మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ సమున్నత స్థాయిలో గౌరవించిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవతో పీవీ ప్రధానమంత్రి అయ్యారని గుర్తు చేశారు. పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని మంగళవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై భట్టి ప్రసంగించారు. పీవీ ఆధునిక భారత దేశ అభివృద్ధికి మూల పురుషుడని కొనియాడారు. పీవీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి స్థాయి నుంచి దేశ ప్రధానిగా పనిచేసేలా గౌరవం తెచ్చిపెట్టిందన్నారు.
పీవీ హయాంలో దేశంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందనీ, ప్రధానిగా పీవీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సహకారం అందించిందని స్పష్టం చేశారు. పీవీకి భారత రత్న ఇవ్వాలనే అంశంపై భట్టి ప్రసంగిస్తుండగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన మైక్‌ను కట్ చేశారు. సమయాభావం కారణంగా సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాననీ, కేటాయించిన సమయంలోనే సభ్యులు తమ ప్రసంగాన్ని పూర్తి చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ప్రసంగం ముగిసిన తరువాత తిరిగి భట్టికి ప్రసంగించడానికి అవకాశం ఇచ్చారు. అయితే, తాను ప్రసంగిస్తున్న సమయంలో మైక్ కట్ చేసి కేటీఆర్‌కు ఇవ్వడం పట్ల భట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు.