తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పినట్టు ప్రకటించారు. భగవంతుని ఆదేశంపైనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించినప్పటికీ, హైదరాబాద్‌లో ఫిలిం షూటింగ్ సందర్భంగా అస్వస్థులై హాస్పిటల్లో చికిత్స పొందిన రజనీకాంత్ శారీరకంగా బాగా బలహీనంగా ఉన్నట్టు చానల్స్ ప్రసారాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమైనది. ప్రశ్నించడానికి మనం ఎవరం. రాజకీయాల్లోకి రావాలని ఉన్నా, శారీరకంగా అనుకూలత లేనప్పుడు విరమించుకోవడం మంచిది. ఆయనే అన్నట్టు కొత్త రాజకీయపార్టీని స్థాపించడానికి శారీరక శ్రమను లెక్క చేయకుండా రాష్ట్ర మంతటా పర్యటించాలి. కోవిడ్ -19 తగ్గినట్టే తగ్గి కొత్త వైరస్ రూపంలో మళ్ళీ విజృంభిస్తోంది. కోవిడ్ ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పరిస్థితి మరింత ముదిరితే లాక్ డౌన్ నాటి ఆంక్షలను విధించే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో సొంత ఆరోగ్యంపై రిస్క్ తీసుకుని రజనీకాంత్ కొత్తపార్టీని పెట్టడం వాంఛనీయం కాదు. మిత్రులు, సన్నిహితులు ప్రోత్సహించినా కుటుంబ సభ్యులు మాత్రం వద్దని వారిస్తున్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే. ముఖ్యంగా, ఆయన కుమార్తెలు వద్దని చెప్పిన తర్వాత ఒత్తిడి చేయడం సమంజసం కాదు. తమిళనాట సినీ నటీనటుల ఆరాధన ఎక్కువ.
వారికి గుడులుగోపురాలు కట్టిస్తారు. తమకున్న జనాదరణను వోట్ల రూపంలో మార్చుకోవడానికి వెనకటి తరం వారు రాజకీయాలలో ప్రవేశించారు. ఇప్పటి తరం వారు రాజకీయాల్లో ప్రవేశించినా నిలదొక్కుకునే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడం వల్ల వాటికి ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది. రజనీకాంత్‌ని రాజకీయాల్లో ప్రవేశించమని ప్రోత్సహించి ఆయన జనాకర్షణను తమ పార్టీకి వినియోగించుకోవాలని భారతీయ జనతాపార్టీ చాలా కాలంగా ఆకాంక్షిస్తోంది.ఆయన కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుపై మెత్తబడి రెండుమూడు సార్లు ఆయనతో చర్చలు జరిపి కొత్త పార్టీపై నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానంటూ ఊరించారు. తమిళ శాసనసభకు వచ్చే మేలో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి రాష్ట్రం అంతటా పర్యటించి కొత్తపార్టీకి అభ్యర్థులను ఎంపిక చేయడం, పార్టీ శాఖలను ఏర్పాటు చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. డబ్బు విషయం లోటు లేకపోయినా, శారీరకంగా శ్రమపడేందుకు పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు. ఈ సమయంలో కూడా ఆయనను బలవంతం పెట్టడం అమానుషమే అవుతుంది. రాజకీయాల్లో ప్రస్త్తుత ధోరణుల పట్ల తీవ్ర అసంతృప్తి చెంది ఉన్న రజనీకాంత్ వంటి నటులు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొద్ది మంది మాత్రమే సాహసం చేస్తున్నారు.
తమిళనాడు రాజకీయాలు పూర్తిగా ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల పునాదులపై నిర్మితమైనవి. అక్కడ జాతీయ పార్టీలకు స్థానం లేదు. ప్రధానమంత్రి మోడీ దేశమంతటా కాషాయ జెండా రెపరెపలాడాలన్న ఆకాంక్షతో పని చేస్తున్నారు. ఆయన ఆకాంక్షను అమలులో పెట్టే బాధ్యతను హోం మంత్రి అమిత్ షా తీసుకున్నారు. రజనీకాంత్‌ను మాత్రమే కాకుండా తెలుగులో సినీనటులను అమిత్ షా బాగా ప్రోత్సహిస్తున్నారు. వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే చేరడంలో తప్పులేదు. కానీ, నిబద్ధత గల వ్యక్తులు రాజకీయాలను సొంత ప్రయోజనాలకు వాడుకోరు. రజనీకాంత్ మొదటి నుంచి నిబద్ధత గల వ్యక్తిగా పేరొందారు. ఆయన పుట్టింది తమిళనాడులో కాకపోయినా, తమిళనాడు కోసం సర్వశక్తులను ధారపోసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. రాజకీయాల ద్వారా కాకుండా, విడిగా ఆయన ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఉంది. అదే మాట ఆయన ప్రకటించారు. కొత్త పార్టీ పెట్టకపోయినా, తన శక్తుయుక్తులను ప్రజాసేవకు వినియోగిస్తానని ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ప్రజల్లోంచి మొహమాటాలు ఉంటాయి. అనుకూల, ప్రతికూల వాతావరణాలు ఉంటాయి. రాజకీయాల్లో చేరకుండా ఉంటే అందరూ మనవాళ్ళే అన్న సూత్రం వర్తిస్తుంది. తమిళనాడులో ద్రవిడ రాజకీయాల తీరు చూస్తే రజనీకాంత్ వాటిల్లో ఇమడలేరన్న అభిప్రాయం జనానికి ముందే కలిగింది. రజనీకాంత్ ప్రాంతీయ, కుల,మత, వర్గ ధోరణులకు వ్యతిరేకి. ఆయన పోషించిన పాత్రల స్వభావాన్ని బట్టి ఆయన లౌకిక వాది. అదే సందర్భంలో వ్యక్తిగతంగా రాఘవేంద్రస్వామి భక్తునిగా ఆయన మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
అది పూర్తిగా వ్యక్తిగతమని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. రాజకీయాలు సంపాదన మార్గంగా తయారైన ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్ వంటి ఆదర్శాలు గలవారు నెగ్గుకు రాలేరు. తమిళనాడులో అన్నా డిఎంకె అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో బీజేపీ ఆ పార్టీని గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉంది. అన్నా డిఎంకె నాయకురాలు జయలలిత బీజేపీకి అంత దగ్గరగా ఏనాడూ మసల లేదు. ఆమె సమయాన్ని బట్టి విధేయతలు మారుస్తూ వొచ్చారు. ఆమె మాత్రమే కాదు. ప్రాంతీయ పార్టీల నాయకులంతా అంతే. అలాంటి రాజకీయ వాతావరణంలో రజనీకాంత్ నిలదొక్కుకోలేరన్న అభిప్రాయం మొదటి నుంచి వ్యక్తం అవుతోంది. జయలలిత ఇష్టసఖి శశికళ వచ్చే నెలలో జైలు నుంచి విడుదలైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారవొచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో రజనీకాంత్‌ను కేంద్రంలో పెద్దలు ప్రోత్సహించడం వల్లనే కొత్తపార్టీ ప్రకటన చేశారన్న వార్తలు వొచ్చాయి. ఏమైనా కేంద్రంలో పెద్దలతో తనకు గల సంబంధాలు కొనసాగించుకోవడం కోసం ఆయన కొత్త పార్టీ పెట్టనవసరం లేదు. ఆరోగ్యాన్ని పాడు చేసుకోనవసరం లేదు. ఆయన ప్రకటనతోనే రాజకీయ త్రాసు మొగ్గు మారుతూ ఉంటుంది.కనుక ఆయన స్వీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం.