Take a fresh look at your lifestyle.

సన్మార్గం వైపు తిప్పే మాసం రంజాన్‌

భారత్‌లో రంజాన్‌ ఉపవాసాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి నెలవంక దర్శనమివ్వకపోవడంతో బుధవారం నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని బెంగళూరులోని మర్కజి రౌత్‌ ఎ ‌హిలాల్‌ ‌కమిటీ ప్రకటించింది. ఢిల్లీ, భోపాల్‌, ‌ముంబై, గుజరాత్‌, అలహాబాద్‌ ‌ప్రాంతాల్లో సోమవారం రాత్రి నెలవంక కనిపించకపోయినా బుధవారం నుంచి రోజాలు ప్రారంభిస్తామని ఉలేమాలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే మాసం రంజాన్‌. ‌పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరి హృదయాలలో పవిత్రతని, అంతకుమించిన ఆధ్యాత్మిక భావనని నింపే మాసంఇదే అని చెప్పవచ్చు .మానవాళికి ముక్తిమార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైన ‘’ఖురాన్‌’’ ‌గ్రంథం అవతరించిన మాసమిది. ముస్లిం సోదరులు ఈ మాసమంతా ఉపవాస దీక్షను పాటించి మాస చివరన అత్యంత పవిత్రంగా ‘‘రంజాన్‌’’ ‌పండుగను జరుపుకుంటారు.

ఖురాన్‌ ‌ప్రకారం రంజాన్‌ ‌నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ఉపవాసవ్రతం. రంజాన్‌ ‌మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా ఉపవాస దీక్షలను పాటిస్తారు. ఆహార పానీయాలను మానివేయడంతో పాటు నిష్ట నియమాలతో కూడుకున్న జీవితం గడుపుతారు. తెల్లవారుజామున మాత్రమే ఆహారం తీసుకుని రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత దీక్షను విరమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని ‘‘సహర్‌’’ అని, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ‘‘ఇఫ్తార్‌’’ అని అంటారు. ప్రతి వ్యక్తి సన్మార్గంలో నడుస్తూ పరిశుద్ధమైన జీవనం కొనసాగించాలన్నదే ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశమని గ్రంథాలు చెబుతాయి. ఇస్లాం మతాన్ని ఆచరించే ప్రతి వ్యక్తి కామం, క్రోధం, అహంకారం, అహింసా వంటి దుర్గుణాలకు దూరంగా ఉండి భగవంతుడి నామ స్మరణంతో శాంతి, సహనం వంటి సద్గుణాలతో కూడిన జీవితం సాగించాలని మత గ్రంధాల్లో చెప్పబడింది. ఇలాంటి పవిత్రమైన జీవనాన్ని కొనసాగించాలంటే భగవంతుడిపై విశ్వాసం కల్గి ఉంటూ ప్రతి రోజూ నమాజ్‌ ‌చేయవలసి ఉందని చెప్పబడింది. నిరంతరం అధ్యాత్మిక జీవనం కొనసాగించాగించేందుకు తగిన ప్రేరణ అవసరమని కాబట్టి మనలో ఆధ్యాత్మిక చింతన రగిల్చేందుకు ఏడాదికి ఒక సారి రంజాన్‌ ‌నెలలో కఠిన నింబంధనలతో కూడిన ఉపవాసదీక్షను పాటించడం జరుగుతుంది. రంజాన్‌ ‌మాసంలో ఉపవాసాలతోపాటు దానధర్మాలు చేస్తారు. దేశవ్యాప్తంగా అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తారు. తరావి నమాజ్‌లతో రాత్రి వేళ మసీదులు కళకళలాడుతాయి.

ఉపవాసదీక్ష ( రోజా ) ముఖ్య ఉద్దేశం….
ఉపవాసదీక్ష అంటే కేవలం ఘన, ద్రవ పదార్ధాలకు దూరంగా ఉంటమే కాదు.మన జ్ఞానేంద్రియాలను నియంత్రణలో ఉంచడమని మత పెద్దలు చెబుతున్నారు. దీక్షలో ఉన్నప్పుడు నోటితో అబద్దాలాడరాదు. చెవులద్వారా చెడు వినరాదు, కళ్లతో అశ్లీలం వంటిని చూడరాదు.మనం చేసే ప్రతి చర్య సన్మార్గంలో ఉండే విధంగా చూడటమని మత గ్రంథాల్లో చెప్పబడింది.నెల రోజుల పాటు ఇలాంటి కఠోర నియమం పాటించుట వలన ఏడాదిలో మిగిలిన 11 నెలలు పవిత్రమైన జీవనాన్ని కొనసాగించేందుకు ప్రేరణ కల్గుతుందని, తద్వారా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించేందుకు మార్గం సుగమం అవుతుందని ఇస్లాం మతం చెబుతోంది. వయసు మళ్లినవారు, అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేవారు, అత్యవసర ప్రయాణాలు సాగించేవారు మాత్రం ఉపవాసాలకు దూరంగా ఉంటారు.

రంజాన్‌ ఉపవాస దీక్ష -సామాజిక సేవకు ప్రేరణ, రంజాన్‌ ‌నెలలో సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఘన, ద్రవ పదార్ధాలు తీసుకోకుండా ఉంటారు. దీని వలన స్వయంగా ఆకలి బాధ మనకు తెలుస్తుంది. ఆకలితో అలమటించే పేదవాడి బాధను మనం స్వయంగా అనుభవించడం వలన పేదవాడికి సాయం చేయాలన్న సేవా దృక్పదం మనకు అలవడుతుందని మత పెద్దలు అభిప్రాయపడుతున్నారు. దీంతో మనం సంపాదించే సంపాదనలో కొంత వరకు జకాత్‌ (ఇస్లాంలోని నాల్గవ ప్రాథమిక సూత్రం) రూపంలో సమాజసేవకు ఖర్చు పెట్టగల్లుతామని గ్రంథాలు చెబుతాయి.

ఇలా ధనిక, బీద, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ముస్లిం సోదరుడు నెల రోజుల పాటు కఠోర నిబంధనలతో కూడిన ఉపవాస దీక్షలో పాల్గొని, తన సంపాదనలో కొంత భాగం పేదవారికి దానం చేయడం, పవిత్రమైన దివ్య ఖురాన్‌ ‌ను పఠించడం, రాత్రి వేళల్లో ప్రత్యేక నమాజ్‌ ( ‌తరావి ) ను ఆచరించడం చేస్తూ తనతో పాటు మొత్తం ప్రపంచాన్ని సమస్యల వలయం నుంచి తప్పించమని వేడుకోవడం జరుగుతుంది రంజాన్‌ ‌మాసం లో.

md khaza
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply