Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌కు రాహుల్‌ ‌సారథ్యం…?

కాంగ్రెస్‌ ‌పార్టీకి పూర్తి స్థాయి జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతున్నది. రాహుల్‌ ‌గాంధీ ఆ పార్టీ పగ్గాలు చేపట్టడమన్నది మూడునాళ్ళ ముచ్చటగానే తయారయింది. కాని మెజార్టీ కేంద్ర నాయకులు రాహుల్‌ ‌పట్లనే మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే. కాని అందుకు రాహుల్‌ ‌ముందుకు రాకపోవడంతో గత రెండేళ్ళుగా ఈ సమస్య ఇంకా అలా నలుగుతూనే ఉంది. తాజాగా ఇండియన్‌ ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌జాతీయ కార్యవర్గ సమావేశం రాహుల్‌కు పట్టంగట్టాలని తీర్మానించడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్రం లభించిన ఈ డెబ్బై నాలుగేళ్ళ కాలంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి గాంధీల నాయకత్వమే ఎక్కువకాలం సాగుతూ వొచ్చింది. దాదాపు 59 ఏళ్ళుగా నెహ్రూ కుటుంబ సభ్యులే పార్టీకి సారథ్యం వహిస్తూ వొచ్చారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో, అలాగే ప్రజల్లో కూడా ఆ కుటుంబం పట్ల విశ్వాసం, సానుభూతి ఉండడం కూడా అందుకు కారణమైంది. అయితే రాజీవ్‌గాంధీ హత్యానంతర పరిస్థితుల కారణంగా క్రమేణ ఆ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేకుండా పోయింది.

సోనియాగాంధీ కొంత నెట్టుకు రాగలిగినా క్రమేణ ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వొచ్చింది. ఆ క్రమంలోనే రాహూల్‌ ‌గాంధీని యాక్టివ్‌ ‌పాలిటిక్స్‌లోకి తీసుకు వొచ్చినా పెద్దగా ఒరిగింది మాత్రం ఏమీలేదు. 2007లో కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శిగా, 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన రాహుల్‌ను 2017లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పటికీ పార్టీ ఉన్నతిలోకి రాలేదు. ఒక విధంగా 2014 నుండి 2020 మధ్య కాలంలో సోనియా, రాహుల్‌ ‌నాయకత్వంలో పార్టీ క్రమేణ పరాభవాలనే మూటగట్టుకుంది. ముఖ్యంగా రాహుల్‌ ఈ ‌పదవిలో కొనసాగిన రెండేళ్ళ కాలంలో ఆయనకు ప్రతికూల వాతావరణమే ఏర్పడింది. రెండు సార్లు పార్లమెంటు ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు, వివిధ రాష్ట్రాలను చేయిజార్చుకోవడంతో విసిగిపోయిన రాహుల్‌ 2019‌లో తన పదవికి రాజీనామా చేశాడు. ఆ క్రమంలోనే ఆయన నెహ్రూ, గాంధీ కుటుంబాలవారిని కాకుండా కొత్తవారిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాలని తన రాజీనామ పత్రంలోనే పేర్కొనడం గమనార్హం. అయినా పార్టీ వర్గాల్లో అధిక శాతం మంది ఇంకా రాహుల్‌ ‌గాంధీనే అందుకు తగిన వ్యక్తిగా అభిప్రాయపడుతున్నారు.

ఈ మధ్యకాలంలో ఆ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కమలనాథ్‌లాంటి వారి పేర్లు వొచ్చినా రాహుల్‌ ‌వైపే మొగ్గు చూపడంతో ఆ పదవికి మరే పేరు లేకుండా పోయింది. ఇప్పటికే యువనాయత్వం పార్టీకి దూరమవుతున్నారు. రాహుల్‌కు అత్యంత సన్నిహితుడైన జ్యోతిరాదిత్య సింధియా లాంటి వారు పార్టీ వీడిన విషయం తెలిసిందే. అయినా ఇంకా యువకులను కాపాడుకునే విషయంలో ఆ పార్టీ పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో చాలా మంది నిరాశకు లోనయ్చారు.

Rahul Gandhi to lead Congress

ఈ విషయంలో అనేక చర్చలు జరుగుతుండగా ప్రియాంక గాంధీ వాద్రా పేరు కూడా బహుళ ప్రచారంలోకి వొచ్చింది. రాహుల్‌ ‌తర్వాత దేశ రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్న ప్రియాంకకు ఆ పదవి అప్పగించాలన్న వాదన కూడా బయలు దేరింది. సోనియా గాంధీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఎక్కువకాలం ఆమె ఆ పదవీ బాధ్యతలను నిర్వహించడం సాధ్యం కాదని, అందుకు కనీసం నెహ్రూ కుటుంబానికి చెందిన ప్రియాంకకైనా ఆ పదవిని అప్పగించాలని నాయకులనేకులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. అయితే రాహుల్‌ ‌వైపే ఎక్కువ మంది చూస్తుండడంతో ఎటూ తేలకుండా పోయింది.

ఈ క్రమంలో సోనియాగాంధీనే మరింత కాలం తాత్కాలిక అధ్ద్యక్షురాలిగా కొనసాగించాలని కోరుతున్నారు. ఆగస్టులో జరిగిన ఆ పార్టీ వర్కింగ్‌ ‌కమిటి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ మేరకు సీనియర్లు అంతా కలిసి సోనియాకు లేఖలు రాయడం కూడా ఇప్పుడు ఆ పార్టీలో ప్రధాన చర్చగా మారింది. వీర అభిమాన కార్యకర్త ఒకరు తన రక్తంతో రాహుల్‌కు అధ్యక్ష పదవిని అప్పగించాలంటూ సోనియాకు లేఖ రాయడం కూడా వైరల్‌ అయింది. స్వాతంత్య్ర పోరాటం నుండి దేశ రాజకీయాల్లో ప్రధాన భూమికను పోషించిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పుడు గడ్డు కాలాన్ని చవిచూస్తున్నది. బిజెపి లాంటి బలమైన రాజకీయ పార్టీని ఎదుర్కునే సత్తా ఉన్న నాయకత్వం ఇప్పుడు ఆ పార్టీకి అవసరం. మొదటి నుండి యువనేతలకు సరైన ఆదరణ లేకపోవడం వల్ల కూడా పార్టీ పటిష్టతకు విఘాతం కలిగిందన్న అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో తిరిగి రాహుల్‌ ‌లాంటి వారికి సారథ్యం అప్పగించినా, రాహుల్‌ ఆలోచనల మేరకు యువతకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడే పార్టీ మళ్ళీ పట్టాలమీదకు ఎక్కుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply