- అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు
- 44.2 మిమీ వర్షం నమోదు..నీట మునిగిన నిర్మల్
- హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన..నిండుకుండల్లా జంట జలాశయాలు
- పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
- ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు..నిండుకుండల్లా పలు ప్రాజెక్టులు
- శ్రీరాంసాగర్ 8 గేట్లు ఎత్తివేత..కడెం ప్రాజెక్ట్ 16 గేట్లు ఎత్తివేత
- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, అధికారులకు హెచ్చరిక
- నిర్మల్ జిల్లా గడ్డెన్న వాగుకు వరద పోటు
- కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు..పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత
- సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం
- వరద ప్రాంతాల్లో తక్షణ చర్యలకు అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశాలు
- మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలహీనపడింది. వాయువ్య బంగాళా ఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. సముద్రమట్టానికి 3.1 కిలోమిటర్ల నుంచి 7.6 కిలోమిటర్ల ఎత్తున ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో వాన దంచికొట్టింది. ఆ జిల్లాలోని నర్సాపూర్‌లో అత్యధికంగా 245 మి.మి. వర్షపాతం నమోదైంది.
రాష్ట్ర వ్యాప్తంగా 44.2 మి.మి. వర్షపాతం నమోదు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 115.5 మి.మి. వర్షపాతం నమోదైంది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 204 మి.మి. వర్షపాతం నమోదైంది. జూన్ 1వ తేదీ నుంచి జులై 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 474.3 మి.మి. వర్షపాతం నమోదు అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ ముసురు ఆగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో చార్మినార్‌లో అత్యధికంగా 26.5 మి.మి. వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి జులై 22వ తేదీ వరకు హైదరాబాద్‌లో 73 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఈ తేదీల మధ్యలో నగరంలో 388.9 మి.మి. వర్షపాతం నమోదైంది. ఇప్పటికే రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వొచ్చే వరదతో ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వొచ్చి చేరుతుంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వొచ్చి చేరుతుంది.
గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గడ్డెన వాగుకు వరదనీరు పోటెత్తడంతో ఒక గేటు ఎత్తి వేశారు. మరోవైపు సింగరేణి ఏరియాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంచిర్యాలలో కేకే, ఆర్కేపీ, ఎస్ఆర్పీ, ఇందారం ఉపరితల గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ వెల్లడించింది. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లోనూ, తెలంగాణలోనూ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వొచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 87,440 క్యూసెక్కులగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేశారు. 87,440 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టిఎంసిలు కాగా.. ప్రాజెక్టులో ప్రస్తుతం 19.73 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఇదే జిల్లాలోని మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న పార్వతీ బ్యారేజ్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. పార్వతీ బ్యారేజ్‌లో ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 32,736 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ 74 గేట్లలో 40 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. పార్వతీ బ్యారేజ్ పూర్తి స్థాయి నీటినిల్వ 8.83 టిఎంసిలు కాగా.. ప్రస్తుతం 7.10 టిఎంసిల నీరు ఉంది. పెద్దపల్లి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రామగుండం రీజియన్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడతెరపి లేకుండా భారీగా వర్షం కురవడంతో ఓపెన్ కాస్టుల్లోకి వర్షం నీరు చ్చి చేరింది. వర్షం వల్ల ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల పరిసరాలన్నీ బురద మయంగా మారాయి. దీంతో బొగ్గు రవాణాకు విఘాంతం కలుగుతోంది. భారీ వర్షం వల్ల రామగుండం రీజియన్‌లోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రూ. కోటి విలువ చేసే 30 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లిందని అధికారుల చెబుతున్నారు.
హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. నిండుకుండల్లా జంట జలాశయాలు
హైదరాబాద్‌లో దట్టమైన మేఘాలు కమ్ముకుని నిరంతరాయంగా జల్లులు కురుస్తున్నాయి. దీంతో ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు పడుతున్నాయి. నగరంలోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. హిమాయత్‌సాగర్‌కు భారీగా వరదనీరు వొచ్చి చేరుతుండటంతో అడుగుమేర గేట్లు ఎత్తి దిగువకు నీటిని వొదులుతున్నారు. కొన్నిచోట్ల భారీగా..కొన్నిచోట్ల మోస్తరుగా..మరికొన్ని చోట్ల జల్లులుగా వర్షిస్తూనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి ప్రాంతాలు బుధవారం అర్ధరాత్రి కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కూకట్పల్లి, మియాపూర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అవి•ర్‌పేట్, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, నాంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, షేక్‌పేట, మెహిదీపట్నం ముసురు పడుతూనే ఉంది. దీంతో బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
శ్రీరాంసాగర్ 8 గేట్లు ఎత్తివేత.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక
నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎనిమిది గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు 50వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ క్రమంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,32,325 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1089.7 అడుగులు ఉన్నది. గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 83.253 టీఎంసీల నిల్వ ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి జూలై నెలాఖరులోపే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. గతేడాది ఇదే సమయానికి ఎస్సారెస్పీలో కేవలం 33 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతి భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి దాదాపు 84 టీఎంసీలకు చేరుకుందని చెప్పారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న క్రమంలో అధికారులు అప్రమత్తమై ముందస్తుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గేట్లను ఎత్తి, దిగువకు నీటిని వదులుతున్నారు.
కడెం ప్రాజెక్ట్ 16 గేట్లు ఎత్తివేత.. జ్రలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. నిర్మల్ పట్టణంలోని మంజూలా పూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్, సోఫీ నగర్ కాలనీలను మంత్రి పరిశీలించారు. జోరు వానలోనే పలు కాలనీలలో పర్యటిస్తూ అధికారులకు సూచనలిస్తూ.. మంత్రి ప్రజలకు భరోసా కల్పించారు. కాలనీ వాసులతో వారి సమస్యలపై చర్చించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ చరిత్రలో ఎన్నడు కూడా ఇంతటి వర్షం కురవలేదన్నారు. పలు కాలనీలు జలమయ్యాయని, ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. నిత్యావసరాలు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంటాల మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మండలంలో 20 సెంటీమిటర్ల వర్షాపాతం నమోదైంది.
భారీ వర్షాలకు వెంకూరు చెరువు కట్ట తెగిపోయింది. చెరువు నీరంతా వాగులోకి ప్రవహిస్తున్నది. వాగులో ఇద్దరు గ్రామస్తులు చిక్కుకు పోయారు. అయితే, వారి పూర్తి వివరాలు తెలియరాలేదు. వారిని రక్షించేందుకు గ్రామస్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి ప్రవాహంతో పలు గ్రామాల నుంచి కుంటాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భైంసా గడ్డెన్న జలాశయానికి కూడా వరద కొనసాగుతుంది. ఈ జలాశయం ఇన్‌ఫ్లో 38,500 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 45,500 క్యూసెక్కులుగా ఉంది. ఈ జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ఠ నీటిమట్టం 358.7 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 358.4 అడుగులు.
కడెం జలాశయం ఇన్‌ప్లో లక్షా 34 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ప్లో 1,00,506 క్యూసెక్కులుగా ఉంది. గరిష్ఠ నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 696.100 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 7.603 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 6.623 టీఎంసీలుగా ఉంది. భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 16 వరద గేట్లను ఎత్తివేశారు. దాదాపు 1,92,260 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,80,493 క్యూసెక్కులుగా ఉంది. గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో గోదావరి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు.. పొంగిప్రవహిస్తోన్న ప్రాణహిత నది
కాళేశ్వరం జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాణహిత నుంచి వరద పోటెత్తుతుంది. గోదావరి ఉధృతితో కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా నీరు చేరింది. వర్షాలు, ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో భారీగా వరద పోటెత్తింది. మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ప్లో 1,05,230 క్యూసెక్కులు కాగా, ఔట్ ప్లో 1,03,990 క్యూసెక్కులుగా ఉంది. మేడిగడ్డ బ్యారేజీ 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ గరిష్ఠ నీటి నిల్వ 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 11.1 టీఎంసీలు.అన్నారం (సరస్వతీ) బ్యారేజీ ఇన్‌ప్లో 57 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ప్లో 13,500 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ గరిష్ఠ నీటి నిల్వ 10.87 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 7.29 టీఎంసీలు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 62 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 54 వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి 10 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 20.74 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 19.64 టీఎంసీలు.