Take a fresh look at your lifestyle.

శశికళ నిష్క్రమణ వెనుక దీర్ఘకాలిక వ్యూహం

అన్నా డిఎంకె అధినేత్రి జయలలిత ఇష్టసఖి శశికళ రాజకీయాలకు దూరమవుతున్నట్టు చేసిన ప్రకటన తమిళనాడులోనే కాకుండా, దేశ వ్యాప్తంగా రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, ఆమె నిష్క్రమణ వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉండి ఉండవొచ్చు. జనవరి 27వ తేదీన బెంగళూరులోని పరప్పర అగ్రహారం జైలు నుంచి విడుదలైన శశికళకు తమిళనాడులో ఘన స్వాగతం లభించిన తీరును బట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఆమె తిరిగి చక్రం తిప్పవొచ్చని ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. ఎంతో మంది సీనియర్‌ ‌నాయకులు, సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు  చెన్నైలో ఆమె నివాసానికి క్యూ కట్టారు.ఆమె తీరు కూడా అన్నా డిఎంకె పార్టీని చేజిక్కించుకోవాలన్నట్టుగానే కనిపించింది. తానే పార్టీ ప్రధాన కార్యదర్శినని ఆమె చెప్పుకున్నట్టు వార్తలు వొచ్చాయి.అయితే, పార్టీని సంఘటితంగా ఉంచడంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, సీనియర్‌ ‌నాయకుడు పన్నీర్‌ ‌సెల్వంల వ్యూహాలు ఫలించాయి.

ఆమెకు పార్టీ నాయకత్వాన్ని అప్పగించే ప్రసక్తి లేదని పళనిస్వామి స్పష్టం చేశారు. నాల్గేళ్ళ క్రితం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు.తిరిగి ఆమెను పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. మరో వంక శశికళ మేనల్లుడు అమ్మ అన్నాడిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు దినకరన్‌ ‌మాత్రం శశికళ నేతృత్వంలోనే అన్నా డిఎంకె కి భవిష్యత్‌ ఉం‌దని అంటూ ప్రకటనలు చేశారు. అయితే, పళనిస్వామి ఏమాత్రం బెదరకుండా, చలించకుండా తన పని తాను చేసుకుని పోతున్నారు. ఢిల్లీ వెళ్ళి బీజేపీ అధినేతలను కలిసి బీజేపీతో తమ పార్టీ కొనసాగుతుందని ప్రకటించారు. అంతేకాకుండా, శశికళ ప్రభావం ఏమీ ఉండదని వారికి నమ్మకం కలిగించారు.అయితే, శశికళ తన వారిని ఢిల్లీ పంపించి  కేంద్రంలోని కమలనాథులతో మంతనాలు జరిపించారు.

శశికళను పార్టీలో చేర్చుకోవాలని కేంద్ర నాయకులు సూచించినట్టు వార్తలు  వొచ్చాయి.అలాగే , నాయకత్వాన్ని అప్పగించమని  సలహా ఇచ్చినట్టుగా కూడా వార్తలు వొచ్చాయి.అయితే, పళనస్వామి తన వైఖరిలో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. అధికారం ఉన్న వారి చుట్టూ జనం తిరగడం ఆధునిక రాజకీయాల్లో చూస్తున్నదే. పళనిస్వామికి అది కలిసి వొచ్చింది.అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడటానికి ముందు బంగారు రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడులో బంగారానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆడపిల్లకు  కట్నం బదులు బంగారం ఇవ్వడం ఒక ఆనవాయితీ.అలా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టని అత్తింటి వారు భావిస్తారు. తమిళులకు బంగారం సెంటిమెంట్‌ ఉం‌ది.అందువల్ల వొచ్చే ఎన్నికల్లో ఆ సెంటిమెంటు అన్నా డిఎంకె విజయానికి తోడ్పడవచ్చునని చాలా మంది భావిస్తున్నారు.అంతేకాకుండా తమిళనాడులో పళని స్వామి పాలనలో పెద్దగా గొడవలేమీ లేవు. కులపరమైన, సామాజికవర్గాల పరమైన ఘర్షణలు లేవు.

మైనారిటీల నుంచి కూడా సవాళ్ళు లేవు. పళనిస్వామి పాలనకు కేంద్రం నుంచి కూడా ప్రశంసలు అందాయి.. పళని స్వామి ప్రసంగాల్లో ప్రత్యర్ధులపై తీవ్రమైన ఆరోపణలు చేసినా, వ్యక్తిగతమైన విషయాలను ఎన్నడూ ప్రస్తావించలేదు.అంతేకాక, పన్నీర్‌ ‌సెల్వం వంటి సీనియర్‌ ‌నాయకుణ్ణి మరో పార్టీ పెట్టించనివ్వకుండా తన నాయకత్వంలో పని చేసేట్టు చేయడంలోనే పళనిస్వామి శక్తి సామర్ద్యాలు బహిర్గతం అయ్యాయి. జయలలిత కొద్ది రోజుల పాటు జైలుకి వెళ్ళినప్పుడు, మరణానికి ముందు హాస్పిటల్‌ ‌పాలైనప్పుడు పన్నీర్‌ ‌సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రిగా వ్యవహరించడం వల్ల పార్టీలో తానే సీనియర్‌ ‌ననీ , తనకే పీఠం లభిస్తుందని వాదించారు.అయితే, అప్పట్లో శశికళ ప్రభావం ఎక్కువగా ఉండేది.

జయలలిత హాస్పిటల్‌ ‌లో ఉన్నప్పుడు శశికళ హాస్పిటల్‌ ‌లోకి ఎవరినీ రానివ్వకుండా  అంతా తానై వ్యవహరించారు. ఆమె సూచన మేరకే పళనిస్వామిని ముఖ్యమంత్రి అయ్యారు.అంతవరకూ పళనిస్వామి పేరు అంతగా పాపులర్‌ ‌కాదు. ఆమె జయలలిత కేబినెట్‌ ‌లో పని చేసిన మాటనిజమే కానీ, పన్నీర్‌ ‌సెల్వం కన్నా జూనియరే. పళనిస్వామి స్థానం సుస్థిరం కావడానికి అప్పట్లో శశికళ అనుకూల వర్గం అంతా సహకరించింది.అయితే, పదవిలోకి వొచ్చిన తర్వాత పళని స్వామి తాను అందరివాడిననిపించుకునే రీతిలో పాలన సాగిస్తున్నారు. తమిళనాడులో  బలమైన సామాజికవర్గమైన నాడార్‌ ‌కమ్యూనిటీ మద్దతు పళనిస్వామికి ఉంది.

తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గాంధేయవాది కామరాజు నాడార్‌ ‌వల్ల నాడార్‌ ‌సామాజికవర్గం కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగాయి. ఇచ్చిన వాగ్దానాలను అమలు జేస్తారనే నమ్మకం తన సామాజికవర్గం పట్ల జనానికి కలగడంలో కామరాజ్‌ ‌నాడర్‌ ‌చాలా కృషి చేశారు. అంతేకాకుండా రాజకీయాలకు హుందాతనాన్ని , గౌరవాన్ని  తెచ్చి పెట్టిన సామాజికవర్గంగా నాడార్‌ ‌కమ్యూనిటీకి మంచి పేరు ఉంది. పళనిస్వామి నిలదొక్కుకోవడానికి అవన్నీ తోడ్పడ్డాయి. శశికళతో ఆయనకు వ్యక్తిగత వైరం లేదు. పన్నీర్‌ ‌సెల్వం శశికళపై వ్యక్తిగత విమర్శలు చేశారు.అందువల్ల ఆయన కన్నా,పళనిస్వామి అధికారంలో ఉంటేనే తనకు మంచిదని ఆమె భావిస్తున్నారు. కాగా, శశికళ వయసు పైబడటం వల్ల పూర్వం మాదిరిగా క్రియాశీలంగా వ్యవహరించలేకపోతున్నారు.

జైలులో ఉండి రావడం వల్ల ఆర్‌ ‌జెడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌మాదిరిగా ఆమె ప్రభుత్వ పదవులను నిర్వహించేందుకు వీలు లేదు.అందువల్ల ఒక వైపు అనారోగ్య సమస్యలు, మరో వైపు డిఎంకె విసురుతున్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేకపోవడంతో ఆమె రాజకీయాలకు గుడ్‌ ‌బై చెప్పి ఉండవొచ్చు. అమ్మ  (జయలలిత) పాలన ఎక్కువ కాలం కొనసాగడమే తన లక్ష్యమని ఆమె జైలుకు వెళ్లే ముందు జయలలిత సమాధిపై అరచేతిని గట్టిగా చరిచి శపథం చేశారు.ఆ ప్రకారమే ఇప్పుడు ఆమె పళనిస్వామితో లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఉండవొచ్చు. రజనీకాంత్‌ ‌మాదిరిగా గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి తెరవెనుక నుంచి  పార్టీనీ, ప్రభుత్వాన్ని నడిపించవచ్చన్నది ఆమె వ్యూహం కావొచ్చు.

Leave a Reply