Take a fresh look at your lifestyle.

రిక్రూట్‌మెంట్‌కు ఒకే పరీక్ష పారదర్శకమేనా..?

నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ-2  ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేషనల్‌ ‌రిక్రూట్‌ ‌మెంట్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఏ) ‌నిరుద్యోగుల్లో ఆశలు రేకొల్పుతోంది. ఇది అక్షరాలా అమలు జరిగితే నిరుద్యోగులకు వరంలాంటిదే. ఒకే అర్హత పరీక్షతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం చాలా కీలకమైన విషయం. ఇది ఎంత వరకూ సాధ్యమో తెలియదు కానీ, దీనిని గురించి ప్రభుత్వం ప్రసార సాధనాల ద్వారా హోరెత్తిస్తోంది. దేశంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 సంవత్సరాల కనిష్టానికి నిరుద్యోగుల సంఖ్య పెరిగినట్టు ప్రభుత్వ సర్వేలే తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకులు, రైల్వేలు, స్టాఫ్‌ ‌సెలక్షన్‌ ‌కమిషన్‌ ‌వంటి 20 రకాల కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల్లో ఉద్యోగాలకు పరీక్షలను విడివిడిగా నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల కోసం దేశమంతటా కోచింగ్‌ ‌సెంటర్లు కూడా వెలిశాయి. ఈ కోచింగ్‌ ‌సెంటర్లు ఉద్యోగార్థుల వద్ద వేలకు వేలు డబ్బు గుంజేస్తున్నాయి. ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు కేంద్ర సంస్థల పరీక్షలూ ఒకే సారి రావడంతో ఉద్యోగార్థులు ఏదో ఒకటి మిస్‌ అవ్వాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీలకు ఒకే పరీక్ష ఉండటం వల్ల  ప్రయోజనాలు ఉన్నట్టే, నష్టాలూ ఉన్నాయి. ఒకే పరీక్ష విధానం పైకి మంచిగానే కనిపించవచ్చు. కానీ, పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు ఏ పరిధిలో ఉంటాయి. వీటికి సిలబస్‌ ఏమిటి దేని నాధారంగా సిలబస్‌ను ఎంపిక చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సాధారణంగా రిక్రూట్‌మెంట్‌ ‌పరీక్షలంటే మొక్కుబడిగా నిర్వహించేవన్న భావన జనంలో నాటుకుని పోయింది. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలే తక్కువైనప్పుడు, ఆ ఖాళీలకు అభ్యర్థులను ముందే నిర్ణయించేసి, కంటితుడుపు చర్యగా ఈ పరీక్షలు నిర్వహిస్తారనేది అధిక సంఖ్యాకుల అభిప్రాయం. అయితే, ఈ పరీక్షలను చాలా పారదర్శకంగా, పటిష్ఠంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌పేర్కొంటున్నారు. ప్రతి కొత్త పథకాన్ని, లేదా పరీక్షా విధానాన్ని  ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వం చెప్పే మాటే ఇది. గ్రూపు-బి, సి కిందికి వచ్చే ఉద్యోగాలన్నింటి భర్తీకి ఈ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. అయితే, ఈ పరీక్షల్లో సుగుణం ఏమంటే ఒకసారి పొందిన మార్కులు మూడేళ్ళ పాటు అమలులో ఉంటాయి. చాలా మంది అభ్యర్ధులు ప్రిలిమనరీలో పాసై, మెయిన్‌లో తప్పి మళ్ళీ రాసినప్పుడు ఈ మార్కులను కోల్పోవల్సి వచ్చేది. ఈ కొత్త పరీక్షా విధానం వల్ల అటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగాల ఎంపికలో పారదర్శకత పాటించకపోవడం వల్లనే అవినీతి పెరిగిపోతోంది. లంచం ఇస్తే ఎంత మంచి ఉద్యోగమైనా సాధించవచ్చన్న ధీమా ఉద్యోగార్థుల్లో ఉంది. డబ్బు  లంచం ఇవ్వలేని వారు ప్రభుత్వోద్యోగాలపై ఆశ వదులు కుంటున్నారు. అయితే, ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే అవుట్‌ ‌సోర్సింగ్‌ అమలులో ఉంది. చాలా శాఖలు తమ అవసరాలకు ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పైనే ఆధారపడుతున్నాయి. అటువంటప్పుడు ఉన్న కొద్ది ఉద్యోగాలకూ ఇంత కసరత్తు అవసరమా అనే ప్రశ్న తలెత్తుతుంది. పైగా, దాదాపు అన్ని రాష్ట్రాల్లో  స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కేంద్ర సంస్థల్లో కూడా ఈ విధానం అమలు జేయాలని కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కోటాల సంగతి సరేసరి. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకూ, ప్రమోషన్లకూ కూడా కోటా పద్దతిని అమలు జేయాలన్న డిమాండ్లు చాలా కాలంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తున్న ఈ కొత్త పరీక్షా విధానం కేవలం జనాన్ని మభ్యపెట్టడానికేనన్న విమర్శలు వస్తున్నాయి.   రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని మభ్యపెట్టి ఆరున్నర సంవత్సరాలు దాటినా కొత్త ఉద్యోగాల సంగతి అలా ఉంచి ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యం నుంచి చూస్తే ఒకే పరీక్షా విధానం ఒక జిమ్మిక్‌ అని అంటే తప్పు కాదు. మోడీ ఏక్‌ ‌భారత్‌, ‌శ్రేష్ట భారత్‌ ‌నినాదంతో ఈ మార్పులన్నింటినీ తెస్తున్నారు. సైనికులకు ఒకే ర్యాంకు- ఒకే పెన్షన్‌ ‌విధానం గురించి అధిక ప్రచారం చేశారు. కానీ, దాని అమలులో ఎన్నో సాధక బాధకాలు ఎదురవుతున్నాయి.

అలాగే, ఒకే దేశం ఒకే పన్ను విధానం కోసం జిఎస్‌ ‌టిని ప్రవేశపెట్టారు. జిఎస్‌టి పన్నుల విధానం వల్ల   పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందన్న మాటలు అర్ధ సత్యాలే. కానీ, జిఎస్‌టి వసూళ్ళూ ఏకీకరణగా ఉండటం లేదు. పూర్వపు పద్దతిలో ఎగ్గొట్టేవారు ఎగవేస్తూనే ఉన్నారు. పన్నుల వ్యవస్థపై పకడ్బందీగా అజమాయిషీ లేదు.  పన్నుల  రేట్లపై కూడా ఏకాభిప్రాయం లేదు. అందువల్ల ఒకే దేశం- ఒకే పరీక్ష విధానం ఎంత వరకూ విజయవంతం అవుతుందో అప్పుడే చెప్పలేం. అయితే, ప్రభుత్వం ప్రసార, ప్రచార సాధనాల ద్వారా హోరెత్తిస్తున్నంత మాత్రాన ఇది చాలా మంది విధానమన్న నిర్ధారణకు వస్తే తొందరపాటు అవుతుంది. రిక్రూట్‌ ‌మెంట్‌ ‌బోర్డులలో అవినీతి బాగోతాలు తవ్విన కొద్దీ గుట్టలు బయటపడతాయి. అవినీతికి బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటామంటారు కానీ, కాలక్రమంలో జనానికి మరుపు ఎక్కువని ఎంక్వైరీలపై చేసిన హడావుడి ఆ తర్వాత చల్లబడిపోతుంది. ఒకే పరీక్ష విధానంలో భాషాపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం చేసే ప్రయోగాలు ఫలితాలు ఇచ్చే సరికి నిరుద్యోగుల సంఖ్య ఎన్ని రెట్లు పెరుగుతుందో చెప్పలేం.

Leave a Reply