Take a fresh look at your lifestyle.

రాజకీయాల్లో రాఫెల్‌ ‌రగడ…

ఫ్రాన్స్ ‌దేశంలో మీడియాపార్ట్ అనే ఆన్లైన్‌ ‌పత్రికలో రాఫెల్‌ ‌జెట్‌ ‌విమానాల ఒప్పంద అంశంపై వచ్చిన అవినీతి కథనం రెండు దేశాల్లో ప్రధాన చర్చకు తావిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన పార్లమెంటు సమావేశాల్లో దీనిపై విస్తృతమైన విచారణ జరగాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్‌ ‌చేస్తూ చర్చకు అనుమతి ఇవ్వని ఎన్డీయే ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి.ఇండియా 126 ఫైటర్‌ ‌జెట్లను కొనే ఉద్దేశ్యం వ్యక్తపర్చగా ప్రాన్స్-ఇం‌డియా మధ్య యూపీఏ హయాంలో కొనుగోలుకు రక్షణ ఒప్పందం జరిగిన విషయం మనకు తెలిసిందే.అయితే ఆ ఒప్పందంలో ఫ్రాన్స్ ‌రక్షణ సంస్థ డసాల్ట్ ‌దాని ఇండియా భాగస్వామిగా ప్రముఖ రక్షణ ఉత్పత్తుల సాంకేతిక సంస్థ హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ ‌ను నాటి యూపీఏ ప్రభుత్వం చేర్చగా కొత్తగా వచ్చిన మోడీ నేతృత్వంలో వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం గతంలో కుదిరిన 126 విమానాల ఒప్పందాన్ని రద్దుచేసి 36 రాఫెల్‌ ‌జెట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోగా అదే నేడు వివాదాలకు ప్రధాన కేంద్రబిందువు అయ్యింది.నాడు భారత ప్రభుత్వం తరపున మోడీ,ప్రాన్స్ ‌నుంచి అధ్యక్షుడు  ఫ్రాన్సిస్‌ ‌హోలాండ్‌ ఒప్పందంపై సంతకాలు చేయగా ఒప్పందం సమయంలో కనీసం రక్షణ మంత్రిగా లేకపోవడం,పైగా ఇండియన్‌ ‌భాగస్వామ్య కంపెనీ అయిన హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ ‌ని తొలగించి అనిల్‌ అం‌బానీకి చెందిన కంపెనీకి కట్టబెట్టడం పెద్ద వివాదంగా మారింది. తేజస్‌ ‌వంటి తేలికపాటి యుద్ధ విమానాలు చేసిన విశిష్టత కలిగిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ ‌వంటి సంస్థను వదిలి రక్షణ రంగంలో ఎలాంటి అనుభవం లేని అనిల్‌ అం‌బానీకి ఒప్పందాన్ని ఎలా కట్టబెడతారు అని రక్షణ రంగ నిపుణులు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. మీడియపార్ట్ ‌కథనం ప్రకారం కొత్త ఒప్పందం చేయడానికి కొద్దిరోజుల మునుపే అనిల్‌ అం‌బానీ కొత్త కంపెనీ నమోదు అయ్యింది అని ఆ కంపెనీని ఇండియా భాగస్వామ్యంలో చేర్చడానికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన బృందమే కృషి చేసిందనే చెప్పింది, పైగా ఫ్రాన్స్ ‌మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ ‌హోలాండ్‌ ఇం‌డియన్‌ ‌భాగస్వామ్య కంపెనీ అయిన హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ ‌ని మార్చడం అనేది డసాల్ట్ ‌కానీ ఫ్రాన్స్ ‌ప్రభుత్వం పాత్ర ఏమీ లేదనీ ఒప్పందంలో భాగస్వామిని మార్చే స్వేచ్ఛ భారత ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని చెప్పడంతో ప్రభుత్వం రక్షణ ధోరణిలో పడింది.గతంలో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ ‌కంపీనిని సందర్శించిన డసాల్ట్ ‌కంపెనీ ప్రతినిధులు తేజస్‌ ‌విమానాల రూపకల్పన తీరును ప్రశంసించగా ఆ కంపెనీని భాగస్వామిగా ఎందుకు వద్దు అనుకుంటారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సుసేన్‌ ‌గుప్తా అనే పేరు ఈ రాఫెల్‌ అం‌శంలో వినిపిస్తున్న మరోపేరు.రక్షణ రంగంలో మధ్యవర్తిగా వ్యవహరించే ఇతను 2015లో ఒప్పందానికి సంబంధిచిన రహస్య కీలక పత్రాలు తెప్పించుకుని ఒప్పందంలో డసాల్ట్ ‌కంపెనీకి ఫైటర్‌ ‌జెట్ల వెల పెంచి లబ్ది పొందేలా సహకరించారు అనేది అనుమానించాల్సిన అంశం.ఓ పక్క రెండు దశాబ్దాలుగా ఇతనికి డసాల్ట్ ‌కంపెనీతో సుస్థిరమైన సంబంధాలు ఉన్నాయని,సింగపూర్‌ ‌దేశంలో ఓ నకిలీ కంపెనీ సృష్టించి నిధుల రూపంలో దానికి డసాల్ట్ ఇచ్చిన ముడుపుల్ని మళ్లించాడని మీడియాపార్ట్ ‌కథనం సంచలనం సృష్టిస్తోంది.ఫ్రెంచ్‌ ‌కంపెనీలకు విమానాల ధరలు పెంచి లబ్ది చేసినందుకు ప్రతిఫలంగా ఇచ్చిన ముడుపులన్నీ నేరుగా చెల్లించకుండా వివిధ పరోక్ష మార్గాల్లో చెల్లించినట్టు దర్యాప్తు సంస్థ ఈడీ సుసేన్‌ ‌గుప్తా కంప్యూటర్లో సమాచారాన్ని బట్టి నిర్ధారణ చేసింది.ఈయన మీద అగస్టా వెస్ట్ ‌ల్యాండ్‌ ‌విమానాల కుంభకోణంలో అవినీతికి సంబంధించి కూడా విచారణ జరుగుతున్న విషయం గమనార్హం.కోబ్రాపోస్ట్ అనే భారత్‌ ‌వెబ్సైట్‌ ‌డసాల్ట్ ‌మరియు సుసేన్‌ ‌గుప్తాల మధ్య ఉన్న లోపాయకారి సంబంధాల గురించి రాసిన విషయం ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది.సమర్ధవంతంగా పనిచేసి నిరూపించుకున్న హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ ‌ని వదిలిపెట్టి రక్షణ రంగంలో అనుమతి లేని అనిల్‌ అం‌బానీ లాంటి అసమర్దులకు ఒప్పందాలు ఇవ్వడం దేశ రక్షణ ప్రయోజనాలు తాకట్టు పెట్టడమేనని విమర్శలు వస్తున్నాయి.పైగా భారత బ్యాంకులకు రెండు లక్షల కోట్లు ఎగ్గొట్టి,2జీ స్పెక్ట్రమ్‌ ‌కేసులో విచారణ ఎదుర్కొంటున్న అనిల్‌ అం‌బానిని ప్రభుత్వం నెత్తిన ఎక్కించుకుంటుందని పలువురు విమర్శిస్తున్నారు.

విమానాల తయారీ అంచనా వ్యయం మూడంతలు పెరిగి అంతర్జాతీయ ద్రవ్యోల్బణం కారణంగా ధరలు మారాయని ప్రభుత్వం చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.దేశభద్రత అంశాలు అని చెబుతూ రహస్యంగా ఉంచడమే రక్షణ రంగంలో అవినీతికి మూలంగా మారిందని రక్షణ రంగంలోనే పలువురు విమర్శించడం గమనార్హం.రక్షణ ఒప్పందాల గోప్యత కారణంగానే కార్గిల్‌ అమరవీరుల శవపేటికల దగ్గర నుంచి వారు తొడుక్కునే బూట్ల దాకా అవినీతి జరిగిందని విమర్శలున్నాయి.
– పిల్లుట్ల నాగఫణి,8074022846.కాకతీయ విశ్వవిద్యాలయం

Leave a Reply