Take a fresh look at your lifestyle.

సింగరేణిని సంస్కరించిన పివి సాబ్‌

“అప్పటివరకు దాదాపు 1200 కోట్ల నష్టాల ఊబిలో కూరుకుపోయిన సింగరేణి పరిశ్రమను పివి తనదైన శైలిలో  సంస్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణిలో 49శాతం, 51 శాతంగా వాటా ఉండేది. ఆర్థికంగా సంస్కరణయే సంస్థకు ఏకైక మార్గమని పీవీ భావించారు. సంస్థ ఈక్విటీని పెంచి నాలుగు వందల కోట్లకు పెరిగేలా చేశారు. సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 663 కోట్ల రూపాయలను వాయిదాల పద్ధతిన చెల్లించే విధంగా మారిటోరియం విధించారు. దీంతో సంస్థకు ఆర్థికంగా వెసులుబాటు కలిగి నిలదొక్కుకుంది.”

  • 1994‌లో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమ
  • కేంద్రానికి 400 కోట్ల ఈక్విటీ పెంపు..663 కోట్ల మారిటోరియం
  • ఆనాటి లక్ష 16 వేల 223 మంది కార్మికులకు బాసట
  • ఖాయిలా పరిశ్రమలను గాడిన పెట్టిన రాజనీతిజ్ఞుడు

నాయిని మధునయ్య , సింగరేణి కోల్‌ ‌బెల్ట్ ఏరియా ప్రతినిధి
దక్షిణ భారత దేశంలో నెంబర్‌ ‌వన్‌గా దేశానికి వెలుగులు పంచే థర్మల్‌ ‌కేంద్రాలకు ప్రధాన ఆధారమైన బొగ్గు సరఫరా చేస్తూ అనేక పరిశ్రమలకు కొంగు బంగారంలా సింగరేణి నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల సంస్థ దాదాపు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్‌ ‌కంపెనీ దేశ పారిశ్రామిక రంగానికే అండగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రిగా తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు పదవీ బాధ్యతలు నిర్వహించి భారత దేశ ఔనత్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింపజేశారు. బహు భాషా కోవిదుడుగా దేశవిదేశాలలో కీర్తి గడించారు. భారత ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వర్ధమాన దేశాలకు మార్గదర్శకుడిగా అనేక సంస్కరణలను చేపట్టాడు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన పారిశ్రామిక సంస్కరణలు ప్రపంచ దేశాలను మేధావి వర్గాన్ని, పారిశ్రామికవేత్తలను ఆలోచింపజేశాయి. పీవీ ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలతో దేశం ప్రగతి బాటలో పయనించింది. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడైన పివి బొగ్గు పరిశ్రమలలో కూడా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటివరకు దేశంలో అమలులో ఉన్న బొగ్గు విధానంలో బొగ్గు ధరలను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించేది. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి అనేక ఆంక్షలు ఉండేవి. ఇతర దేశాల నుండి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉండేది.

