Take a fresh look at your lifestyle.

జాతి స్వేచ్ఛకు ఉద్యమ రూపం ‘‘క్విట్‌ ఇం‌డియా’’

“భారత స్వాతంత్య్ర కోసం సాగిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమం సజావుగా సాగలేదు. సైద్ధాంతిక వైరుధ్యాల నడుమ గాంధీ చేపట్టిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమం కూడా సరైన మద్దతు లేక విఫలమైనది. అయితే బ్రిటీషు వారి పాలనలో శాశ్వత బానిసత్వం అనుభవించడం కంటే పోరాడి చావడమే మేలనే ‘‘డూ ఆర్‌ ‌డై’’ నినాదం ప్రజల మస్తిష్కాలకు చేరింది. క్విట్‌ ఇం‌డియా ఉద్యమం వైఫల్యం చెందినప్పటికీ ఆ ఉద్యమ స్ఫూర్తి తో అనేక ఉద్యమాలు బయలు దేరి, అంతిమంగా భారత స్వాతంత్య్రానికి బాటలు వేసింది. అందుకే క్విట్‌ ఇం‌డియా ఉద్యమానికి చరిత్రలో ఒక ప్రముఖ స్థానం ఏర్పడింది. లక్ష్యసాధనలో మన ప్రయత్నాలు ఒక్కోసారి విఫలమైనా, పరాజయం నుండే విజయాలు ప్రాప్తిస్తాయన్న సందేశం క్విట్‌ ఇం‌డియా ఉద్యమం మనకందించింది.”

నేడు ‘‘క్విట్‌ ఇం‌డియా ఉద్యమ దినోత్సవం

బ్రిటీష్‌ ‌వారి తుపాకీ గుళ్ళకు బెదరకుండా, వారి గుండెలదిరేలా సాగిన క్విట్‌ ఇం‌డియా మహోద్యమం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర లో ఒక చెరగని ముద్ర వేసింది. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు,ప్రజలు స్వాతంత్య్ర కాంక్షతో స్వచ్ఛందంగా ఈ ఉద్యమం లో పాల్గొన్నారు.మహాత్మాగాంధీ రూపకల్పన లో సాగిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమం తెల్లదొరల అహాన్ని అణచింది. కీలెరిగి వాత పెట్టమన్న చందంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఈ ఉద్యమం తెల్లదొరలను భయకంపితులను చేసింది. ఆగష్టు ఉద్యమంగా వర్ణింపబడే క్విట్‌ ఇం‌డియా ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకుని, దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్ఫురణకు తెచ్చుకునే సదుద్దేశ్యంతో ప్రతీ సంవత్సరం ఆగస్టు 8 వ తేదీని ‘‘క్విట్‌ ఇం‌డియా ఉద్యమ దినోత్సవం’’ గా జరుపుకోవడం పరిపాటి.

క్విట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని అణచి వేసే క్రమంలో మహాత్మాగాంధీ తో సహా పలువురు ప్రము ఖులను, లక్షలాది మంది ప్రజలను ఎలాంటి విచారణ లేకుండా సుధీర్ఘ కాలం నిర్భంధంలో ఉంచారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన భూమిక వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్‌ ‌ను చట్ట విరుద్దమైన సంస్థ గా బ్రిటీషు ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖులందరినీ జైళ్లలో నిర్భంధించినా, కుల,మతాలకతీతంగా ప్రజల్లో ఉవ్వెత్తున ఎగసిన స్వాతంత్య్ర కాంక్ష బ్రిటీషు వారికి ముచ్చెమటలు పట్టించింది.’’డూ ఆర్‌ ‌డై నినాదం’’ విస్తృత ప్రాచుర్యం పొందింది. కొన్ని సంస్థలు,పార్టీలు క్విట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని వ్యతిరేకించాయి.

జాత్యహంకార దేశాలతో రెండవ ప్రపంచ యుద్ధం లో పోరాడుతున్న బ్రిటీషువారికి ఆ సమయంలో షరతులు విధించి,వారి అసహాయ స్థితినుంచి స్వాతంత్య్రం సంపాదించాలనే దుగ్ధ తమకు లేదని గాంధీ ప్రకటించడంతో చాలా మంది గాంధీతో విబేధించి,సుభాష్‌ ‌చంద్రబోస్‌ అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌భావజాలం,సాయుధ పోరాటం పట్ల ఉత్తేజితులైనారు. అనేక కారణాల వల్ల క్విట్‌ ఇం‌డియా ఉద్యమం నీరుగారి పోయింది. బ్రిటీషువారు సామదాన దండోపాయాలతో ఉద్యమాన్ని అణచి వేసారు. అయితే’’ ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌’’ ‌ద్వారా సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌తెల్లదొరలపై సమర శంఖం పూరించాడు. ‘‘కంటికి కన్ను- పంటికి పన్ను’’ అనే రీతిలో బ్రిటీషు దొరలకు ముచ్చెమటలు పట్టించాడు.

జర్మనీ, బ్రిటన్‌ ‌ల మధ్య సాగిన యుద్ధం వలన బ్రిటన్‌ ‌కు అనేక చికాకులు తలె త్తాయి. ఆర్ధికంగా దెబ్బతిన్నది. భారత్‌ ‌లో బ్రిటీషు వారి పట్ల పెరు గుతున్న తీవ్ర వ్యతిరేకతను అణచి వేయడం సాధ్యం కాదని, ఇక ఎంతో కాలం భారత దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోలేమనే స్ఫృహ కలగడంతో క్రిప్స్ ‌రాయబారంతో భారతీయులకు స్వాంతన చేకూర్చాలనే ప్రయత్నం కూడా విఫలమైనది.సర్‌ ‌స్టాఫోర్డ్ ‌క్రిప్స్ ‌బ్రిటన్‌ ‌ప్రధాని వినిస్టన్‌ ‌చర్చిల్‌ ‌మంత్రి వర్గంలో లేబర్‌ ‌పార్టీ కి చెందిన వ్యక్తి. అతను భారత స్వాతంత్య్రానికి మద్దతు దారుడైనప్పట్టికీ ‘‘క్రిప్స్ ‌మిషన్‌’’ ‌లో ఒక సభ్యుడుగా, చర్చిల్‌ ‌కాబినెట్లో మంత్రిగా ఉండడం వలన భారతదేశానికి పూర్తిగా అనుకూలించలేక పోవడంతో’’ క్రిప్స్ ‌రాయబారం’’ విఫలమయింది. క్రిప్స్ ‌రాయబారం విఫలమైనా, బ్రిటీషు వారి ద్వంద్వనీతి అవగతమైనా మనలోని అనైక్యత ఈ సదవకాశాన్ని నీరుగార్చింది.

భారత స్వాతంత్య్ర కోసం సాగిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమం సజావుగా సాగలేదు. సైద్ధాంతిక వైరుధ్యాల నడుమ గాంధీ చేపట్టిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమం కూడా సరైన మద్దతు లేక విఫలమైనది. అయితే బ్రిటీషు వారి పాలనలో శాశ్వత బానిసత్వం అనుభవించడం కంటే పోరాడి చావడమే మేలనే ‘‘డూ ఆర్‌ ‌డై’’ నినాదం ప్రజల మస్తిష్కాలకు చేరింది. క్విట్‌ ఇం‌డియా ఉద్యమం వైఫల్యం చెందినప్పటికీ ఆ ఉద్యమ స్ఫూర్తి తో అనేక ఉద్యమాలు బయలు దేరి, అంతిమంగా భారత స్వాతంత్య్రానికి బాటలు వేసింది. అందుకే క్విట్‌ ఇం‌డియా ఉద్యమానికి చరిత్రలో ఒక ప్రముఖ స్థానం ఏర్పడింది. లక్ష్యసాధనలో మన ప్రయత్నాలు ఒక్కోసారి విఫలమైనా, పరాజయం నుండే విజయాలు ప్రాప్తిస్తాయన్న సందేశం క్విట్‌ ఇం‌డియా ఉద్యమం మనకందించింది. క్విట్‌ ఇం‌డియా ఉద్యమం గురించి నేటి విద్యార్థులకు, యువతకు అవగాహన కలిగించాలి. చరిత్రాత్మక క్విట్‌ ఇం‌డియా ఉద్యమ స్ఫూర్తిని స్ఫురణకు తెచ్చేవిధంగా చరిత్రపుస్తకాల్లో ప్రాచుర్యం కల్పించాలి.

స్వార్ధమే పరమార్ధం గా భావించి, బ్రిటిషు వారి చెంత దాష్ఠీకం చేస్తూ, మన వారే మనకు వెన్నుపోటు పొడిచిన ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో జరిగిన ఆలస్యానికి మూలకారణం.సుదీర్ఘ నిరీక్షణానంతరం భారతదేశానికి స్వాతంత్య్రం లభించినా, అందుకోసం నాటి మన నాయకులు పడిన తపన, శ్రమ చరిత్ర పుటల్లోకి జారిపోయింది. నాటి సంగ్రామం అందించిన ప్రేరణ నేటి తరానికి కొరగాకుండా పోయి, నిస్తేజంగా,నిర్వీర్యం గా మారిపోయింది. నాటితరం నాయకుల త్యాగాలను గుర్తించలేని జనం ఇంకా కులాల కుమ్ము లాటలతో,మతాల మధ్య వైషమ్యాలతో అనైక్యతను ప్రదర్శిస్తూ,తెల్లదొరలు దేశంలో వదలి పెట్టిన అవశేషాలను,అవలక్షణాలను కాపాడుకుంటూ, నిరంతరం కోట్లాటలతో స్వార్ధంతో, అవినీతి తో కాలక్షేపం చేస్తూ,జాతీయ దృక్పథాన్ని అలవరచు కోలేకపోవడం దుర దృష్టకరం. నాటితరం నాయకుల త్యాగాలు,ఉద్యమాలను జ్ఞప్తియం దుంచుకుని, భరతజాతి ఐక్యతను చాటి చెప్పడమే క్విట్‌ ఇం‌డియా ఉద్యమ దినోత్సవ లక్ష్యం.గతం అనుభవాల సేద్యం. గతాన్ని విస్మరిస్తే భవిష్యత్తు సజావుగా నడవదు. గత తరాల స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి. అపజయం జయానికి నాంది అనే నానుడి క్విట్‌ ఇం‌డియా ఉద్యమం నిరూపించింది.
– సుంకవల్లి సత్తిరాజు, 9704903463

Leave a Reply