మది నుంచీ
నిరాశలు ఉల్కలా రాలి
కళ్ళు
చిమ్మచీకటిని పులుముకొంటాయి
ధైర్యంగా ఎదుర్కోలేని
దేహాన్ని విరిగిన రెక్కలు వెక్కిరిస్తాయి
జీవనయానంలో
నడవలేని అడుగుల్ని చూసి
నాలుగు గోడల నవ్వుకొంటాయి
న(మ)ది అన్నాక
అటపోట్లు సహజం
పడిన చోటే లేవాలి
ఆలోచన కెరటాల్ని
అందిపుచ్చుకోవాలి
పరిపక్వతతోనే పదిలం చేసి
కలల్ని తెరచాప చేసి నాటాలి
కాలం క్రొవ్వొత్తిలా కరిగాక
వయసు ఎండిన నదిలా మారి
గుండె గదిని గగుర్పాటుకు గురిచేస్తుంది
నువ్వు నమ్మవు కానీ
తెరలు, తెరలుగా
నిలబడ్డ చీకటిని చీలుస్తూ
మిణుగురు మిరమిట్లుగొలుపుతూ
వెళుతోంది దానిది ఏ ఆసరా అని ?
కరిగిన మేఘం మళ్ళీ,మళ్ళీ
నదిని చేరి ఆకాశంలో ఊరిస్తూ
నిలబడుతుంది
దానిది ఏ కాంక్ష అని ?
చెట్టు రెమ్మల్ని పలకరిస్తూ
పూల సోయగాల్ని ఆస్వాదిస్తూ
రంగుల రెక్కల్ని పులుముకొని
సీతాకోక చిలుక పుడమికి
హంగుల్ని అద్దుతోంది ఎందుకని ?
చీకటి, వెలుగుల ఆటలో
చిరు ఆలోచనల ప్రయత్నమే
మనిషి మనుగడకు తొలి సోపానం
రంగుల రెక్కలతో
ఆశయాల వైపు
ఒడి, ఒడిగా చేరడమే మనిషి నైజం…!!
– మహబూబ్ బాషా చిల్లెం, 9502000415