ఈ నిబంధనల ఫలితంగా దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఎంత ఉండేదో ప్రపంచ వ్యాపార ప్రగతికి అంత దూరంగా ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్రం నిర్ణయించిన ధరలకు మాత్రమే బొగ్గు విక్రయించాలి. ఉత్పత్తి లక్ష్యాలను అదే మేరకు సాధించాలి. వీటి ఫలితంగా అప్పటివరకు లాభాలలో కొనసాగిన బొగ్గు పరిశ్రమలు నష్టాల బారిన పడ్డాయి. 1992 నుండి 1996 వరకు సింగరేణి సంస్థ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. పన్నెండు వందల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఆ సమయానికి సింగరేణి సంస్థలో ఒక లక్ష 16 వేల 223 మంది కార్మికులు పనిచేసేవారు. నెల వచ్చే సరికి కార్మికులకు వేతనాలు చెల్లించాలంటే అప్పుల కోసం వెతకాల్సి వచ్చేది. భారతదేశంలో ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు చేనట్టిన సంస్కరణల్లో భాగంగా బోర్డ్ ఆఫ్‌ ‌ఫైనాన్స్ ‌రీ కన్స్ట్రక్షన్‌(‌బిఐఎఫ్‌ఆర్‌)‌ను ఏర్పాటు చేసింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన పరిశ్రమలను బీఐఎఫ్‌ఆర్‌ ‌పరిధిలోకి తీసుకువచ్చారు. బిఐఎఫ్‌ఆర్‌ ‌పరిధిలోకి పోతే ఆ పరిశ్రమ పరిశ్రమగా గుర్తాంచబడేది. సంస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని అప్పటి పార్లమెంటు పారిశ్రామిక కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రి, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు జి.వెంకటస్వామి సంస్థపై ఒక నివేదిక అందించి ప్రధాని పివి దృష్టికి తీసుకుని వచ్చారు. కోల్‌ ‌బెల్టు ఏరియా ప్రాంతానికి పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటస్వామి ప్రధానమంత్రి పీవీ నరసింహారావును సింగరేణి సంస్థను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతో అప్పటివరకు దాదాపు 1200 కోట్ల నష్టాల ఊబిలో కూరుకుపోయిన సింగరేణి పరిశ్రమను పివి తనదైన శైలిలో సంస్కరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణిలో 49శాతం, 51 శాతంగా వాటా ఉండేది. ఆర్థికంగా సంస్కరణయే సంస్థకు ఏకైక మార్గమని పీవీ భావించారు. సంస్థ ఈక్విటీని పెంచి నాలుగు వందల కోట్లకు పెరిగేలా చేశారు. సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 663 కోట్ల రూపాయలను వాయిదాల పద్ధతిన చెల్లించే విధంగా మారిటోరియం విధించారు. దీంతో సంస్థకు ఆర్థికంగా వెసులుబాటు కలిగి నిలదొక్కుకుంది. అప్పుడప్పుడే అమల్లోకి వచ్చిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల ఫలితంగా సింగరేణి సంస్థలో భారీ మార్పులు జరిగాయి. బొగ్గు ధర నిర్ణయించుకునే అధికారం ఉత్పత్తి చేసే సంస్థలకే దక్కింది. బొగ్గు ధరతోపాటు క్వాలిటీ(నాణ్యత) కూడా సంస్థ పరిధిలోకి వచ్చింది. వీటితోపాటు యాంత్రీకరణ, ప్రైవేటీకరణ అనివార్యంగా పెరిగింది. ప్రపంచ మార్కెట్‌ ‌పరిధిలోకి బొగ్గు ధరలు వచ్చాయి. ఫలితంగా సింగరేణి సంస్థ గత 45 ఏళ్లలో ఉత్పత్తి లక్ష్యాలు గణనీయంగా పెరిగాయి. 2002వ సంవత్సరం నుండి సింగరేణి సంస్థ లాభాల బాటలో పయనించింది. కేంద్రానికి చెల్లించాల్సిన 663 కోట్ల రూపాయలను కూడా చెల్లించింది. గడిచిన 18 సంవత్సరాలుగా వెనుదిరిగి చూడకుండా లాభాలు ఆర్జించింది. ఏటేటా పెరిగిన లాభాలు వందల నుండి వేల వరకు చేరాయి. లాభాలతో పాటు బొగ్గు ఉత్పత్తి కూడా పెరిగి 70 మిలియన్‌ ‌టన్నులను వార్షిక లక్ష్యంగా సాధిస్తుంది. లాభాలు, వార్షిక ఉత్పత్తి అధికంగా పెరగడంతో జాతీయస్థాయిలో కోల్‌ ఇం‌డియాలో సింగరేణి సంస్థ ప్రథమంగా నిలిచింది. నాటి భారత ప్రధానమంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ వేసిన బంగారుబాటలో సింగరేణి సంస్థ పయనిస్తూ విజయ పథాన ఉందని పలువురు విశ్లేషకుల అభిప్రాయం.

Leave a Reply