Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌నగర పేదప్రజల జీవితాల పునర్నిర్మాణం ఎప్పటికి సాధ్యమయ్యేను???

‘‘ఎప్పుడూ లేని విధంగా ఇళ్ళలోకి నీళ్లు వచ్చేసాయి. డ్రైనేజ్‌ ‌నీళ్లు కూడా కలిసిపోవటంతో భరించలేనంత దుర్వాసన. మొత్తం సామానంతా పాడైపోయింది. మా అమ్మకి ఈ మధ్యనే మోకాలు ఆపరేషన్‌ అయింది. ఆమెను మొదటి అంతస్తు లోకి ఎంతో కష్టం మీద తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఆమె ఇంకా షాక్‌ ‌లోనే వుంది. వర్షంలో నానతంతో ఇప్పుడు ఆమె మోకాలుకు మళ్లీ ఇన్ఫెక్షన్‌ ‌వచ్చింది. నొప్పితో చాలా బాధ పడుతోంది. బాగా ఖర్చుపెట్టి ఇంట్లో నిలిచిన నీళ్లను బయటకు తోడించాల్సి వచ్చింది.’’ ఓ మధ్య తరగతి కాలనీలో పరిస్థితిని వివరించిన ఒక ఉద్యోగస్తురాలు. ‘‘పనికి వెళ్ళటానికి లేకుండా అయింది. బురదతో వున్న బట్టల్ని ఎన్నిసార్లు ఉతికినా గానీ వాసన పోవటంలేదు. అన్ని వస్తువులు పాడైపోయాయి.’’ ఉప్పల్‌ ‌లో ఒక మహిళ నిస్సహాయత.’’

Reconstruction of the lives of the urban poor in Hyderabad When is it possible ???‘‘నవంబర్‌లో మా అమ్మాయి పెళ్లి వుంది. దానికోసం రెండేళ్ల నుంచీ కొంచం కొంచం సామాను జమ చేసుకుంటున్నాం. లాక్‌డౌన్‌ ‌వల్ల పనులు లేకపోవటంతో తిండికి కూడా చాలా సమస్య అయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ పనులు మొదలయ్యాయి. మెల్లగా దారిలో పడుతున్నాం అనుకుంటే ఇప్పుడు ఈ వరదల్లో మొత్తం సామానంతా కొట్టుకుపోయింది. ఏం చేయాలో తోచడం లేదు’’ అని మూసానగర్‌ ‌బస్తీలో గొంతు జీరపోతుండగా ఒక పేదతల్లి గుండెల నిండా దిగులుతో మాట్లాడుతోంది! ‘‘మా మామయ్యకు డెబ్భై ఏళ్లకు పైనే. కాళ్లు పనిచెయ్యవు. నడవాలంటే వాకర్‌ ‌వుండాలి. ఇంట్లోకి అలా వేగంగా నీళ్లు, బురద వచ్చేస్తుంటే ఆయన్ని ఎలా అక్కడి నుంచీ బయటికి దాటించాలో అర్థం కాలేదు. ఎంతో టెన్షన్‌ ‌పడ్డాం. మొత్తం సామాను పాడయిపోయింది. ఏది పనికొస్తుందో, ఏది పనికిరాదో కూడా అర్థం కావటం లేదు.’’ అదే బస్తీలో ఇంకో మహిళ ఆవేదన ఇది.‘‘బిడ్డ కాన్పుకి వచ్చింది. ఇల్లు నీటిలో మునిగిపోయింది. ఆ నీళ్ళు ఎప్పటికి పోతాయో తెలియదు. నీళ్లు వెళ్ళిపోయినా గానీ అక్కడ ఎలా వుండగలుగుతాం? సామానంతా పాడైపోయి వుంటుంది. ఇప్పుడు అక్కడా ఇక్కడా ఉంటున్నాం. ఎవరన్నా పెడితే తింటున్నాం. ఏంచేయాలి ఇప్పుడు.’’ ఉస్మాన్నగర్‌ ‌లో అయోమయంగా అడుగుతున్న ఒక తల్లి.

‘‘పదిరోజుల నుంచీ ఒకటే డ్రెస్‌ ‌మీద వున్నాం. ఆడవాళ్లకి ఇంకా వేరే సమస్యలుంటాయి కదా? చాలా కష్టమనిపిస్తోంది ఎవర్నైనా అడగాలంటే..’’ అని షాహీన్‌ ‌నగర్‌ ‌లో కన్నీళ్ళు పెట్టుకుంది ఒక యువతి.‘‘సెప్టెంబర్‌ ‌చివరి వారంలో వచ్చిన వానకే గల్లీల్లో నీళ్లు నిలిచాయి. పనికి అయితే వెళ్ళటం తప్పదు కదా! అలానే ఇబ్బందిపడుతూ వున్నాం. ఇప్పుడు వచ్చిన వానతో ఎక్కడలేని ఉధృతితో నీళ్లు కాలనీని ముంచెత్తాయి. ప్రాణాలను కాపాడుకోవటానికి పరుగులు తీశాం. ఇక్కడ అందరూ రకకరకాల పనులు చేసుకునేవాళ్లే! ఆటోలు నడిపే వాళ్లు ఎక్కువ. ఇప్పుడు కొంతమంది అప్పు తీసుకుని క్యాబ్‌ ‌కొనుక్కున్నారు. చూస్తుండగానే కళ్ళముందు అన్నీ కొట్టుకుపోయాయి. మా పరిస్థితి ఏమిటి? భోజనం ఎవరో ఒకరు పెడుతున్నారు కానీ ఎంత కాలమని పోషించగలరు? మా జీవితాలు ఎప్పటికి తెరుకునేది?’’ చాంద్రాయణగుట్ట దగ్గర ఒక బస్తీలోని యువకుడి ప్రశ్న.‘‘మేము మూసీ ఒడ్డున పందుల్ని పెంచుతాం. అవే మా ఆధారం. మా ముగ్గురు అన్నదమ్ములకీ రెండువందల దాకా పందులు వున్నాయి. అన్నీ వరదకి కొట్టుకుపోయాయి. ఏంచేయాలి ఇప్పుడు?’’ నాగోలు అవతల ఒక చిన్న రైతు గోస ఇది. ‘‘మాకు గొర్రెలు, మేకలు వున్నాయి. గుర్రాలు కూడా వున్నాయి. పెళ్లిళ్లలో ఊరేగింపుకి గుర్రాలను అద్దెకి ఇస్తాను. ఇవే జీవనాధారం. వాటిని రక్షించుకోగాలిగాను కానీ, వాటికోసం నిల్వ చేసిన దాణా మొత్తం మూసీలో కొట్టుకుపోయింది. ఇప్పుడు వాటికి తిండిలేదు. ఎవరయినా సాయం చేయగలరా?’’ అఫ్జల్గంజ్‌ ‌దగ్గర ఇంకో వ్యక్తి వేడుకోలు.

‘‘పిల్లల స్కూల్‌ ‌సర్టిఫికెట్లు, ఇంటిపట్టా, ఆధార కార్డ్, ‌వాటర్‌ ‌కార్డు, రేషన్‌ ‌కార్డుతో సహా అన్ని పేపర్లు తడిచిపోయాయి. ఇప్పుడు ఆ ఇచ్చే పదివేల సాయానికి కూడా ఏదో ఒక గుర్తింపు తీసుకు రమ్మంటున్నారు. ఎక్కడినుంచీ తీసుకురాగలుగుతాము? ఎవరు సాయం చేస్తారు’’ ఇది చాదర్ఘాట్‌ ‌దగ్గర వున్న ఒక బస్తీలోని మహిళ దుక్కం. ‘‘ఇన్నిరోజులైనా నీళ్ళు బయటకు తోడించే ఏర్పాటుచేయటం లేదు ప్రభుత్వం. మా ఇళ్లు పూర్తిగా పాడైపోయి వుంటాయి. ఎంతో కష్టం మీద ఇంత చిన్న ఇల్లు కట్టుకున్నాం. దాదాపు ఇక్కడున్న అందరూ అంతే! పనిచేసుకుంటేనే బతుకు. ఇప్పుడు పనీ లేదు, ఇల్లు లేదు. ఆదుకునే వాళ్లు కూడా కనిపించడం లేదు. మొత్తం పంనేడు వందల ఇళ్లు మునిగిపోయాయి.’’ ఉస్మాన్‌ ‌నగర్‌ ‌లో ఒక చిరుద్యోగి గుండెకోత. ‘‘కొద్దిరోజులుగా కురిసిన వానలకు గోడలు నానిపోయాయి. మట్టితో కట్టుకున్న ఇల్లు చూస్తుండగానే కూలిపోయి చేతికి గాయం అయింది. బయటకు వెళ్లే అవకాశం కూడా లభించలేదు. పక్కింటివాళ్ళు వచ్చి రక్షించారు లేకపోతే చనిపోయేదాన్నే. హాస్పిటల్‌ ‌కి వెళ్ళటానికి కూడా నా దగ్గర ఏమీ లేదు. మాకు పట్టా ఇవ్వమని ఎప్పటినుంచో అడుగుతున్నా గానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ ఉస్మానియా యూనివర్సిటీ తీన్‌ ‌నంబర్‌ ‌బస్తీలో గాయపడిన ఒక వృద్ధురాలి రోదన.

‘‘నాకెవరూ లేరు. అనాధని. చిన్నప్పుడే పోలియోతో కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి. పించను కూడా రాదు. ఎవరూ చేసిపెట్టేవాళ్ళు లేరు. అడుక్కుని తింటాను. అప్పటినుంచీ బురదలోనే వున్నాను.’’ ఉస్మానియా యూనివర్సిటీ విసి లాడ్జ్ ‌బస్తీలో ఒక వృద్ధురాలి బాధ. ‘‘ఎప్పుడూ లేని విధంగా ఇళ్ళలోకి నీళ్లు వచ్చేసాయి. డ్రైనేజ్‌ ‌నీళ్లు కూడా కలిసిపోవటంతో భరించలేనంత దుర్వాసన. మొత్తం సామానంతా పాడైపోయింది. మా అమ్మకి ఈ మధ్యనే మోకాలు ఆపరేషన్‌ అయింది. ఆమెను మొదటి అంతస్తు లోకి ఎంతో కష్టం మీద తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఆమె ఇంకా షాక్‌ ‌లోనే వుంది. వర్షంలో నానతంతో ఇప్పుడు ఆమె మోకాలుకు మళ్లీ ఇన్ఫెక్షన్‌ ‌వచ్చింది. నొప్పితో చాలా బాధ పడుతోంది. బాగా ఖర్చుపెట్టి ఇంట్లో నిలిచిన నీళ్లను బయటకు తోడించాల్సి వచ్చింది.’’ ఓ మధ్య తరగతి కాలనీలో పరిస్థితిని వివరించిన ఒక ఉద్యోగస్తురాలు. ‘‘పనికి వెళ్ళటానికి లేకుండా అయింది. బురదతో వున్న బట్టల్ని ఎన్నిసార్లు ఉతికినా గానీ వాసన పోవటంలేదు. అన్ని వస్తువులు పాడైపోయాయి.’’ ఉప్పల్‌ ‌లో ఒక మహిళ నిస్సహాయత.

ప్రభుత్వ పాలనా వ్యవస్థలు, రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారస్తులు, అధికార యంత్రాంగం, పౌరసమాజం నిర్లక్ష్యం కలిసికట్టుగా చేసిన పర్యావరణ విధ్వంసం పర్యసానం సామాన్య ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రతిఫలించిందో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నగర నిర్మాణంలో, నిర్వహణలో అత్యంత కీలకమైన వేలమంది నిరుపేదల జీవితాలు చిందరవందర అయిపోయాయి. ప్రతి మనిషికి ఎదురయిన అంతులేని వ్యథ ఇది. హైదరాబాద్‌ ‌నగరాన్ని ముంచెత్తిన వరదల నుంచీ జనజీవితం మళ్లీ పూర్తిగా కోలుకుందని అనేకమంది అనుకుంటూ వుండొచ్చు. ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఎక్కువశాతం అవాస్తవం కూడాను! కేవలం ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలతోనే ఈ జీవితాలు లేచి నిలబడవు. ఈ చిన్ని సాయంలో కూడా అధికారుల, రాజకీయ నాయకుల చేతివాటం ఎంతుందో రోడ్ల మీదకు వచ్చి రాస్తారోకోలు చేస్తున్న ప్రజల ఆగ్రహం తెలియజేస్తోంది. ఒక పక్క ప్రజల జీవితాలు ఇంత చిందర వందర అయి అల్లాడుతుంటే, మరోపక్క వరద తర్వాత మహిళలు నడుములిరిగే చాకిరీతో, అనారోగ్యాలతో అనేక రకాలుగా తమ జీవితాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక అయోమయంగా వుంటే వాళ్లు వరదల్లోనూ టీవీ సీరియళ్లు చూస్తున్నారంటూ వచ్చిన కార్టూన్లు వికారమైన పురుషాధిక్య మనస్థత్వాన్ని బయటపెట్టుకున్నాయి.

వరద ఒక రోజే వచ్చింది. ప్రకృతి కోపం, మానవ తప్పిదం అన్నీ కలిసి ఇలాంటి ఎన్నో అభాగ్య కుటుంబాలని నిలువ నీడ లేకుండా చేసాయి. బహుశా మళ్లీ జీవితాన్ని ఒక గాడిలో పెట్టుకుని తన కూతురి పెళ్లి చేయటానికి ఆ పేదతల్లికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం! ‘‘షాదీ ముబారక్‌, ‌కల్యాణలక్ష్మి పథకాలు వున్నాయి కదా? ఇంక సమస్య ఏముంది?’’ అనుకోవచ్చు గానీ, వాటికోసం దరఖాస్తు చేసుకోవడానికి కనీస ఆధారాలు కూడా వరదలో కొట్టుకెళ్ళిపోయాయి. ఇక్కడ ప్రస్తావించిన ఈ కొన్ని కథనాలను పరిశీలిస్తే ప్రకృతి విపత్తులు గానీ, ప్రమాదకరమైన పరిస్థితులు గానీ ఎదురైనప్పుడు మొట్టమొదట సమస్య ఎదుర్కొనేది వృద్ధులు, పసిపిల్లల తల్లులు, చిన్నపిల్లలు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు అన్న సంగతి అర్థమవుతుంది. పేదప్రజలు నివసించే ఆవాసాలే కాదు ఇప్పుడు మధ్యతరగతి, ఉన్నత తరగతి ఆవాసాల్లోకి, అపార్ట్ ‌మెంట్‌ ‌సెల్లార్‌ ‌లలోకి నీళ్ళు రావటం కొత్త పరిణామం. సహజ నీటి ప్రవాహానికి అడ్డుగా వెలసిన మహానిర్మాణాల గురించి మాట్లాడకుండా వుండటం అంటే, సమస్యను చూడటానికి ఇష్టపడకపోవటమే అవుతుంది. నిబంధనలు అతిక్రమించి ఈ అపార్ట్మెంట్లు, గేటెడ్‌ ‌కమ్యునిటీల నిర్మాణం జరుగుతోందని తెలిసినా గానీ వాటి గురించి ఎవరూ మాట్లాడాలనుకోకపోగా వాటిలో కొనుగోలుదార్లుగా భాగమవుతారు. పరిమితికి మించి ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నా అవి ‘అభివృద్ధి’లో భాగం అని తమని తాము నమ్మించుకుంటారు కానీ వాటిని నిర్మించడం కోసం కనీస వేతనాలు హక్కులు లేకుండా జీవితాలను ధారపోసిన శ్రామికులు వుండే అగ్గిపెట్టల వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని సముదాయాలు మాత్రం ఆక్రమణలుగా కనిపిస్తాయి. పైగా, తెలిసినా తెలియకపోయినా భద్రజీవులు మాట్లాదేమిటంటే ‘‘నాలాల మీద, చెరువుల్లో ఇళ్లు కట్టుకున్నారు కాబట్టి, అలాంటి ఇళ్లన్నీ కూలగొట్టటం తప్పించి ఇంకో మార్గం లేదని!?’’ దానికి ఈ వరదలను అడ్డంపెట్టుకుని పేదప్రజల ఆవాసాలను కూల్చివేయటానికి అప్పుడే ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తున్నట్టు కూడా వినికిడి. అందరి ఆలోచనా ధోరణి, చూపు పేదప్రజల ఇళ్ళను కూలగొట్టే వైపుగానే వుంటుంది కానీ నిజంగా చెరువులను, నాలాలను ఆక్రమించుకున్న ప్రభుత్వ సముదాయాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కన్వెన్షన్‌ ‌సెంటర్లు, మల్టీప్లెక్స్ ‌నిర్మాణాల వైపు వుండదు.

ప్రస్తుత వరదల తీవ్రతపై వచ్చిన పత్రికా కథనాల ఆదారంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెంటనే స్పందించి, ఎన్ని విధాలుగా నష్టం జరిగిందో రికార్డు చేయమని ఒక అమికస్‌ ‌క్యూరీని నియమించడం జరిగింది. అటువైపు నుంచీ వచ్చే నివేదికతో పాటు, పౌరసమాజం నుంచి కూడా జరిగిన వాస్తవ నష్టాన్ని రికార్డు చేసే ప్రయత్నం జరగాలి. దీనితోపాటు వరద బాధితులైన ప్రతి ఒక్కరూ తమ జీవితాల్ని పునర్నిర్మించుకునేందుకు అవసరమైన వివిధ సహకారాలు అటు ప్రభుత్వం నుంచీ, ఇటు పౌరసమాజం నుంచీ తక్షణం అందాల్సిన అవసరం వుంది. ఇప్పుడు కావలసింది వరదలతో దెబ్బతిన్న నగర పేదప్రజలకి తగిన ఊరట, చేదోడు. వారు తేరుకోవటానికి, తమ జీవితాల్ని తిరిగి పునర్‌ ‌నిర్మించుకోవటానికి సామాజిక సంస్థలు, వ్యక్తులు ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం వుంది. భవిష్యత్తులో తిరిగి ఇటువంటి విపత్తులు తలెత్తకుండా తీసుకోవాల్సిన శాస్త్ర, సాంకేతిక అంశాల గురించి సమగ్రమైన అధ్యయనంతో పాటు తారతమ్యాలు లేకుండా ప్రజలందరూ సుస్థిర నగర జీవితంపై తమ అభిప్రాయాలను వెల్లడించే ప్రజాస్వామ్య వేదికల నిర్మాణం జరగాలి. అప్పుడే ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

Leave a Reply