Take a fresh look at your lifestyle.

ఎట్టకేలకు ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప

మొదటి నుండీ వరంగల్‌ ‌జిల్లా అంటేనే కళలకు కాణాచీగా పేరున్న జిల్లా. అపురూపమైన శిల్పకళా సంపదంతా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు చెందినదే అయినా, నేటి పాలకులు వరంగల్‌ ‌జిల్లాను అయిదు ఖండాలుగా విభజించటం వల్ల ఒక్కో కళాఖండం ఒక్కో జిల్లాకు తరలిపోయినట్లైంది. సుమారు వెయ్యి సంవత్సరాల కింద నాటి కాకతీయ రాజులు సృష్టించిన ఈ కళాసృష్టిని చూడడానికి వివిధ దేశాలను నుండి పర్యాటకులు రావడం విశేషం. అంతటి కళావైభోగం ఉన్నప్పటికీ పర్యాటక ప్రదేశాలుగా వీటిని గత ప్రభుత్వావాలేవీ తీర్చదిద్దలేకపోయాయి. వీటిని చూసేందుకు వొచ్చేవారికి కనీస సదుపాయాలకు కూడా లేకపోవడంతో ఒక విధంగా ఈ కట్టడాలు నిరాదరణకు గురైనాయనే చెప్పవొచ్చు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కళాసృష్టి అంతా జిల్లా కేంద్రంలోని వెయ్యి స్థంబాల గుడి, ములుగు(నేడు జిల్లాగా రూపాంతరం చెందింది)లోని రామలింగేశ్వర(రామప్ప) గుడిలోనే కనిపిస్తుంది.

కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ, తెలంగాణ ఏర్పడ్డాక ఈ ఆలయాలపై కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ప్రారంభమైంది. వెయ్యిస్థంబాల గుడికన్నా ఎక్కువ కళాసంపద ఉన్న రామప్పను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం బాగానే శ్రద్ధ కనబర్చింది. కాని, నేటికీ అక్కడికి చేరుకోవడానికి ప్రత్యేక రవాణా వ్యవస్థ మాత్రంలేదనే చెప్పాలె. అయినా అపురూప కళాసందను కనులారా చూసి, అస్వాదించేందుకు నిత్యం వందల సంఖ్యలో జనం వెళ్తునే ఉన్నారు. విదేశీయులను కూడా అబ్బురపరిచే ఈ కళా వైభవానికి అంతర్జాతీయ స్థాయిని కల్పించేందుకు దాదాపు దశాబ్దకాలంగా కృషి జరుగుతూనే ఉంది. దానివల్ల ఈ ఆలయ పరిసరాలు, రవాణా తదితర సదుపాయాలు మరింత మెరుగులు దిద్దుకునే అవకాశం ఉంటుందని బావించారు. 2010 నుండి ప్రారంభమైన ఈ కృషి 2021కి గాని ఫలించలేదు. వరల్డ్ ‌హెరిటేజ్‌ ‌కమిటి(యునెస్కో) ఎట్టకేలకు అంతర్జాతీయ పర్యాటక ముఖ చిత్రంలో దీనికి చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. విచిత్రకర విషయమేమంటే ఈసారి ప్రపంచ వారసత్వ సంపదగా కేవలం రామప్పకే గుర్తింపు రావడం. దేశంలో ఇతర అనేక ప్రాచీన కళాకండాలు, కట్టడాలున్నప్పటికీ ఒక్క రామప్పనే ఎంచుకోవడం ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా ప్రజలందరికీ ఆనందాన్ని కలిగిస్తున్న అంశం.

