పరిశీలనకు 300 ప్రత్యేక బృందాలు ఏర్పాటు
నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష
వలస పక్షులపై అప్రమత్తంగా ఉండాలి : పీసీసీఎఫ్ శోభ
ఉత్తరాది రాష్ట్రాలలో కలకలం సృష్టిస్తున్న బర్ట్ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు వెలుగు చూడటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో బర్డ్‌ఫ్లూ నివారణ కోసం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బర్డ్‌ఫ్లూ రాష్ట్రంలో విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పనపై చర్చించారు. అన్ని స్థాయిల అధికారులను అప్రమత్తం చేశారు.
బర్డ్‌ఫ్లూ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై పరిశీలనకు 300 మంది అధికారుల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు నిరంతరం వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. బర్డ్ ఫ్లూపై ప్రసార,
సామాజిక మాథ్యమాల్లో వస్తున్న కథనాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ పరిశ్రమ సంయుక్త భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు, బర్డ్‌ఫ్లూపై రాష్ట్ర అటవీ శాఖ కూడా అప్రమత్తమైంది. కేంద్రం ఆదేశాల మేరకు చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులకు రాష్ట్ర అటవీ శాఖ పీసీసీఏఫ్ ఆర్. శోభ సమాచారం ఇచ్చారు. జూ పార్క్ లతో పాటు, అటవీ ప్రాంతంలో ఏవైనా అసహజ మరణాలు ఉంటే నమోదు చేయాలని, తగిన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు. ఈ సీజన్లో వలస పక్షుల సంచారం వుంటుందని వాటిని కూడా పర్యవేక్షించాలని తెలిపారు. ఎవరికైనా సంబంధించిన సమాచారం ఉంటే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు 18004255364 ఫోన్ చేయాలని కోరారు.