Take a fresh look at your lifestyle.

కేసీఅర్‌ను దింపడమే లక్ష్యంగా రాములమ్మ?

కేసీఆర్‌పై ప్రజల భ్రమలు తొలగిపోయాయ్‌…
‌దుబ్బాక ఫలితమే ఇందుకు నిదర్శనం
పక్కాగా అడుగులు వేస్తున్న బిజెపి, రాములమ్మ
కేంద్రంలో కీలక పదవీ?
సౌత్‌ ఇం‌డియాలో ఆమె సేవలను
ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో కమలనాథులు

విజయశాంతిపై పూర్తిగా ఆశలు వొదులుకున్న కాంగ్రెస్‌
‌కాంగ్రెస్‌తో దాదాపుగా కటీఫ్‌ ‌చేసుకున్న విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ ఏ క్షణమైనా బిజెపిలో చేరేందుకు కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజానీకాన్ని కాపాడటం కోసమే విజయశాంతి కాషాయం కండువాను కప్పుకోవాలన్న ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చారనీ అత్యంతమైన విశ్వసనీయవర్గాలు శనివారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సిఎం కేసీఆర్‌ ‌నుంచి ప్రజలను రక్షించుకోవడానికి ముఖ్యంగా ఆయనను అధికారం నుంచి
దింపడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని విజయశాంతి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. కేసీఆర్‌ను అధికారం నుంచి దింపడం కోసం విజయశాంతి తన వద్ద ఉన్న ఆలోచనలను  జాతీయస్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో… అటు కేంద్రంలోని బిజెపి నేతలు…ఇటు విజయశాంతి పక్కా స్కెచ్‌తో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి, సిఎం కేసీఆర్‌ అం‌టేనే ఒంటికాలిపై లేచే విజయశాంతి ఏ క్షణమైనా సొంతగూటికి చేరే అవకాశం ఉంది.  తెలంగాణ ప్రజల్లో తనకంటూ గుర్తింపు ఉన్న రాములమ్మ ఎంట్రీ బిజెపికి కలిసి రావడమే కాకుండా ఆమె సేవలను సౌత్‌ ఇం‌డియా వ్యాప్తంగా ఉపయోగించుకునే ఆలోచనలో  బిజెపి జాతీయ నేతలు ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే మాట, ముచ్చట కూడా అయ్యాయనీ తెలుస్తుంది. బిజెపి బలోపేతానికి, సిఎం కేసీఆర్‌ను గద్దె దింపడానికి ఎంత మేరకైనా కష్టపడటానికి రాములమ్మ మానసికంగా సిద్ధంగా  ఉన్నట్లు సమాచారం. రాములమ్మ మదిలో ఆలోచనలు, పట్టుదల బిజెపి జాతీయ నాయకత్వాన్ని విశేషంగా ఆకట్టుకున్నట్లు తెలుస్తుంది.

బిజెపిలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సందర్భంలోనే ఆమె  తల్లి తెలంగాణ పార్టీతో తెలంగాణ ఉద్యమానికి తనవంతు పోరాడిన విజయశాంతికి తెలంగాణలో మంచి ఫాలోయింగ్‌ ఉం‌ది. రాములమ్మగా జనం విజయశాంతిని ఇప్పటికీ ఆదరిస్తారు. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ ‌హోదాలో ఉన్నప్పటికీ…ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు. ఆమెను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అహ్మద్‌పటేల్‌ ‌సూచన మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం టాగూర్‌ ‌రంగంలోకి దిగినప్పటికీ…ఫలితం లేకుండా పోయింది.  టాగూర్‌ ‌రంగంలోకి దిగినా రాములమ్మ శాంతించకపోవడానికి కారణం కాంగ్రెస్‌ ‌పార్టీకి రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతుండటం…పని చేస్తామన్న నేతలను ప్రోత్సహించకపోవడం తదితర అంశాలే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకత్వం విజయశాంతిపై పూర్తి స్థాయిలో ఆశలు వదులుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ తరపున రూపొందించిన  స్టార్‌ ‌క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతికి చోటు కల్పించలేదనీ తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేయడమే కాకుండా, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ…ప్రజలకు అందుబాటులో లేని సిఎం కేసీఆర్‌ను సిఎం కుర్చీ నుంచి దింపాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీతోనే సాధ్యమవుతుందన్న ఆలోచన మేరకు విజయశాంతి బిజెపిలోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో విజయశాంతి తిరిగి సొంతగూటికి ఎప్పుడైనా చేరనున్నారు. దీనికి సంబంధించి బిజెపి జాతీయ నాయకుల నుంచి కూడా ఆమెకు ఘన స్వాగతం ఉన్నట్లు తెలుస్తుంది.

అందుకు తాజాగా.. విజయశాంతి చేస్తున్న కామెంట్స్ ‌కూడా ఊతం ఇస్తున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్‌ ‌టార్గెట్‌గా విజయశాంతి ఒక పోస్ట్ ‌పెట్టారు. ఎంఐఎంను, కేసీఆర్‌తో లింకుపెట్టి చేస్తున్న పోస్టులతో ఆమె  ఓ ఫక్తు బిజెపి నేత మాట్లాడినట్లుగా ఉంటుందని చెప్పడంలో ఎలాంట సందేహం లేదు. దీంతో రాములమ్మ బ్యాక్‌ ‌టు బిజెపి వే సిద్ధం చేసుకున్నట్లు  అని కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. దీంతోనే  కాంగ్రెస్‌ ‌నేతలెవరూ కూడా రాములమ్మను బుజ్జగించే ప్రయత్నాలు  చేయడం లేదనీ సమాచారం. రాష్ట్రంలో, దేశంలో ఇప్పట్లో కాంగ్రెస్‌ ‌పుంజుకునే అవకాశం కనపించకపోవటం, పైగా బిజెపి రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి  ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడం..పార్టీ చీఫ్‌ ‌బండి దూకుడుగా వెళ్తుండటం… రాష్ట్రంలో బలపడుతున్న దశలో విజయశాంతి కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, ఫైర్‌ ‌బ్రాండ్‌ అం‌దులోనూ లేడీ కావటం బిజెపికి-విజయశాంతికి కలిసివస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, 2014లో సిఎంగా కేసీఆర్‌ అధికారం చేపట్టినప్పుడు ఆయనపై ప్రజల్లో ఉన్న భ్రమలన్నీ ఈ ఆరేండ్ల కాలంలో తొలగిపోయాయనీ, ఇందుకు నిదర్శనమే…దుబ్బాక ఉప ఎన్నికల్లో సర్వశక్తులొడ్డినా కూడా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెలవకపోవడమనీ, దీన్ని బేస్‌గా చేసుకుని రాష్ట్రమంతా తొలుత గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బిజెపి ఆలోచనకు తోడుగా రాములమ్మ కూడా తనవంతు సహకారం అందించేందుకు మానసికంగా సిద్ధంగా ఉందనీ తెలుస్తుంది. గతంలో మాదిరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సిఎం కేసీఆర్‌ ‌మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరనీ, అయితే, టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఉన్న ఎక్స్అఫిషియో సభ్యులతో సహకారంతో గ్రేటర్‌ ‌పీఠాన్ని అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ…గతంలో కంటే ఎక్కువగా ఈ దఫా పుంజుకునేందుకు బిజెపి ఎత్తులు వేస్తూ…..విజయశాంతికి ఉన్న ఫాలోయింగ్‌, ‌ఛరీష్మాను ఈ ఎన్నికల్లో సంపూర్ణంగా వాడుకోవాలని బిజెపి భావిస్తుండగా…విజయశాంతి సైతం  తన పూర్తి సహకారాన్ని అందించాలనే ఆలోచనలోనే ఉన్నారనీ సమాచారం.

తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పనిచేసిన ఉద్యమకారులను, టిఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలందరినీ, కాంగ్రెస్‌లోని తన అనుచరవర్గంను, అభిమానులను అందరినీ ఏకతాటిపైకి తెచ్చి తద్వారా గ్రేటర్‌లో బిజెపి పుంజుకునేలా విజయశాంతి తనదైనశైలిలో అడుగులు వేస్తున్నారనీ తెలుస్తుంది.  కాగా, బిజెపితోనే రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతికి బిజెపి జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపికి విజయశాంతి మాస్‌ ‌ఫాలోయింగ్‌, ‌ఛరీష్మా ఉన్న లీడర్‌ ‌సౌత్‌ ఇం‌డియాలో చాలా అవసరం. ప్రస్తుతం బిజెపి బలపడుతున్న టైంలో విజయశాంతి వంటి లీడర్‌ ‌బిజెపిలో చేరడం వల్ల బిజెపికి కూడా రాజకీయంగా చాలా కలిసి వస్తుందన్న ఉద్దేశంతోనే బిజెపి జాతీయ నేతలే విజయశాంతిని బిజెపిలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. బిజెపిలో విజయశాంతి చేరిన వెంటనే  కేంద్రంలో మంచి పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదనీ, తద్వారా రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు విజయశాంతి కీ రోల్‌ ‌పోషించేవిధంగా పక్కా ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు  విశ్లేషిస్తున్నారు. అటు బిజెపి, ఇటు విజయశాంతి ఇద్దరిదీ కూడా రాష్ట్రంలో కేసీఆన్‌ అధికారం నుంచి గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా తెలుస్తుంది. దీని కోసం  విజయశాంతి వద్ద ఉన్న ఐడియాస్‌కు తగ్గట్టుగా జిజెపి జాతీయ నాయకత్వం చాలా పకడ్బందీ వ్యూహంను అమలు చేస్తూ… ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. చూడాలి మరి!.

Leave a Reply