దక్షిణ భారతదేశంలో మనకు అనేక అపురూప కట్టడాలు కనిపిస్తాయి. అయితే ఎక్కడ కూడా వాటిని సృష్టించిన శిల్పి పేరు కనిపించదు. కాని, రామప్ప ఆలయం మాత్రం ఆ శిల్సి పేరున్నే సార్థకమవడం చరిత్రలో ఒక అపూరూప ఘట్టం. ఒక గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని, గ్రంథకర్త భావాలకు అనుగుణంగా శిల్పాలను సృష్టించిన ఘనత స్థపతి రామప్పకే దక్కింది. ఆ గ్రంథ రచయిత పేరు జాయప. కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి స్వయాన బావమరిది, ఆయన కొలువులో సేనానాయకుడు. అయితే జాయప శిల్పాలను చూసి ‘నృత్య రత్నావళి’ అనే నాట్య శాస్త్ర గ్రంథాన్ని రాశాడా, ఆయన రాసిన గ్రంథ ఆధారంగా ఇక్కడ శిల్ప సంపద సృష్టించబడిందా అన్న విషయంలో కొంత తర్జనబర్జన ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నది కేవలం శిల్పాలే కాదు, ఒక శాస్త్రాన్ని ప్రబోధిస్తున్నదన్నది కాదనలేని నిజం. ఇక్కడ మరో విచిత్రకర విషమేమంటే సహజంగా ఆనాడు ఇలాంటి కళాసృష్టి రాజుల ఆధీనంలోనే జరిగేది. కాని, ఈ ఆలయ నిర్మాణం మాత్రం గణపతిదేవ చక్రవర్తి మరో సేనాని రేచర్ల రుద్రుడి ఆధ్వర్యంలో జరిగింది. ఆ విధంగా ఇద్దరు సేనానాయకుల ఆలోచనలో నుండి పుట్టిన ఈ ఆలయం 1213లో ‘రామప్ప’ అనే మాహాశిల్పి చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. కాకతీయ గణపతిదేవుని విజయాల పరంపర గుర్తుగా దీన్ని సృష్టించడమైంది.

ఈ ఆలయాల శిల్పాకృతిపై పరిశోధన చేసిన నటరాజరామకృష్ణ ఈ శిల్పాల చాటున దాగి ఉన్న పేరిణీ నృత్యాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆలయానికి మణిహారాలుగా ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన పన్నెండు నిలువెత్తు మదనికలు(బ్రాకెట్‌ ‌ఫిగర్స్) ‌దర్శనమిస్తాయి. శిల్పాల గురించి ఒక కవి అన్నట్లు పైన కఠినమనిపించును.. లోన వెన్న కనిపించును అన్నట్లుగా ఈ మదనికా శిల్పాలు ఒక్కోటి ఒక్కో బంగిమలో ఏదో అర్థాన్నిచ్చేవిగా ఉండటం విశేషం. వాటికోసం వాడిన నున్నటి నల్లటి రాయి వాటి అందాలను మరింతగా ఇనుమడింపజేసేవిగా ఉన్నాయి. ఇక్కడి నంది ఒక సజీవ మూర్తిలా కనిపిస్తుంది. కేవలం శిల్పాలవరకే ఈ ఆలయ గొప్పదనం పరిమితంకాదు. ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక మచ్చుతునకేనని చెప్పవొచ్చు. ఇక్కడ వినియోగించిన ఇటుకలు (బ్రిక్స్) ‌నేటి శాస్త్రవేత్తల మేధకు పదునుపెట్టేవిగా ఉన్నాయి. ఇక్కడ గోపుర నిర్మాణంలో వాడిన ఇటుకలు నీళ్ళల్లో తేలడుతాయి. దేశంలో మరెక్కడ, ఆ మాటకు వొస్తే కాకతీయ కాలంలో కూడా మరెక్కడ ఇలాంటి ఇటుకలను వాడిన సమాచారంలేదు. అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపిక కాగా, మనదేశం నుండి 2020 సంవత్సరానికి గాను రామప్ప ఒక్కటి మాత్రమే ఎంపిక అయింది. అందుకే దీనిపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేస్తూ, ఇంతటి అపురూప దేవాలయాన్ని సందర్శించాల్సిందిగా పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply