Take a fresh look at your lifestyle.

మళ్ళీ విమోచన లొల్లి

సెప్టెంబర్‌ ‌వొస్తుందనగానే విమోచన, విముక్తి లొల్లి మొదలవుతుంది. సెప్టెంబర్‌ 17‌కు చరిత్రకారులు ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో భాష్యం చెబుతున్నా, శతాబ్ధాల రాజరికం నుండి ఈ ప్రాంతానికి విముక్తి లభించింది మాత్రం అదే రోజన్నది నిర్వివాదాంశం. దాన్ని ప్రత్యేక రోజుగా ప్రభుత్వం పరంగా గుర్తించాలన్న విషయంలోనే చాలా కాలంగా వివాదం జరుగుతున్నది. తాజాగా కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మరోసారి దీని ప్రస్తావన తేవడంతో ఇది తిరిగి రాష్ట్రంలో చర్చనీయాంశ మవుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు ఉద్యమకారులు ఆంధ్రప్రదేశ్‌ అవతరణతో పాటుగా ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్‌ ‌చేస్తూ వొస్తున్నారు.

kishan reddy

అప్పుడు కూడా సీమాంధ్ర పాలనలో బంధీ అయిన ఈ ప్రాంతానికి ఆ ఉత్సవం జరుపుకునే అవకాశం లభించలేదు. వాస్తవానికి తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా అనుమతి నిరాకరించిన ఆనాటి పాలకులకు తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన ఈ సుదినాన్ని ఉత్సవంగా జరుపుకునేందుకు ఎలా ఒప్పుకుంటారు. అయినప్పటికీ ఈ ప్రాంత అభిమానులు తమ స్థాయిలో ఈ వేడుకను సాదాసీదాగా జరుపుకుంటూ వొచ్చారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వ్యక్తి భూపతి కృష్ణమూర్తి. ఆయన ఎవరు వొచ్చినా రాకపోయినా వరంగల్‌ ‌చౌరస్తాకు సమీపంలోని పెట్రోల్‌ ‌బంకు దగ్గర ప్రతీఏటా ఆనాటి తొమ్మిది జిల్లాల స్వేతరంగులోని తెలంగాణ జండాను ఎగురవేసేవాడు.

ఏమైతేనేమి 14ఏళ్ళ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మన రాష్ట్రం, మన పాలన, మన నిధులు, మన నీళ్ళు, మన నియామకాలు అన్న నినాదాలతో ఏర్పడిన మన రాష్ట్రంలో, మనవి అనుకున్నవన్నీ ఇప్పుడు మనకు కాకుండా పోతున్నాయి. అందులో ప్రధానమైనది సెప్టెంబర్‌ 17. ‌నిజాం ఏలుబడిలో ఉండి, భాషా ప్రయుక్త రాష్ట్రాల కారణంగా ఇతర రాష్ట్రాల్లోకి పోయిన ఈ ప్రాంతీయులు నేటికీ ఈ రోజున ఘనంగా వేడుక నిర్వహించుకుంటున్న క్రమంలో అతి పెద్ద ప్రాంతంగా ఉన్న తెలంగాణలో మాత్రం అలాంటి కార్యక్రమానికి నోచుకోకపోవడం పల్ల స్థానిక ప్రజలు పాలక ప్రభుత్వంపై గత ఏడు దశాబ్ధాలుగా తీవ్రంగా విమర్శలు గుప్తిస్తున్నారు. దేశమంతా స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ, దాదాపు ఒకటిన్నర ఏండ్లపాటు నిజాం పాలనకిందనే ఈ ప్రాంతం మగ్గిపోయింది. తన పాలన కిందనే ఈ ప్రాంతాన్ని కొనసాగించాలని వేసిన ఎత్తులు, జిత్తులు ఫలించకపోవడంతో చివరకు ఆనాటి దేశ హోంశాఖ మంత్రి సర్ధార్‌ ‌వల్లభాయి పటేల్‌ ‌ముందు నిజాం తలవొంచక తప్పలేదు.

అంతటి చారిత్రక నేపథ్యం కలిగిన సెప్టెంబర్‌ 17‌ను, క్యాలెండర్‌లో సాధారణ తేదీల్లానే చూడకుండ, ప్రత్యేక రోజుగా గుర్తించి, ఘనంగా వేడుకలు జరుపాలని తెలంగాణ ప్రేమికులు, బిజెపి, వామపక్షాల్లాంటి రాజకీయ పార్టీలు మొదటి నుండీ డిమాండ్‌ ‌చేస్తూనే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలోకి వొచ్చిన తర్వాత బిజెపి ఈ విషయంలో గతంలోకన్నా గట్టిగా పట్టుపడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి లేవనెత్తారు. పర్యాటక, సాంస్కృతిక శాఖను నిర్వహిస్తున్న కిషన్‌రెడ్డి నిజంగానే తెలంగాణ సంస్కృతి అభివృద్ధిని పట్టించుకోవాల్సిన అవసరముంది.

Telangana Redemption Issue Again

అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించాలంటున్నారు. ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్ళకో తలొగ్గవద్దని ఆయన ప్రత్యేకంగా నొక్కి చెబుతున్నారు. వాస్తవానికి ఏదో ఒక రాజకీయ పార్టీకి ఇష్టంలేనంత మాత్రాన ఇంతటి చారిత్రక నేపథ్యం గల రోజును జరుపుకోకపోవడం పట్ల చరిత్రకారులు సయితం విచారం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నారా ? విజ్ఞప్తి చేస్తున్నారా? అన్న విషయాన్ని పక్కకు పెడితే మన సంస్కృతిని, మన చరిత్రను మనమే మరుగు పర్చుకుంటే భావి తరాలకు క్షమించరాని అన్యాయం చేసిన వారమవుతామన్నది మాత్రం నిజం.

Leave a Reply