Take a fresh look at your lifestyle.

‘‌వానాకాలం’ హామీలు

మళ్ళీ వర్షాకాలం రానే వొచ్చింది. ఈసారి రాష్ట్రమంతటా విపరీతమైన వర్షాలుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మంగళ-బుధవారాల మధ్య రాత్రి అనుకోనంతగా విపరీతమైన వర్షం కురిసింది. దీని ప్రభావం ప్రధానంగా తెలంగాణ రైతాంగంపై పడింది. రైతులు పండించిన పంటను త్వరగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఆదేశాలు జారీచేస్తున్నా యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో రైతుల పంటలు వర్షం పాలైనాయి. తమ కండ్ల ముందే నీళ్ళలో తేలాడుతున్న పంటలను చూసి రైతులు కన్నీరు, మున్నీరవుతున్నారు. వర్ష ప్రభావానికి గురికాకుండా ముందస్తుగానే ధాన్యాన్ని కొనుగోలు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం.

లారీలు లేవనో, బారదాన్లు లేవన్న వంకతోనో మొదటిసారిగా పంట కోసి కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనెల ఎనిమిదవ తేదీన పడిన తొలకరి నాటికి తమ ధాన్యాన్ని విక్రయించు కోగలిగిన రైతులు అప్పుడే దుక్కి దున్నడానికి సిద్ధమవుతుంటే, ఇంకా కొనుగోలు కేంద్రాల వద్ద నీరిక్షిస్తున్న రైతుల పరిస్థితి మాత్రం కడు దీనంగా తయారైంది. ఇదిలా ఉంటే వరుసగా నాలుగు రోజుల పాటు రాష్ట్రమంతటా విపరీతంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పన్నెండు, పదమూడు తేదీల్లో అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆ రెండు రోజులను రెడ్‌ అలర్ట్ ‌తేదీలుగా ప్రకటించారు కూడా. ఈ రోజుల్లో విపరీతమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు జలమయమమ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

గత సంవత్సం పడిన వార్షాలకు తెలంగాణ అంతా అతలాకుతలమైయింది. గడచిన అరవై డెబ్బై ఏళ్ళలో ఏనాడు పడనంత భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెలియంది కాదు. భారీ వర్షాలకు తట్టుకోగల వ్యవస్థను గత ప్రభుత్వాలు రూపొందించలేకపోయాయి. తెలంగాణ ఏర్పడిన ఈ ఆరేడు ఏండ్లలో కూడా అదే భయం, అదే బీభత్సం ఇంకా కొనసాగుతున్నది. ఏ కొద్ది వర్షం పడినా నేటికీ రాష్ట్ర రాజధాని మొదలు, ఇతర జిల్లాల్లో కూడా రోడ్లన్నీ జలమయమై, రవాణా స్తంభించిపోయే పరిస్థితి ఉంది. గత ఏడాది పడిన వర్షాలకు రాష్ట్రమంతటా భారీ నష్టం జరిగిన విషయం తెలియంది కాదు. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలోని పలు కాలనీలు రోజుల తరబడి వర్షపు నీటిలో మునిగి పోగా, పలు అపార్టుమెంటుల్లో నీరు చేరి లోపలివారు బయటికి రాలేక, బయటి వారు లోనికి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు మూడేసిరోజులు తినడానికి కూడా నోచుకోలేని స్థితి. వారం రోజుల పాటు కరెంటు కూడా లేకుండా గడిపిన సంఘటనలున్నాయి. కోట్లాది రూపాయల ఆస్థినష్టంతో పాటు, ప్రాణనష్టం కూడా జరిగింది. వొచ్చే మూడు నాలుగు రోజుల్లో అలాంటి తీవ్రత ఎదురవుతుందని ముందస్తుగానే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చెట్లు, విద్యుత్‌ ‌స్తంభాలు విరిగిపడకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.

మంగళ, బుధవారాల మధ్య రాత్రి కురిసిన వర్షాలకే వరంగల్‌ ‌జిల్లా అంతా జలమయమైంది. కొద్దిసేపు పడిన వర్షానికే జిల్లా బీభత్సంగా మారింది. ప్రధానంగా వరంగల్‌ ‌నగరంలో ఈ కాస్త వర్షానికే రోడ్లన్నీ జలమయమై కనిపించాయి. గత వర్షాకాలం పడిన వర్షాల బీభత్సాన్ని పరిశీలించేందుకు స్వయంగా హెలికాఫ్టర్‌లో వరంగల్‌ ‌వొచ్చిన రాష్ట్ర మునిసిపల్‌ ‌శాఖ మంత్రి కెటిఆర్‌ అనేక హామీలను గుమ్మరించారు. కాలువలు పొంగి రోడ్లన్నీ జలమయమవడానికి ప్రధాన కారణం నాలా)పైన ఉన్న కట్టడాలేనంటూ, వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. కాని, ఆ పనులు తూతూ మంత్రంగానే సాగాయి. ఆనాటి వొత్తిడికి అధికారులు కొన్ని భవనాలపై మాత్రమే తమ ప్రభావాన్ని చూపించి, ఆ తర్వాత నిమ్మకుండిపోయారు. ఈ తొలగింపు విషయంలో రాజకీయ వొత్తిడులేవీ ఉండవన్నారు. కాని, భవనాల తొలగించే విషయంలో వారికివ్వాల్సిన పరిహారం విషయంలో పేచీ రావడంతో మళ్ళీ వర్షాకాలం వొచ్చేవరకు ఆ పనులు అలానే నిలిచిపోయాయి.

ఈలోగా కార్పొరేషన్‌ ఎన్నికలు రావడంతో తొలగింపుల ప్రభావం అధికార పార్టీ అభ్యర్థులపై పడుతుందేమోనని వాటి జోలికి వెళ్ళకపోవడంతో వరంగల్‌లో ఇప్పుడు యథాస్థితి కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కూడా అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు రెండు మీటర్లు, అంతకన్నా తక్కువ వెడల్పున్న నాలాలపై పైకప్పు ఏర్పాటు చేయాలని, సాధ్యం కాని పక్షంలో ఇరువైపుల ఇనుప కంచెలు నిర్మించాలని ఆదేశించారు. మ్యాన్‌హోల్స్‌ను మరమ్మతు చేయాలని సూచించారు. గత ఏడాది ఇద్దరు పిల్లలు ఈ మ్యాన్‌హోల్స్‌లో పడి ప్రాణాలు వొదిలిన సంగతి తెలిసిందే. కొద్దిపాటు వర్షానికే రాష్ట్రంలోని రోడ్లన్నీ జలమయమవుతుంటే, ఈసారి భారీ వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం చెబుతున్న పరిస్థితిలో ఈ కాలం ఎలా గడుస్తుందోనన్న దిగులు ప్రజల్లో ఉంది. ఏడాదిన్నర కాలంగా కొరోనాతో కుస్తీ పడుతున్న రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మరోసారి వరుణదేవుడితో తలపడాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply