బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
నారద మహర్షి ధర్మరాజుతో తాను దేవలోకంలో పాండురాజును కల్సుకున్నట్లుగా చెప్పాడు. పాండురాజు తనను రాజసూయ యాగం గావించి పేరు ప్రఖ్యాతలు గావించాలని చెప్పి ఆయన కోరిన విధంగానే యాగం చేయడం మీ విధి అని బోధించాడు. ధర్మరాజాదులు నారదునికి ఘనసత్కారాలు చేసి సాగనంపారు. ధర్మరాజు తదనంతరం, రాజసూయయాగం చేయాలని నిర్ణయించకున్నాడు. తన సోదరులు, మంత్రులూ, విరాట, ద్రుపదులు అందరితో సమావేశమయ్యాడు. రాజసూయ యాగం చేయాలంటే వాసుదేవుని సహాయం అవసరమని వారందరూ ఆమోదించగా, శ్రీకృష్ణపరమాత్మకు దూత ద్వారా సందేశం పంపాడు. శ్రీకృష్ణుడు వచ్చాడు. యధోచితంగా మర్యాదలు జరిపి కుశలాలు అడిగి తెల్సుకుని అసలు విషయం చెప్పాడు ధర్మరాజు.
శ్రీకృష్ణుడు ఆనందంగా వారి సంకల్పం బాగుందని అన్నాడు. అయితే రాజసూయ యాగంలో వారు ఎదుర్కునే సమస్యలను ముందుగానే చెప్పాడు. కంసుని మామ జరాసంధుడు కంసుని కృష్ణుడు సంహరించిన కారణంగా తనపై కత్తి కట్టాడని చెప్పాడు. జరాసంధుని సంహరించ గలిగినవాడు భీముడే అన్నాడు. మిగిలిన ప్రాంతాలకు నకుల సహదేవులు సరైన వారని చెప్పాడు. ఈ సందర్భంగా మాంధాతనూ, భగీరధునీ కార్తవీరార్జునేనీ, భరతునీ, మరుత్తునూ గుర్తుచేశాడు. వారందరిలో ఉన్న ప్రత్యేక లక్షణాలన్నీ ధర్మరాజులో వున్నాయి కావున సామ్రాజ్యసంస్థానభారం వహించడానికి అర్హుడన్నాడు. అత్యాచారాలు చేసే జరాసంధుని తొలగించాలన్నాడు.
ధర్మరాజు జరాసంధుని వివరాలడిగాడు. శ్రీకృష్ణుడిలాచెప్పాడు. బృహద్రదుడనే మహావీరుడు మగధ రాజ్యాన్ని పాలించేవాడు. దేవేంద్రుని లాగా వెలిగిపోగలిగేలా యజ్ఞయాగాదులు నిర్వహించాడు. కాశీరాజు కుమార్తెలిద్దరిని భార్యలుగా స్వీకరించాడు. ఆయనకు పిల్లలు కలుగలేదు. చండకౌశికుని వద్దకు భార్య సమేతంగా వెళ్ళి సంతానం లేని లోటుగురించి చెప్పాడు. చండకౌశికుడు వారికి ఒక పండు నిచ్చాడు. ఆ పండుని ఆయన భార్యలిద్దరూ అరగించారు. ఫలితంగా వారివురూ రెండు ఖండాలుగా బిడ్డను కన్నారు.