“బీహార్లో సిపిఎం, సిపిఐ పార్టీలు జాతీయ పార్టీలైనప్పటికీ ఒక్క సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ మాత్రమే గత ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం కలిగి ఉంది. ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు కలిసి రంగంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఆయా జిల్లాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా ఉన్నాయి. వీరి ఓటు బ్యాంకు గంపగుత్తగా పడుతుందని, ఆ ఓట్లు తమ గెలుపునకు లాభిస్తుందని జాతీయ, ప్రాంతీయ పార్టీలు లెక్కలు తీసి పొత్తులో భాగంగా సీట్లు కేటాయిస్తూ ఉంటాయి. అయితే కమ్యూనిస్టుల శక్తికి తగ్గట్టు సీట్ల కేటాయింపులు జరగవు. వాటి అభివృద్ధిని మిగతా పార్టీలు కోరుకోవు.”
ఇప్పుడు బీహార్ ఎన్నికలపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలుపుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తుంది. బిజెపిని ఎదుర్కొనేందుకు మహా కూటమి చెమటొడుస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీల కూటముల మధ్య సీట్ల సంఖ్య ఖరారైంది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 28న(71 సీట్లు), నవంబర్ 3న(94 సీట్లు), నవంబర్ 7న(78 సీట్లు) మూడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. నవంబర్ 10న ఫలితాలు రానున్నాయి. అయితే ఆ కూటములలో చిన్నచితకా పార్టీలు ప్రభావితం చేసే పాత్రపై మీడియాలో కథనాలు రావడం తగ్గిపోయింది. వాటిపైన చర్చలేదు. ఆయా ప్రాంతాల్లో ప్రభావం చూపే ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకం కానున్నాయి. మరోవైపు ఎర్రజెండా పార్టీలు ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. కమ్యూనిస్టుల ఐక్యతకు, పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.
ప్రభావితం చేసే శక్తిగా వామపక్ష శిబిరం..
మహాకూటమి భాగస్వామ్యంతో రంగంలో నిలిచాయి. బీహార్లో సిపిఎం, సిపిఐ పార్టీలు జాతీయ పార్టీలైనప్పటికీ ఒక్క సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ మాత్రమే గత ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం కలిగి ఉంది. ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు కలిసి రంగంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఆయా జిల్లాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా ఉన్నాయి. వీరి ఓటు బ్యాంకు గంపగుత్తగా పడుతుందని, ఆ ఓట్లు తమ గెలుపునకు లాభిస్తుందని జాతీయ, ప్రాంతీయ పార్టీలు లెక్కలు తీసి పొత్తులో భాగంగా సీట్లు కేటాయిస్తూ ఉంటాయి. అయితే కమ్యూనిస్టుల శక్తికి తగ్గట్టు సీట్ల కేటాయింపులు జరగవు. వాటి అభివృద్ధిని మిగతా పార్టీలు కోరుకోవు. దాంట్లో భాగంగానే ఈ గ్రాండ్ అలయన్స్లో మాత్రం కమ్యూనిస్టులకు మాత్రం తక్కువ సీట్లతో సరి పెట్టారు. అయితే బీజేపీ ఓటమే లక్ష్యంగా పరిమిత స్థానాల్లో పోటీ చేస్తూ రాజకీయ ప్రచారాస్త్రాన్ని ధీటుగా ప్రారంభించింది వామపక్ష శిబిరం.
29 సీట్లలో వామపక్షాలు పోటీ..
వామపక్ష పార్టీలలో ప్రధాన శక్తిగా పరిగణించబడుతున్న సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ 19 మంది అభ్యర్థుల్లో పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ శాసనసభ్యులు – మహబూబ్ ఆలం, సత్యదేవో రామ్, సుదామా ప్రసాద్ – వరుసగా బాల్రాంపూర్, దారౌలి (ఎస్సీ), తారారీ సీట్ల నుంచి తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పాలిగంజ్ నియోజకవర్గం నుండి ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఐసా) మాజీ ప్రధాన కార్యదర్శి, జెఎన్యూ నాయకుడు సందీప్ సౌరవ్, దిఘా నియోజకవర్గంలో ఆల్ ఇండియా పోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్(ఐప్వా) రాష్ట్ర కార్యదర్శి శశి యాదవ్, అఖిల్ భారతీయ కిసాన్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరుణ్ సింగ్ కరాకట్ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు. మిగతా సీట్లలో జనాదరణ కలిగిన నాయకుల్ని బరిలో దించారు. అందులో యువతకు ప్రాధాన్యతనివ్వడం కీలక పరిణామం. భోజ్పూర్, సివాన్, పాట్నా, బక్సర్, కతిహార్ సమస్తిపూర్ తదితర జిల్లాల్లో ఆ పార్టీ ప్రజా పునాది బలంగా ఉంటుంది.
మరో వామపక్ష పార్టీ అయినా సిపిఐ ఆరు సీట్లలో పోటీ చేస్తుంది. బేగు సారై లాంటి ప్రాంతాల్లో పట్టున్న సిపిఐకి బచ్ఛావరా, హర్లఖి నియోజకవర్గంలో గతంలో ప్రాతినిధ్యం ఉండేది. ఇప్పుడా సీట్ల నుంచి మాజీ ఎమ్మెల్యేలు అవదేశ్ కుమార్ రామ్, మధుబనిలు పోటీ చేస్తుండగా బఖ్రి, తెఘ్రా, ఝాం ఝార్ పూర్, రూపౌలి నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపారు.
సిపిఎం పరిమితంగానే నాలుగు సీట్లలో బిభూటి పూర్, మతి హాని, పిప్రా, మాఝీ పోటీకి దిగింది. ఆ సీట్లలో అజయ్ కుమార్, రాజేందప్రసాద్ సింగ్, రాజా మంగల్ ప్రసాద్, సతేంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు. మతతత్వ శక్తులు అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు, లౌకిక ప్రజాతంత్ర, ప్రగతిశీల ఓట్లు చీలకుండా ఉండేందుకు దోహదపడుతుంది. వామపక్షాలు ఐక్యంగా పనిచేయడం, తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని ఆశించడం ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడమే అవుతుంది. వామపక్షాలు వచ్చే అసెంబ్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషించేందుకు తగిన సీట్లు గెలుస్తాయనడంలో ఆశ్చర్యం లేదు.

సెల్: 7893230218