Take a fresh look at your lifestyle.

కరోనా టెస్టుల కోసం ఆస్పత్రులకు క్యూ

రోజుకు 7 వేల శాంపిళ్లు సేకరిస్తున్న అధికారులు
కరోనా వైరస్‌ ‌వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో… ఏ చిన్న లక్షణం కనిపించినా ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వైద్య సిబ్బంది వారి నుంచి శాంపిళ్లు సేకరిస్తున్నారు. రోజుకు అధికారిక లెక్కల మేరకు 7వేల మందికిపైగా శాంపిళ్లు సేకరిస్తున్నారు. టెస్టింగ్‌లు మాత్రం అందులో 50 శాతం కూడా చేయడం లేదు. దీంతో ఫలితం వెలువరించే సమయానికి ఎవరైతే కరోనా లక్షణాల అనుమానాలతో శాంపిళ్లు ఇచ్చారో ఆ వ్యక్తి మృత్యువు అంచులదాకా వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారం రోజుల కిందట ఇచ్చిన శాం పిళ్లకు ఇప్పటి వరకూ పరీక్ష చేసి ఫలితం నిర్దారించ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. చాలా మంది కరోనా భయంతో టెస్టింగ్‌ ‌ఫలితం రాకపోయినా ఆస్పత్రుల్లో చేరిపోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అధికారులు టెస్టింగ్‌లపై శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పటి కప్పుడు టెస్టింగ్‌ ‌ఫలితాలు వెలువరించకపోతే ప్రమాదం పొంచి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా రోజురోజుకు వందల్లో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో చేరే బాధితుల సంఖ్య అదేస్థాయిలో ఉంటోంది. దీంతో ఏ ఆస్పత్రిలో చూసినా బెడ్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఆర్డీటీ ఆస్పత్రిలో 300 బెడ్లను ప్రా రంభించినప్పటికీ అంతకుమించి కరోనా బాధితులు అక్క డ చేరేందుకు క్యూ కడుతున్నారంటే బెడ్ల కొరత ఎంత ఉందో అర్థమవుతోంది.

జిల్లాలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్యను స్పష్టంగా వెలువరించ డంలో స్పష్టత కరువవుతోంది. రాష్ట్ర బులెటినలో ఇప్పటి వరకూ జిల్లాలో 623 మంది కరోనాతో చనిపోయినట్లు చూపుతున్నారు. జిల్లా అధికారులు ప్రకటించిన మేరకు 653 మంది చనిపోయినట్లు చెబుతున్నారు. రాష్ట్ర బులెటినలో చూపుతున్న సంఖ్యకు, జిల్లాలో ప్రకటిస్తున్న లెక్కకు మధ్య తేడా భారీగా కనిపిస్తోంది. సెకెండ్‌వేవ్‌ ‌కమ్ముకొస్తున్న నేపథ్యంలో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా, వాణిజ్య, వ్యాపార సముదా యాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, కరోనా నిబంధ నలు పకడ్బందీగా అమలు చేయాల్సిన జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

వైరస్‌ ‌బారిన పడకుండా ప్రజలను అప్రమ త్తం చేయడంతో పాటు వ్యాధి నిర్దారణ పరీక్షలను పెంచాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. బస్సులు, బహిరంగ ప్రదేశాలు, సినిమా హాళ్లు, టీ కేఫ్‌లు, రెస్టారెంట్లు, బార్లు, దుస్తుల దుకాణాలు, బ్యాంకులు, కూరగాయల మార్కెట్లు ఇలా ఎక్కడ చూసినా జనం గుంపులుగా ఉంటున్నా వారిని నియంత్రించేవారు కనిపించడం లేదు. జిల్లాలో కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు సి ద్ధం చేశామంటూ జిల్లా యంత్రాంగం లెక్కలు చూపిస్తోంది. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది.

Leave a Reply