- తెలంగాణలో హైదరాబాద్ సహా ఆరు ..
- ఎపిలో ఐదు జిల్లాల గుర్తింపు
- కొత్త జోన్లను ప్రకటించిన కేంద్ర ఆరోగ్యశాఖ
- కార్యదర్శి ప్రీతి సూడాన్ వెల్లడి
కేంద్ర ఆరోగ్యశాఖ కొరోనా జోన్లపై కొత్త జాబితాను రిలీజ్ చేసింది. దేశంలో కొరోనా వైరస్ కేసులు ఉన్న ప్రాంతాలను మూడు జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రెడ్, ఆరెంజ్, గ్రీన జోన్ల వివరాలను వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఈ వివరాలను తెలిపారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆమె దీనికి సంబంధించి లేఖలు రాశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తూ జాబితాను రిలీజ్ చేశారు. రికవరీ రేటు పెరిగిన తర్వాత కొత్తగా ఈ జోన్ల జాబితాను తయారు చేశారు. తాజా జాబితా ప్రకారం 130 జిల్లాలు రెడ్ జోన్లో, 284 ఆరెంజ్ జోన్, 319 గ్రీన్జోన్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 35 వేలు దాటింది. మరణించిన వారి సంఖ్య 1147గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని ఆరు జిల్లాలు రెడ్ జోన్లుగా గుర్తించింది. అలాగే దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్‌స్పాట్ జిల్లాలను ప్రస్తుతం 129కి తగ్గించింది.
తెలంగాణలోని రెడ్ జోన్లుగా హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికరాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉన్నాయి. మరోవైపు కరోనా తీవ్రతను బట్టి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా వర్గీకరించింది. తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలకు ఈ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే రెండు వారాల కింద ఆరెంజ్ జోన్లు సంఖ్య 207గా ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 297కు పెరిగింది. అదే విధంగా తెలంగాణలో ఆరెంజ్ జోన్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా గుర్తించింది ఆరెంజ్ జోన్ల జాబితాలో నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, భూపాలపల్లి, జనగామ, నారాయణ్‌పేట, మంచిర్యాల ఉన్నాయి. తెలంగాణలో గ్రీన్ జోన్లుగా పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి ఉన్నాయి. రెడ్ జోన్లో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా ఉంటాయి. రెడ్, ఆరెంజ్ జోన్లలో కంటైన్మెంట్ చర్యలు పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం తన లేఖలో పేర్కొన్నది.