Take a fresh look at your lifestyle.

ఎల్‌ఆర్‌ఎస్‌ ‌పేరుతో.. రియల్‌ ఎస్టేట్‌ ‌నడ్డివిరిచారు

ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌

ఎల్‌ఆర్‌ఎస్‌ ‌పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం నడ్డి విరిచిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. గురువారం రాష్ట్రంలో విద్యా రంగ సమస్యపై నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు పీఎల్‌ ‌విశ్వేశ్వరరావు, ప్రొ.జయశంకర్‌, ‌హెచ్‌ఆర్‌డి చైర్మన్‌ శ్రీ‌శైల్‌రెడ్డితో కలసి నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసి రియల్‌ ఎస్టేట్‌ ‌రంగాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ ‌చేశారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా అనేక మందికి తీవ్ర దుర్భర పరిస్థితి ఏర్పడిందనీ, పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటున్నప్పటికీ ప్రైవేటు ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ప్రతీ ప్రైవేటు ఉద్యోగికి ఉచిత రేషన్‌తో పాటు ప్రతి నెలా రూ. 7500 ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు. కొంత మంది గ్రామాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారనీ, మరికొంతమంది పండ్లు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం
కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరికొంతమంది కుటుంబ భారాన్ని మోయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ, వీరి ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహంచాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. పాఠశాలలు నడవక పోవడం వల్ల కార్పొరేట్‌ ‌పాఠశాలలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ తక్కువ మంది విద్యార్థులతో నడిచే చిన్న స్థాయి ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కాబట్టి ప్రభుత్వం ఉన్నత చదువుల కోసం ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తింపజేయాలని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకూ ప్రభుత్వం క్యాలెండర్‌ను విడుదల చేయకపోవడం దారుణమనీ, విద్యా సంవత్సర క్యాలెండర్‌ను ప్రకటించకుండా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నదని ఆరోపించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply