Take a fresh look at your lifestyle.

ఉద్యమంలా వాననీటి సంరక్షణ

  • భూగర్భ జలాలను పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకం
  • విసిలు, రెడ్‌ ‌క్రాస్‌ ‌ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్‌లో గవర్నర్‌ ‌తమిళి సై

ముందు ముందు రానున్న నీటి సంక్షోభాలను నివారించాలంటే వాన నీటిని ఒడిసి పట్టుకోవడం, సంరక్షించుకోవడం ఒక ఉద్యమంలా చేపట్టాలని గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌పిలుపునిచ్చారు. నేషనల్‌ ‌వాటర్‌ ‌మిషన్‌ ‌చేపట్టిన ‘‘క్యాచ్‌ ‌ద రైన్‌’’ అనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గవర్నర్‌ ‌తెలంగాణ, పుదుచ్చేరిలలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ‌చాన్సలర్‌లతో, రెడ్‌ ‌క్రాస్‌ ‌ప్రతినిధులతో రాజ్‌ ‌భవన్‌ ‌నుండి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఒక వైపు వర్షాలు విస్తారంగా కురవడం, వాన నీరు వృథాగా పోవడం, మరోవైపు నీటి కొరత రావడం విచారకరమన్నారు. వర్షపు నీటిని సంరక్షించుకోవడం వలన తాగు, సాగునీటి కొరతలను అధిగమించవొచ్చని గవర్నర్‌ ‌తెలిపారు.

ప్రపంచ జనాభాలో 18 శాతం మంది ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారని, అలాగే ప్రపంచంలోని దాదాపు 20 శాతం పశు సంపద మనదేశంలోనే ఉందన్నారు. కానీ ప్రపంచంలోని మొత్తం నీటి వనరులలో కేవలం నాలుగు శాతం మాత్రమే భారతదేశంలో ఉన్నాయని అన్నారు. కొన్ని వేల సంవత్సరాల కిందట ఏర్పడిన భూగర్భ జలాలను మనం ఇప్పుడు విచ్చలవిడిగా వినియోగిస్తున్నామని, దీనివల్ల భూగర్భ జలాలు మరింతగా తగ్గుతున్నాయని అన్నారు. వర్షపు నీరు సరైన సంరక్షణ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకమని డాక్టర్‌ ‌తమిళిసై స్పష్టం చేశారు. దేశంలో 256 జిల్లాలు భూగర్భ జలాలను అధికంగా వినియోగించే, క్లిష్ట దశకు చేరుకున్నాయని వివరించారు. భారతదేశంలో తలసరి నీటి వినియోగం పెరుగుతున్నది..కానీ తలసరి నీటి లభ్యతలో భారతదేశం చాలా సవాళ్లను ఎదుర్కుంటున్నదని వివరించారు.

చెక్‌ ‌డ్యాములు కట్టడం, ఇంకుడు గుంతలు నిర్మించడం, రూఫ్‌ ‌టాప్‌ ‌వాన నీటి సంరక్షణ పద్ధతులు అవలంబించడం, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా చూడడం, పూడిక తీయడం, స్టోరేజ్‌ ‌కెపాసిటీ పెంచడం, ఫీడర్‌ ‌ఛానల్‌ ‌కాలువలలో అడ్డంకులు తొలగించడం వాన నీటి సంరక్షణలో అత్యంత కీలకమని గవర్నర్‌ ‌వివరించారు. తెలంగాణ, పుదుచ్చేరిలలోని అన్ని యూనివర్సిటీలను హరిత క్యాంపస్‌లుగా, అలాగే వర్షపు నీటి సంరక్షణ కేంద్రాలుగా మార్చాలని గవర్నర్‌ ‌వైస్‌ ‌చాన్సలర్‌లకు సూచించారు. ఇండియన్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ ప్రతినిధులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వాన నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి ఉద్యమ స్థాయిలో కృషి చేయాలని గవర్నర్‌ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెప్స్‌లో నేషనల్‌ ‌వాటర్‌ ‌మిషన్‌ ‌డైరెక్టర్‌ ‌జి. అశోక్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌ద్వారా జాతీయస్థాయిలో ‘‘క్యాచ్‌ ‌ద రైన్‌, ‌వెన్‌ ఇట్‌ ‌ఫాల్స్, ‌వేర్‌ ఇట్‌ ‌ఫాల్స్’’ అనే కార్యక్రమం ద్వారా జాతీయస్థాయిలో వాన నీటి సంరక్షణ పద్ధతులను పెంపొందించడానికి కృషి చెస్తున్నామని తెలిపారు. గవర్నర్‌ ‌సెక్రెటరీ కె. సురేంద్రమోహన్‌ ‌మాట్లాడుతూ రాజ్‌ ‌భవన్‌లో వాన నీటి సంరక్షణ పద్ధతులను, సోలార్‌ ‌పవర్‌ ‌జనరేషన్‌ ‌పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్‌ ‌ఛాన్సలర్‌లు తమతమ విశ్వవిద్యాలయాలలో చేపడుతున్న వాన నీటి సంరక్షణ పద్ధతులను వివరించారు. రాజ్‌ ‌భవన్‌ ఉన్నతాధికారులు, నేషనల్‌ ‌వాటర్‌ ‌మిషన్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply