Take a fresh look at your lifestyle.

మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్

‌రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు…వాతావరణ శాఖ హెచ్చరిక
నిండుకుండల్లా మారిన జలాశయాలు
నిజామాబాద్‌లో ప్రాజెక్టులకు జలకళ..నిండుకుండలా శ్రీరాంసాగర్‌
‌తుంగభద్ర జలాశయానికి వరద పోటు…జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా…మూడు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమయిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆదిలాబాద్‌, ‌మంచిర్యాల, ఆసిఫాబాద్‌ ‌జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. వరదల వల్ల ఆసిఫాబాద్‌ ‌జిల్లా పెంచికల్‌ ‌పెద్దవాగులో తొమ్మిదిమంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలు జలదిగ్బంధమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి జన జీవనం స్థంభించింది. ఇదిలా వుంటే మేడిగడ్డ బ్యారేజీ 79 గేట్లను అధికారులు ఎత్తివేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ ‌ఫ్లో, ఔట్‌ ‌ఫ్లో 11,09,640 క్యూసెక్కులకు చేరుకుంది. బ్యారేజీ పూర్తి నీటినిల్వ 16.17 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 11.40 టీఎంసీలకు చేరుకుంది. అన్నారం బ్యారేజీ 62 గేట్లును ఎత్తివేశారు. అన్నారం బ్యారేజీ ఇన్‌ ‌ప్లో 5,43,125 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ‌ప్లో 5,71,365 క్యూసెక్కులు. బ్యారేజీ పూర్తి నీటినిల్వ 10.87 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.01 టీఎంసీలకు చేరుకుంది. బైంసాలోని గ్డడెన వాగు ప్రాజెక్ట్ ‌కు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 35 ‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. సాగర్‌ ఇన్‌ ‌ఫ్లో 23,825 క్యూసెక్కులు కాగా… ఔట్‌ ‌ఫ్లో 2,677 క్యూసెక్కులకు చేరుకుంది. సాగర్‌ ‌పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 536.40 అడుగులకు చేరుకుంది. సాగర్‌ ‌పూర్తి నీటినిల్వ 312 టీఎంసీలు, ప్రస్తుతం 181.9102 టీఎంసీలకు చేరుకుంది.

నిజామాబాద్‌లో ప్రాజెక్టులకు జలకళ..నిండుకుండలా శ్రీరాంసాగర్‌
‌నిజాంసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వొచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 10,590 క్యూసెక్కులు కాగా, ప్రాజెక్ట్ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,398 అడుగులుగా ఉంది. నిజాంసాగర్‌ ‌పూర్తిస్థాయి నీటినిల్వ 17.802 టీఎంసీలు గాను, ప్రస్తుతం 9.485 టీఎంసీలుగా ఉంది. ఇక శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతుంది. అప్రమత్తమైన అధికారులు 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 1,75,000 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ‌ఫ్లో 1,70,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్‌ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,089 అడుగులు ఉంది. శ్రీరాంసాగర్‌ ‌పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 80.139 టీఎంసీలుగా ఉంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్‌ ‌ప్రాజెక్టులోనికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వొస్తోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. ఇదిలా వుంటే పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రాజెక్టు, ప్రధాన కాల్వల ఆధునీకరణ కోసం కృషిచేయాల్సి ఉంది.

తుంగభద్ర జలాశయానికి వరద పోటు…జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ముంచెత్తుతుంది. శనివారం ఈ ప్రాజెక్టుకు 1,02,048 క్యూసెక్కుల ఇన్‌ ‌ప్లో వొచ్చి చేరుతుంది. అవుట్‌ ‌ప్లో 5,214 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 71.721 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1624.42 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ప్రాజెక్టు సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ ‌తెలిపారు. ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలకు మరింత వరద తుంగభద్రకు వొచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎగువ నుంచి నీటి రాకతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన వర్షాల వల్ల నారాయణపూర్‌ ‌ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నది. దీంతో ఉదయం 9 గంటలకు 2 లక్షల 60 వేల క్యూసెక్కుల నీరు జూరాల జలాశయానికి వొచ్చి చేరుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు 215 టీఎంసిల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 87 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు నారాయణపూర్‌ ‌ప్రాజెక్టు నుంచి జూరాలకు, జూరాల నుంచి శ్రీశైలానికి భారీ వరద కొనసాగుతున్నందున నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లా యంత్రాంగం ప్రజలను హెచ్చరించింది.

Leave a Reply