Take a fresh look at your lifestyle.

సమాజానికి స్ఫూర్తి రామలింగారెడ్డి జీవితం: మంత్రి హరీష్ రావు

సామాజిక ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, రాజకీయుడిగా వివిధ రూపాల్లో దుబ్బాక శాసన సభ్యులు రామలింగారెడ్డి ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం సమాజానికి స్ఫూర్తి దాయకమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు.
శనివారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన గజ్వేల్ ప్రెస్ క్లబ్, మంజీర రచయితల సంఘం(మరసం) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రామలింగారెడ్డి సంస్మరణ సభలో మంత్రితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఎమ్యెల్యేగా కాకుండా తన కుటుంబ సభ్యుడిలా రామలింగారెడ్డితో తనకు రెండు దశాబ్దాల అనుబంధం, ఆత్మీయత ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి పోషించిన పాత్ర ఆమోఘమైందని, ఉద్యమ సందర్భంలో ఆయన మీద నమోదైనన్ని కేసులు ఏ నాయకుడిపై కాలేదన్నారు. మూడు దశాబ్దాల క్రితమే ప్రజా ఉద్యమకారుడి రూపంలో ఆయన కేసీఆర్ ను ఆకర్షించారన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో త్వరలో రామలింగారెడ్డి సంస్మరణ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మెదక్ పార్లమెంటు సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముక్కుసూటితనం, నిజాయితీ, నిరాడంబరత తదితర గుణాలు రామలింగారెడ్డిని ఉత్తమ ప్రజాప్రతినిధిగా నిలబెట్టాయన్నారు. శాసన మండలి సభ్యులు ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ, గత 35 ఏండ్లుగా రామలింగారెడ్డితో అత్యంత సంబంధాలు కలిగివున్న తనకు ఆయన ఆదర్శ భావాలు నూరిపోసారన్నారు.
Ramalingareddy's life is an inspiration to the society Minister Harish Rao
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ, తన చేతుల మీదుగా ఆదర్శ వివాహం జరిపించిన రామలింగారెడ్డికి తన చేతుల మీదుగానే చావు చేయాల్సి రావడం జీవితంలో మిగిలిపోయిన విషాదమని చెబుకుంటూ కన్నీటిపర్యంత మయ్యారు. రామలింగారెడ్డి ఆదర్శ జీవితాన్ని రికార్డు చేసి నేటి తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రముఖ కవి, రచయిత, గాయకులు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, రామలింగారెడ్డి ఒక వ్యక్తి కాదని, ఓ వ్యవస్థ అని అభివర్ణించారు. అసలైన ప్రజా జర్నలిజం ఎలా ఉండాలో ఉత్తమ జర్నలిస్టుగా సమాజానికి చాటిచెప్పిన ఘనత రామలింగా రెడ్డికే దక్కుతుందన్నారు. రామలింగారెడ్డి, విరాహత్ ల దేహాలు వేరైనా ఆత్మ ఒకటేనన్న చనువుతో దశాబ్దాల పాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం వాళ్లిద్దరు నిద్దరహారాలు మాని కలిసి పోరాటాలు చేసిన తీరు చారిత్రాత్మక మైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చూపిన సాహసం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ బేవరేజెస్ సంస్థ మాజీ చైర్మన్ జి.దేవీప్రసాద్ మాట్లాడుతూ, రామలింగారెడ్డి వ్యక్తిత్వం భిన్నమైందని, ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎలాంటి సాహసానికైనా, త్యాగానికైనా వెనుకాడని ఆదర్శ ఉద్యమకారుడని ఆయన ప్రశంసించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పలు సందర్భాల్లో మెతుకుసీమ జర్నలిస్టుల సంఘం నాయకుడిగా తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడిన సాహసవంతుడన్నారు.
టీయూడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, రామలింగారెడ్డి తో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని, చరిత్రాత్మక పోరాటాల ఘట్టాలను గుర్తుచేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ వి.ప్రతాప్ రెడ్డి, మంజీరా రచయితల సంఘం అధ్యక్షులు కె.రంగాచారి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి, ప్రెస్ క్లబ్ కన్వీనర్ పి.ఎల్లారెడ్డి, టి.ఆర్.ఎస్.వి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర సభ్యుడు దేవి రవీందర్, టీయూడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రాజిరెడ్డి తదితరులు ప్రసంగించగా, గజ్వేల్ డెవెలప్మెంట్ అథారిటీ(గడా) ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్ ఏఎంసీ ఛైర్మెన్ మాదాసు అన్నపూర్ణ, ఎంపిపి అధ్యక్షురాలు దాసరి అమరావతి, జెడ్పిటిసి సభ్యుడు వంగ మల్లేశం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply