Take a fresh look at your lifestyle.

నాటి ఆదర్శాల ధ్వంసమే పునర్నిర్మాణమా

నీళ్ళు,నిధులు,నియామాకాల్లో ఆంధ్ర వలస పాలకులు తెలంగాణ పై చూపించిన వివక్ష కారణంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రజలందరిలో పెల్లుబెకింది. కృష్ణ, గోదావరి లాంటి జీవన నదులున్నప్పటికి చుక్క నీరు రాక బీడు బడ్డ భూములతో తెలంగాణ రైతు గుండె చెరువైంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సందర్బంలో వెనుకబడ్డ తెలంగాణ రక్షణకై ఏర్పాటు చేసుకున్న నిబంధనలన్నీ ఉల్లంఘించబడినాయి.మన భాషా సంస్కృతులు హేళన చేయబడ్డాయి.తెలంగాణలో కవులు లేరన్న ఆంధ్ర కవుల దురహంకారాన్ని నిరసిస్తూ 300 లకు పైగా కవుల వివరాలతో సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక తీసు కొచ్చారు.మనభాషను తౌరక్యాంధ్రం అని చులకన చేసిన కరుణశ్రీ లాంటి కవుల ఆక్షేపణలను, కాళోజీ, జయశంకర్‌ ‌లు తిప్పికొట్టి తెలంగాణ భాష,యాసల పట్ల మమకారాన్ని ప్రదర్శించారు. దోపిడి,పీడనలకు తోడుగా మనలను హేళనగా చూస్తున్న ఆంధ్రుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 1969 వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది.369 మంది విద్యార్థులు పోలీసుల తూటాలకు నేలకొరిగినారు. నాటి నుండి రగులుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష 2001 వ సంవత్సరంలో కే.సి ఆర్‌ ‌టీ.ఆర్‌ ‌యస్‌ ‌పార్టీని స్థాపించి ప్రజల్లో రాజకీయ పంథాతో పాటు భావజాలవ్యాప్తిని పెంపొందించడానికి కృషిచే శారు.

పార్లమెంటు లో అధిక సీట్లను సంపాదించి రాజకీయాలను శాసించి లాబీయింగ్‌ ‌ద్వారా తెలంగాణ ను సాధించాలన్న కే.సి.ఆర్‌ ఆలోచనలు రెండు అడుగులు ముందుకు నాలుగడుగులు వెనకకు అన్న చందంగా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాయి.2009 వ సంవత్సరం నవంబర్‌ 29 ‌వ తేదీన కే.సి ఆర్‌ ఆ ‌మరణదీక్షకు పూనుకోవడం, ఆయనను అరెస్టు చేసి ఖమ్మం తరలించడం , మొదలగు పరిణామాలతో తెలంగాణ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఆ తర్వాత నిమ్స్ ‌లో దీక్ష శ్రీకాంతాచారి ఆత్మబలిదానం తో తెలంగాణ అగ్ని గుండమైంది. 2009 డిసెంబర్‌ 9 ‌తేదీన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పై పార్లమెంటు అప్పటి కేంద్ర, హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటన, ఆంధ్ర ప్రాంతం లో నిరసనలు.,మొదలగు పరిణామాలతో అటు సమైక్య ఇటు విభజన రాజకీయాలు వెడెక్కాయి.నాడు కేంద్రంలో అధికారం లో ఉన్న కాంగ్రెస్‌ ఉదాసీనత వల్ల 1200 మంది విద్యార్థులు యువకులు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించారు.సకల జనుల సమ్మె , సాగరహారం, మిలియన్‌ ‌మార్క్,‌రాస్తారోకో వంటా వార్పు లతో తెలంగాణ సబ్బండ వర్గాలు రాష్ట్ర సాధన కై నినదించారు. ఇక ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను కలిపియుంచడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదనే తలంపుతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేసింది.తదనంతరం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒం‌టరిగా పోటీచేసి అధికారంలోకి వచ్చింది.ఉద్యమ పార్టికి నాయకత్వం వహించిన కే.సి ఆర్‌ ‌ను నమ్మి తెలంగాణ ప్రజలు ఇప్పటికే రెండుసార్లు అధికారం కట్టబెట్టారు.

నమ్మి నానబోత్తే పుచ్చి బుర్రలైనట్లు ఈ ఏడున్నర ఏండ్ల కే.సి ఆర్‌ ‌పాలనలో ఉద్యమ కాలం లో పురుడు బోసుకున్న ఆదర్శాలను పురిట్లోనే గొంతునొక్కి అవకాశవాద రాజకీయాలకు అతీతున్ని కాదనే సంకేతాన్ని అందించాడు.తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడని తాను కాపలిదారున్ని మాత్రమేనని అద్భుతమైన ఆదర్శ వాక్కులతో తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకొన్నారు. వాస్తవానికి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్‌ ‌ప్రజలనుండి ప్రబలంగా వచ్చిందేమి కాదు. టీఆర్‌ఎస్‌ అదికారంలోకి వస్తే. కే.సి.ఆర్‌ ‌కాకుండా మరొకరు ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన కూడా ప్రజల్లో లేదు. కాని తాను పదవీ కాంక్ష లేని ప్రజా నాయకునిగా ప్రజలను నమ్మించడానికి ఎన్నికల్లో వేసిన ఎత్తుగడ గానే దీనిని అభివర్ణించవచ్చు. నమ్మడం, మోసపోవడం తెలంగాణ ప్రజలకు కొత్తేమి కాదు.అభిమానిస్తే అందలమెక్కించడం, తేడా వేస్తే అంతే బలంగా నేలకు విసిరి కొట్టడం కూడా వారికి బాగా తెలుసు.ఇప్పటికే ప్రజలు ఇలాంటి సంకేతాలను అందించారు.

ధ్వంసమే పునర్నిర్మాణమనే వక్రభాష్యాలతో ప్రజల కళ్ళకు గంతలు కట్టడం ఎంత కాలం నడుస్తుంది.నిజానికి స్వరాష్ట్రం లో పునర్నిర్మాణమంటే ఎట్లుండాలి. మాటకు,చేతకు తేడాలేని పాలకుల ఔన్నత్యం తో సకలరంగాలు సంతులివృద్ధిగా దిశగా ముందుగాసాగాలనీ అభిలషించాము. కవులు, కళాకారులు,ఎన్ని ఆకాంక్ష ల వలపోతగా గజ్జెకట్టి గంతులేశారు.భావాప్రకటన స్వేచ్చ కై పరితపించిన ప్రజాస్వామ్య వాదుల ఆరాటాలన్నీ అడియాసలు కాగా నిజాం ను మించిన నిరంకుశత్వంతో పేనం మీద నుండి పొయ్యిలోబడ్డ చందనా విలవిల వాడటం లేదా?.నూరు పూలు వికసించి వేయి ఆలోచనల సంఘర్షణతో సరికొత్త మార్పులు ఈ నేలలో సాకారం కావాలన్నా మేధోమథనానికి తావెక్కడున్నది. ఆధిపత్యపీఠం కంటే హక్కుల సంఘానికి అధిపతి గా ఉండడమే గొప్పనే ఆదర్శాలెక్కడ పోయినవి.

ఓట్లు,నోట్లు సీట్లు,,అధికారం విషవలయంగా మారిన ఈ గడ్డమీద సంక్షేమం సంక్షోభం గా మారి, సకల వ్యవస్థలు నిధుల లేమి తో నిరాదరణకు గురి చేయబడి నిస్సత్తువ గా మారడం పాలకుల పరాకుతనం వల్ల కాదా? చీకటి నుండి కటిక చీకటిలోకి నెట్టే కుటిలత్వాలకు చరమగీతం పాడకపోతే భావి తరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలమా? మిగులు బడ్జెట్‌ ‌తో ధనిక రాష్ట్రంగా నున్న తెలంగాణ అప్పుల కుప్పగా ఎందుకు మారింది.వేలకోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన ప్రాజెక్టులతో కడుపు నిండిందెవరికి? ఉద్యోగాల ఊసెత్తక నిరుద్యోగుల ఉసురుదీస్తున్న దుస్థితి ఎందుకు దాపురించింది. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని జీతాలివ్వడానికి నానా యాతనలు పడుతున్న దుస్థితికి కారణమేమిటి.మద్యం అమ్మకాలతో మనుగడ సాగిస్తున్న ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉందనుకుంటామా? పసిపిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాల వెనుక మద్యం మహామ్మారి పాత్ర లేదా? ఇట్లా మన కళ్ళకు స్పటిక సాదృశ్యం లా కనబడుతున్న పాలన పరమైన లోపాలను సరిదిద్దుకొని ప్రజల ఆకాంక్షల మేరకు పాలన కొనసాగించలన్నా ఆలోచన పాలకులకు లేదనిపిస్తుంది.

గోరుచుట్టు రోకటి పోటులా ఇటీవల స్థానికతను విస్మరించి హడావిడిగా అమలు పరిచిన 317 జీ.ఓ. ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఎంత కల్లోలాన్ని రేపుతుంది.స్వరాష్ట్రంలో కూడా స్థానికత కై జరుగుతున్న బలిదానాలు బండ బారిన పాలకుల గుండెలను కదిలించడం లేదు.ఇంత పెద్ద ప్రక్రియను అమలు చేసే ముందు సంఘాలన్నింటితో మాట్లాడి అభిప్రాయ సేకరణ ద్వారా ముందు పోవాలి కదా?. తెలంగాణ సాధనలో ముందుండి కొట్లాడిన సంఘాలతో మాట్లాడటానికి ప్రభుత్వం ఇంత భేషజాలకు పోవాల్సిన అవసరం ఉన్నదా ? ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో పోరాడేసంఘాలను వదిలి వ్యక్తిగత ప్రయోజనాల కై వెంపర్లాడే తాబేదారి సంఘాల పల్లకి మోసినంత కాలం ఈ అగచాట్లు భరించక తప్పదు.

– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి
9494789731

Leave a Reply