Take a fresh look at your lifestyle.

టాస్క్ ‌ఫోర్స్ ‌దాడులతో.. రాష్ట్రంలో తగ్గిన నకిలీ విత్తన విక్రయాలు ..!

  • కల్తీ రహిత విత్తన రాష్ట్రంగా తెలంగాణ
  • అధికారులతో వ్యవసాయ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
  • ‌కల్తీ విత్తన విక్రయదారులపైనే కఠిన చర్యలు : డిజిపి ఎం.మహేందర్‌ ‌రెడ్డి

నకిలీ విత్తనాల నియంత్రణ, విక్రయదారులపై పోలీస్‌, ‌వ్యవసాయ శాఖలచే ఏర్పాటైన ప్రత్యేక టాస్క్ ‌ఫోర్స్ ‌బృందాలు చేపడుతున్న దాడులు సత్ఫలితాలనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం నుండి మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి, డీజీపీ ఎం మహేందర్‌ ‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ ‌రావు, ఐజి నాగిరెడ్డి లతో కలసి రాష్ట్రంలోని పోలీస్‌ ‌కమిషనర్లు, ఎస్‌పీలు, డిఎస్పీలు, వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభినందించారు. నకిలీ విత్తన విక్రయదారులు తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తేనే భయపడే స్థితికి వొచ్చారని, అయినప్పటికీ అక్కడక్కడా ఇంకా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు తనిఖీల్లో బయట పడుతున్నదని అన్నారు.

వ్యవసాయ సంబంధిత విత్తనాలు కంపెనీలకు లైసెన్స్‌ల జారీలో ప్రస్తుతం ఉన్న కొన్ని లోపాలను సవరించి మరింత సరళతరంగా జారీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. కల్తీ రహిత విత్తన రాష్ట్రంగా తెలంగాణను రూపొందించాలని అన్నారు. ఈ సందర్బంగా డీజీపీ ఎం.మహేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రేతలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 320 మందిఫై 209 కేసులు నమోదు చేసి 6511 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాదీన పర్చుకున్నామని వివరించారు. వీరిలో నలుగురిపై పీడీ కేసులు కూడా నమోదు చేశామని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం విత్తన బాండాగారంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రస్తుత తనిఖీల్లో కరుడు గట్టిన కల్తీ విత్తన విక్రయదారులపైనే కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే, పోలీస్‌ ‌శాఖ చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రంలో నకిలీ విత్తనాలు బెడద గణనీయంగా తగ్గించగలిగామని అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ‌ఫోర్స్ ‌బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు.

ఇతర రాష్ట్రాల నుండి కల్తీ విత్తనాలను అక్రమంగా రవాణా చేసి విక్రయించే కరడు గట్టిన నేరస్తులపై కూడా పీడి చట్టాన్ని పెట్టాలని తెలిపారు. ఎన్ని కేసులు నమోదు చేసామన్నది ప్రధానం కాదని, ఆయా కేసుల ద్వారా ఏర్పడ్డ ప్రభావం ఎంతనేదే ప్రధానమని అన్నారు. వివిధ జిల్లాల్లో కల్తీ విత్తన నివారణపై చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఎదురైన అనుభవాలు, పరిశీలనలు, సూచనలతో కూడిన సవివర నివేదికలను పంపిస్తే, వీటి ప్రాతిపదికన రానున్న రోజుల్లో నకిలీ విత్తనాల నిరోధంపై మరింత సమర్థవంతంగా వ్యవహరించే అవకాశం ఉందని అన్నారు. ఐజీ నాగిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మరో పదిహేను రోజులు నాట్లు పడే సమయం ఉందని ఈ సమయంలోనే నకిలీ విత్తనాల చేలామని పై కఠినంగా వ్యవహారించాలని కోరారు. న్యాయబద్ధంగా విత్తన వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేశారు. నిరంతరం కల్తీ విత్తన వ్యాపారానికి పాల్పడే వారిపై హిస్టరీ షీట్‌లను తెరచి, సంబంధిత స్టేషన్‌ ‌లకు కూడా సమాచారం అందించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో విత్తనాభివృద్ధి సంస్థ ఎండి కేశవులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply