీపాల పరితపనను చెబుతూ ఆత్మగీతికి జ్ఞానగంధం అద్దుకొమ్మన్నారు. రబ్బరు బంతి రెప్పలతీరం దాటదన్న విషాద గీతాన్నీ వినిపించారు. కనపడని కోరికల తడికలున్నయి జర భద్రం అని హెచ్చరించారు. ఎర్రబడ్డ కళ్ల చివరి కన్నీటి బొట్టై అనంత విశ్వం వెళ్లిపోతుందన్నారు. ఒక్కతీరుగానే అంతా సహజమే అన్నట్టుగా మాయమైపోతు న్నామన్నారు. తనను తానే వంచుకొని ముళ్లను పెంచుకొనే తీగ అల్లాడిపోతూ అందకుండా పోతున్నదని జీవితపు అగమ్య గోచరాన్ని తెలిపారు. పండుటాకుల గుండె బాధను వినమ న్నారు. నోటికాడి బుక్కకు కాచుకున్న రాహుపాదంపై మట్టి సైన్యంతో కత్తులెత్తమన్నారు. వినాశనం శపించకముందే సానుభూతి మాటలు వదిలి మేధావుల్ని నిద్రలేవమన్నారు. పచ్చిబురదలో నత్తగుళ్లనైతే బాగుండేది అంటారు. లెక్కకందని వాడిని లెక్కల్లో ఇరికించి లెక్కించినందుకు పూలకొమ్మ నవ్విందని అధిక్షేపిస్తారు. చిన్నిచేతులు జన్మదాతల అర్థ చిత్రాన్ని గీసుకున్నాయన్న సత్యం తెలిపారు. సంబురం కోల్పోయి ఏకాకిగా మిగిలిన శిలాఫలకం ఎప్పుడో ఒకరోజు చరిత్రకు రాతిముద్దలాంటి మొదటి మెట్టేనని అన్నారు. ఏసీ గదుల్లో సమావేశం వాగ్దానాలను చప్పరించి తేనీటికప్పులోకి జారి వృథాగా ముగిసిన సమయమని తేల్చారు. ఉల్లిపాయ-కాకి నేపథ్యంగా అహం చుట్టూ పేరుకున్న కోరికల పొరలను వొలిచి తెరలేని సత్యాలను ఆవిష్కరించారు. జీవన నౌకను ఈదే తెరచాపను సౌందర్యశాలగా పరిమళిం పజేశారు. కత్తుల్లేని పని యుద్ధానికి సిద్ధపడ్డ ఆదివారపు పనిపాట్లను భుజం సంచుల బాధలుగా చూపారు.
గోడలను పెళ్లగించే వేళ్లముద్ర కాలానికి కిరీటం తొడిగి తలెత్తి గర్వంగా నిలబడుతుందని భరోసా వాక్యం పలికారు. బోలుగిన్నెలో ఆకలికి మారిన అర్థాన్ని గ్రహించారు. ఇక్కడి మెతుకు మీద నా పేరు లేదు/ ముంతలో నీళ్లు గొంతులోకి జారిపోతూ గుండెకు తడి అద్దుతాయి అన్న వాక్యాలు ఆలోచనల లోతుల్ని చూపాయి. ఓడిన వాడి విధిరాతల నివాళిని మనస్సుకు వేలాడదీశారు. వీపుపై వాతలను ఎదురుపడ్డ నిప్పులుగా చూపి మెత్తని పొత్తిలి వేసి చలువ చందనం పూసి తేనె చుక్కల, పూల మొగ్గల లేపనం అద్దమన్నారు. నిష్క్రమణ వెనుక నిజంగా సహనాన్ని నిలబెట్టారు. నాలుగు మూలల గదికి ఐదో స్తంభం ఎంత ముఖ్యమో చెప్పారు. ఏమీ తెలియని తనంలో ఉన్న కూలీ తాతనే నిజంగా జీవించడం తెలిసినవాడన్నారు. ఆఖరి గంటలో అలుసై పోతున్న బొమ్మల ఆనవాళ్లను గుర్తు చేశారు. ఆకలి వెతల బాటలో మెరుస్తున్న ప్రకటనే సిరాచుక్క అన్నారు. నిలువెత్తు జీవావస్థ స్వాంతన కోసం అనుక్షణం పడే వెంపర్లాటను గమనించమన్నారు. పక్షి మరిచిన గూడు/ దయ్యాల దిబ్బ/ అయినా చెట్టుదెంత సహనం అని శాశ్వత సత్యాన్ని చెప్పారు. వెంటాడే జ్ఞాపకం ఒక దీర్ఘరోగమైతే మరుపు దివ్య ఔషధం అని అన్నారు. ప్రలోభాల వేలంపాటల గాలివాటుకు చెట్టుమారినా పిట్టల వెతలు పరీక్షలే అన్నారు. కలుపు మొక్క కొత్తపేరును ప్రపంచ మొక్కగా ప్రకటించారు.
చర్విత చరణ చరిత్రగా శిథిలమై నది ఆగక ప్రవహిస్తూనే ఉందంటారు. నాన్న గొడుగు, అమ్మ పొత్తిలి లేని ఒంటరి నర్సరీ మొలక తొలి అడుగుల్ని చూపారు. మొలకలో దీపమైన అడుగు చప్పుడును విన్నారు. ఎగతాళో, నిందో తెలియక పొగడ్తల్లో మునిగిపోయిన పురోగామిని గమనించారు. అబద్ధం తుపాను/ నిజం తుంపర అంటూ అబద్ధం ఎన్నటికి నిజం కాదు/ నిజం ఎప్పటికీ అబద్ధం కాలేదు అని తేల్చారు. అరగదీసిన జీవితంపై స్పర్శలా వర్షం పడితే బాగుంటుందన్నారు. జల్లెడగా మారడం తప్ప చేసేది, రాసేది ఏముంటుందని వేదన చెందారు. నడిచే తొవ్వ మధ్య విభాజినిగా నిలబడ్డ అనుభవాన్ని ప్రస్తావి ంచారు. కదలకపోతే ఈడ్చుకు పోయే అలవాటును పెంచుకో మన్నారు. భూమిని సంపదకు చిహ్నంగా చెప్పి దానిని బలం ఉన్న భుజం మీద సిరుల పాలకుండగా చూపారు. మానవత్వం లేని మనుగడను కాలిపోతున్న వాసన అన్నారు. విశుద్ధ గీతాలు, విడిపోని స్నేహాలను వివరించారు. ముక్కచెక్కలైన ఆవర్తన రేఖల్లోని పరావర్తనంగా ఈ కవిత్వం బహుముఖంగా విస్తరిల్లింది. నిత్య జీవనతంత్రాల సూత్రీకరణలో మనిషి మనోఫలకపు మెలకువల లోకాన్ని తట్టిలేపిన ఈ ఉద్విగ్న ప్రయత్నం కవిత్వ కార్యాచరణకు నిదర్శనం.
– డా. తిరునగరి శ్రీనివాస్
8466053933