Take a fresh look at your lifestyle.

నిరుద్యోగుల వెతలు ప్రభుత్వానికి పట్టదా?

  • ఆర్‌. ‌కృష్ణయ్య, ప్రొఫెసర్‌  ‌కోదండరామ్‌, ‌నిరుద్యోగ జేఏసీ విమర్శ
గ్రూప్‌-1, ‌గ్రూప్‌-2 ‌సర్వీస్‌ ఉద్యోగాల భర్తీపై వెంటనే నోటిఫికేషన్‌ ‌జారీ చేయాలని  రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ, ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ ‌చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. ‌కృష్ణయ్య, టీజేఎస్‌ అధ్యక్షుడు  ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌తదితరులు ఈ విషయమై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.  సోమవారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ సమావేశం జేఏసీ చైర్మన్‌ ‌నీల వెంకటేష్‌, ‌బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఆర్‌. ‌కృష్ణయ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా గ్రూప్‌-1  ‌నోటిఫికేషన్‌ ‌జారి చేయలేదన్నారు. దాదాపు ఆరు లక్షల మంది ఈ నోటిఫికేషన్‌ ‌కోసం నిరీక్షిస్తూ ఏళ్ల తరబడి ప్రిపేర్‌ అవుతున్నారన్నారు. గ్రూప్‌-1 ‌నోటిఫికేషన్‌ ‌వేస్తామని ప్రకటించి జోనల్‌ ‌సమస్య పేరు మీద 5 సంవత్సరాలు దాటవేశారన్నారు.18 శాఖల కింద 1250 పోస్టులు భర్తీ చేయాలన్నారు. అడ్డదారిన టెంపరరి ప్రమోషన్లు ఇచ్చి వారినే కొనసాగిస్తు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారన్నారు. గ్రూప్‌-2 ‌సర్వీస్‌ ‌కింద 14 ప్రభుత్వ శాఖల మూడు వేలకు పైగా ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్‌ ‌జారీ చేయాలన్నారు. రాష్ట్రంలో 2 లక్షల 30 వేల ఖాళీలు ఉంటే గత 6 సంవత్సరాల కాలంలో కేవలం 25 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసారని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో సిబ్బంది లేక ఖాళీ కుర్చిలతో వెలవెలబోతున్నాయన్నారు.
రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగులు పీజీ-డిగ్రీ, ఇంజనీరింగ్‌, ‌ఫార్మసీ తదితర కాలేజీ కోర్సులు చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు నిరాశ-నిస్పృహలతో రోజు కొక్కరు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఏ. ‌కోదండరామ్‌ ‌మాట్లాడుతూ సెలెక్ట్ అయిన 4200 మంది బెటాలియన్‌ ‌కానిస్టేబుల్‌ అభ్యర్థులను వెంటనే ట్రైనింగ్‌ ‌కు పంపించి పోస్టింగ్‌ ‌లు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. కానిస్టేబుల్‌ అభ్యర్థ్నుల విధల్లో చేరేంతవరకూ సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. నార్మలైజేషన్‌ ‌పద్ధతిలో కానిస్టేబుల్‌ అభ్యర్థులు నష్టపోతారని తక్షణమే నార్మలైజేషన్‌ ‌పద్ధతిని ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సి. రాజేందర్‌, అల్లంపల్లి రామ్‌ ‌కోటి, దాసు సురేష్‌, ‌వేముల రామకృష్ణ, ఆర్‌. ‌చంద్రశేఖర్‌ ‌గౌడ్‌, ‌నిరుద్యోగ జేఏసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్వర్‌, ‌జీ. కారుణ్య, బీజేపీ యువ మోర్చా నేత భరత్‌ ‌గౌడ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.