Take a fresh look at your lifestyle.

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి… నెత్తురు కక్కుకుంటూ నేలకు…

‘సాహసోపేతమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టి, పార్టీలోని ప్రత్యర్థులను, ప్రతిపక్షాలలోని ఉద్దండులను పల్టీలు కొట్టించి, దాదాపు ప్రతి రాజకీయ పార్టీని-పార్లమెంటరీ పార్టీని చీల్చి తన మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీ ప్రభుత్వంగా మార్చారు. సమకాలీన రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేకత వుందని నిరూపించుకున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబేతరుడుగా, అసాధ్యాన్ని సాధ్యంచేసి, పప్రథమంగా భారత జాతీయ కాంగ్రెసు ఆధిపత్యాన్ని ఆ కుటుంబం నుండి తప్పించి, అయిదేళ్లు సుస్థిర పాలనను అందించి, ఆర్థిక-సామాజిక-రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఆ పునాదుల శిధిలాల్లోనే వాటికి రాళ్లు మోసిన వారి చేతుల్తోనే నెట్టబడ్డారు పి.వి. నరసింహారావు…’

అక్టోబర్‌ 13, 2000- ‌శుక్రవారం నాడు వెలువడిన ఏ దినపత్రిక చూసినా, ఆ క్రితం రాత్రి-పగలు ఏ టీవీ-రేడియో ఛానల్లో వార్తలు విన్నా, కనిపించిందీ-వినిపించిందీ, మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుకు విధించిన జైలు శిక్ష గురించిన సమాచారమే. ‘చెరసాలకు మాజీ ప్రధానీ’, ‘అవినీతికి అరదండాలు’, ‘ఆర్థిక సంస్కరణల శిల్పికి మూడేళ్ల జైలు’… ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు శీర్షికలు పెట్టారు. అదే అర్థం స్పురించే రీతిలో ఇతర పత్రికలు (ఆంగ్ల, హిందీ) కూడా శీర్షికలు పెట్టాయి. చరిత్ర పుటల్లోకి ఎక్కి – విశ్వవ్యాప్తమన్ననలనందుకున్న – ఓ ‘మహనీయుని’ పరిస్థితి, కడు‘దయనీయంగా’ మారి, కనీసం పాఠ్యపుస్తకపు పుటల్లో కూడా పేరుండరాదనీ-కూడదనీ, క్షణాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే, ఆ దుస్థితికి జాలి పడాలా? సానుభూతి చూపాలా? శ్రీ పి.వి. నరసింహారావు తప్పు చేసారా-లేదా, అన్న విషయం కన్నా, ఆ ‘ఘోర తప్పిదానికి’, ఆయనకు విధించిన ‘శిక్ష నుంచి, మినహాయింపు కానీ, కనికరాన్ని కానీ, పొందేటందుకు అనర్హుడు’ అని ఆ శిక్షను ఖరారు చేసిన న్యాయమూర్తి- శ్రీ అజిత్‌ ‌బరిహోక్‌ ‌భావించారంటే, ముడుపుల వ్యవహారం పూర్వాపరాలు-పర్యవసానాలు ఆ న్యాయమూర్తిపై ఎంతటి ప్రభావాన్ని చూపాయో అర్థం చేసుకోవటం కష్టమే.

pv narasimha rao special story by vanam jwala narasimha rao

అయితే, ఒకే ఒక్క విషయం,అర్థంకానిదీ, అవగాహన చేసుకోవాల్సిందీ – కనికరాన్ని పొందటానికి కూడా అనర్హుడుగా భావించతగ్గ పీవీ పైన, ఆఖరు క్షణంలో, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ‘నువ్వుగింజ’ంత కనికరం చూపించారెందుకనే సంగతి. శిక్షను విధిస్తూ – ఆ శిక్షాకాలాన్ని మూడేళ్లకు పరిమితం చేయటంతో, పీవీని తక్షణం జైలులో తోసేయకుండా అవకాశం కలిపించి, బెయిలు పొంది, హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకునే వీలు – పోనీ ‘శిక్షనుంచి తాత్కాలిక మినమాయింపు’ కలిగించారు న్యాయమూర్తి శ్రీ అజిత్‌ ‌బరిహోక్‌ ఆ ‌తక్షణ బెయిలునూ ఆయనున్న సెషన్స్ ‌కోర్టులోనే మంజూరు చేసారు. ఇక, ఈ కేసు వ్యవహారంలోకి వెళ్తే… ప్రధానిగా స్వపక్ష-విపక్షాల వారినుండి, ప్రత్యక్ష-పరోక్ష మన్ననలనందుకున్న శ్రీ పి.వి. నరసింహారావుపై, తమ సహజ ధోరణిలో, ప్రతిపక్షాలు 1993వ సంవత్సరం జులై నెలలో, 28వ తేదీన, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, మైనార్టీలో వున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని గట్టెక్కించి- రక్షించటానికి, జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చాకు చెందిన ఎంపీలకు ముడుపులు ఇచ్చారన్న అభియోగం ఆయనపై వేశారు. అది అభియోగం కాదనీ, ఆయన వద్ద ముడుపులు తీసుకున్న విషయం రుజువైందనీ తేల్చి, ఆయన శిక్షార్హుడని న్యాయస్థానం – న్యాయమూర్తి శ్రీ అజిత్‌ ‌బరిహోక్‌ ‌తీర్పునిచ్చింది. భారత శిక్షాస్మృతి 120వ సెక్షన్‌ ‘‌బి’ క్రింద క్రిమినల్‌ ‌కుట్ర పరిధిలోనూ, అవినీతి నిరోధక చట్టంలోని 7,12 సెక్షన్ల క్రిందనూ, పీవీ గారికీ – ఆయనతో పాటు బూటాసింగ్‌ ‌గారికీ, మూడెళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. దీనికి తోడు అవినీతి నిరోధక చట్టం క్రింద-మరో సెక్షన్‌లో ఇంకో లక్ష రూపాయల శిక్షను విధించారు. తన 18 పేజీల తీర్పులో ‘కఠిన’ పదజాలాన్ని వాడిన న్యాయమూర్తి శ్రీ అజిత్‌ ‌బరిహోక్‌, ‌పీవీ నరసింహారావు చేసిన ప్రయత్నం, భారత రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమనీ, ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమైందనీ పేర్కొన్నారు.

‘నిర్ణయం తీసుకోకపోవటమే సరియైన నిర్ణయం’ అని భావించే శ్రీ పి.వి. నరసింహారావు ఎందుకు-ఎలా, జార్ఖండ్‌ ‌ముక్తిమోర్చా ఎంపీలకు ముడుపులు ఇచ్చి తన ప్రభుత్వాన్ని రక్షించుకోవాలన్న ‘నిర్ణయం’ తీసుకున్నారో – తీసుకోగలిగారో. అయిదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో, శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి పలువురికి పంచి పెట్టిన మేధావి, కాకలు తీరిన కాంగ్రెస్‌ ‌యోధుడు, ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా చిరునవ్వు వీడని ధీశాలి. ముఖములో తీర్పు వెలువడిన కొన్ని సెకన్లు మాత్రం అదోరకమైన ఆందోళన కనిపించిందని – అయితే వెను వెంటనే నిలదొక్కుకుని, మామూలుగా మారారని, ఆ క్షణంలో ఆయన వెంటున్న సన్నిహితులు పేర్కొన్నారు. మరి, ఆయన అప్పుడప్పుడూ చెప్పేవిధంగా, ‘చట్టం’ తన పని తాను చేసుకుంటూ పోయిందా’? నరసింహారావుగారు చేసిన పోనీ రుజువైన నేరం- అపరాధం ఒక్కటేమో కానీ, ఆయన చేసిన పొరపాట్లు అనేకానేకం. నేరానికి కోర్టు శిక్ష విధించిందేకానీ, ఆయన చేసిన పొరపాట్లకు మాత్రం రాజకీయంగా, ఆయన సహచరులు, సన్నిహితులు, ఆయన్ను హిమాలయాల పైనున్న ములగచెట్టు ఎక్కించిన మహానుభావులు ఎందరో, ఏనాడో శిక్ష విధించారు పీవీకి.

pv narasimha rao special story by vanam jwala narasimha rao

ఆలోచనల్లో, అమల్లో విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనాల్సిన వ్యక్తి, అపర చాణక్యుడుగా అందరూ స్థుతించిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ప్రతిపక్షాల నుండీ ఖండ ఖండాంతర ఆర్థిక నిపుణుల నుండీ మన్ననలనందుకున్న వ్యక్తి పీ.వీ. నరసింహారావు ఎందుకు అడుసుదొక్కాడు, కాలుకడిగే ప్రయత్నం చేసాడు? ఆయన తొక్కిన అడుసు పూర్తిగా తుడిచి పెట్టుకుని పోయిన కాంగ్రెసు పార్టీకి పూర్వవైభ•వాన్ని అయిదేళ్లపాటు కలిగించటం అనుకుంటే చేసిన కాలుకడిగే ప్రయత్నం విశ్వాస ఘాతకులకు ‘వందేళ్ల చరిత్ర’ను అంకితం చేయటం అనాల్సిందే! ఎన్నికల్లో పోటీ చేయను, టిక్కెట్టు కూడా తనకు వద్దు అన్న వ్యక్తి మూటా ముళ్లా సర్దుకుని స్వంత రాష్ట్రానికి పయనమయిన వ్యక్తి – ఎందుకు క్రీయాశీలక రాజకీయాల్లో కొనసాగి, అనూహ్య రీతిలో ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి, తమ భవిష్యత్‌ను రాజకీయ భవిష్యత్‌ను కనీసం అయిదేళ్లన్నా వెనక్కునెట్టారని పీవీ పార్టీవారూ, ఇతర పార్టీలవారూ భావించటంలో తప్పు లేదు. తప్పల్లా ఆయన కష్ఠకాలంలో పార్టీ పగ్గాలు చేపట్టటం, ఐదేళ్ళూ ఆ పార్టీని అధికారంలో వుంచటం. ఆయన ముడుపులు ఇచ్చి (ఇచ్చారని కోర్టే తీర్పిచ్చింది కాబట్టి) కాపాడింది ప్రభుత్వాన్ని ఔనో- కాదో కాని, పరోక్షంగా, ఆ ముడుపులకు ఇబ్బడి- ముబ్బడిగా లబ్దిపొందే అవకాశాన్ని తన వారికీ-పరాయి వారికీ ( రాజకీయంగా) కల్పించటం. ఇదే ఆయన చేసిన మరో ఘోర పాపం.

ఇదిలా వుండగా, వీటన్నింటి కన్నా మించిన కఠోర పాపం ఆయన నెహ్రూ కుటుంబేతరుడుగా, తొలి దక్షిణాది వ్య•గ్తా ప్రధాని పీఠాన్ని అందుకోవటం అంతటితో ఆగకుండా ఆ పదవిలో ఐదేళ్లు కొనసాగటం. ఆయనకు ముందు నెహ్రూ కుటుంబేతరులైన లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, విపి సింగ్‌, ‌చంద్రశేఖర్‌లు మాత్రమే ప్రధానులు కాగలిగారు. అయితే కేవలం ఆ పదవిని చవిచూసి, రుచి చూసే లోపలే నిష్క్రమించారు. తేడా నల్లా వీరూ ఉత్తరాది వారే. ఈయనేమో దక్షిణాది వాడూ, నెహ్రూ కుటుంబానికి చెందినవాడూ ముఖ్యమంత్రిగా కూడా పూర్తి కాలం పనికిరాని వాడు కావటంతో అన్నింటికీ మించి కనీసం మెజార్టీ సభ్యుల మద్దతు కూడా లేకుండా ప్రధాని పీఠాన్ని ఎక్కటంతో పీవీని దెబ్బతీసే ప్రయత్నం 1991లోనే మొదలయిందని అంటే అతిశయోక్తి కాదేమో! భారతావనిలో కులాలు, మతాలు, భాషలు అటుంచి, ఉత్తరాదివారు, దక్షిణాదివారు అనే తేడాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే ఉన్నతోన్న తమైన ఓ వ్యక్తిని అధ:పాతాళానికి త్రొక్కిందాకా ప్రయత్నాలు జరిగాయనేది కనిపిస్తున్న నగ్నసత్యం. ఎనభై సంవత్సరాల పాములపర్తి వెంకట నరసింహారావు గారు తన రాజకీయ ప్రస్థానంలో హిమాలయాలంత ఎత్తెదిగారు. అదే నిష్పత్తిలో తన యావత్‌ ‌జీవితాన్ని మెట్ట పల్లాల మయం చేసుకున్నారు. తొమ్మిదవ భారత ప్రధానిగా 1991లో ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించిన తెలుగుబిడ్డ. స్వాతంత్య్ర సమరయోధునిగా, స్వామీ రామానందతీర్థ శిష్యునిగా నిజాం వ్యతిరేక పోరాటాలలో అగ్రభాగానున్న పీవీ నరసింహారావుకు రాని భాష లేదు. పదవి కొరకు ఆయన ప్రయత్నం చేసినదానికంటే, పదవులే ఆయన్ను కోరుకున్నాయని చెప్పొచ్చు.

వరంగల్‌ ‌జిల్లా, నర్సంపేట తాలుకా లక్నపల్లి గ్రామంలో సీతారాంరావు-రుక్మబాయమ్మ దంపతులకు జూన్‌ 28, 1921 ‌కలిగిన సంతానం పీవీ. కరీంనగర్‌ ‌జిల్లాలోని వంగర- వేలేరులలో ప్రాథమిక విద్యనభ్యసించిన పీవీ, హన్మకొండలో 5వ తరగతి నుండి మెట్రిక్యులేషన్‌ ‌వరకు చదువుకున్నారు. చదువులో ఎప్పుడూ ముందుడే పీవీకి లెక్కలంటే ఎంతో ఇష్టం. ఆటల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. పరీక్షల్లో ప్రశ్నాపత్రాలకు ఆయన రాసిన జవాబులను ఆయన తోటి విద్యార్థులకు చదివి వినిపించేవారు ఆయన గురువులు. లిటరేచర్‌, ‌సంగీతం అంటే చెవి కోసుకునేవాడ ఆయన. తెలుగు ప్రబంధాల నుంచి సినిమా డైలాగుల వరకూ చదివిందీ, విన్నదీ తు.చ. తప్పకుండా అప్పచెప్పే ఏక సంతగ్రాహి. నాటకాలూ వేసేవాడు. నైజాం-హైదరాబాద్‌లో ‘వందేమాతరం’ గీతాన్ని నిషేధించటంతో, దాన్ని వ్యతిరేకించి కాలేజీ బహిష్కరణకు గురైన ఎందరో విద్యార్థుల్లో పీవీ ఒకరు. తోటి విద్యార్థుల వలెనే ఆయన కూడా నాగపూర్‌ ‌విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్‌లో చేరారు. ఇంటర్మీడియట్‌లోనూ, ఆ తర్వాత బియస్సీలోనూ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనారు ఆయన. నాగపూర్‌ ‘‌లా’ కళాశాలలో చేరి ‘ఫస్ట్ ఇన్‌ ‌ఫస్ట్’ ‌ర్యాంకుతో లా డిగ్రీనందుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్‌గా చేరి లా ప్రాక్టీస్‌ ‌చేసారు.

నాగపూర్‌లో ‘లా’ చదువుతున్న రోజుల్లో ఆయన త్రిపురలో జరిగిన కాంగ్రెసు సభలకు హాజరయ్యారు. అక్కడే ఆయన జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, సుభాష్‌ ‌చంద్రబోస్‌లతో సహా ఎందరో జాతీయ నాయకులను కలుసుకున్నారు. అలనాడు హైదరాబాద్‌ ‌స్టేట్‌లో నెలకొన్న పరిస్థితులను ఆయన వివరించిన తీరు చూసిన జాతీయ నాయకులు ఆయనలోని ప్రతిభను అప్పుడే గుర్తించారు. ఆ తర్వాత స్వామీ రామానంద తీర్థ సిద్ధాంతాలపట్ల ఆకర్షితుడైన పి.వి. ఆయన అడుగుజాడల్లో మెలిగారు. ఇప్పటి మహారాష్ట్ర ‘చందా’ ప్రాంతానికి క్యాంప్‌ ఇన్‌ఛార్జీగా నిజాం వ్యతిరేక పోరాటంలో, స్వామీజీ అనుచరుడిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌ ‌విమోచన అనంతరం చిన్ననాటి మిత్రుడు శ్రీ సదాశివరావుతో కల్సి ‘కాకతీయ పత్రిక’ ప్రారంభించి, అందులో ఆసక్తికరమైన ఎన్నో వ్యాసాలను, శీర్షికలను రాసారు. 1952 జనరల్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ ‌లోక్‌సభ స్థానానికి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నరసింహారావు స్వామీ రామానంద తీర్థ అధ్యక్షుడిగా వున్న హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెసుకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. స్వామీజీ ఆశయం మేరకు ‘విశాలాంధ్ర’ ఉద్యమంలో పాల్గొన్న పీవీ సమైక్య ఆంధప్రదేశ్‌నే ఎల్లప్పుడు కాంక్షించేవారు. ప్రత్యేక తెలంగాణా కానీ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు కానీ ఆయన్ను తన విధానాన్ని మార్చుకునేందుకు ప్రభావితం చేయలేకపోయాయి. 1957లో పప్రథమంగా చట్టసభలోకి అడుగుపెట్టే అవకాశం కలిగింది పి.వీ. నరసింహారావుగారికి. కరీంనగర్‌ ‌జిల్లా ‘మంథని’ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పీవీ చురుకైన సభ్యుడిగా పేరు తెచ్చుకోవటమే కాకుండా, తెలంగాణా ప్రాంతీయ బోర్డు సభ్యునిగా కూడా పనిచేశారు. ఆయన పోషించిన అలనాటి పాత్ర స్వపక్షాల నుండి – ప్రతిపక్షాల నుండీ మెప్పునందుకుంది.

pv narasimha rao special story by vanam jwala narasimha rao

1962లో మరో పర్యాయం మంథని నియోజకవర్గం నుండి పోటీ చేసి మళ్లీ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు పీ.వి. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి గారు ఆంధప్రదేవ్‌ ‌ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయన ఆహ్వానం మేరకు స్టేట్‌ ‌మంత్రి హోదాలో రాష్ట్ర క్యాబినెట్‌లో చేరారాయన. సమాచార-పౌరసంబంధాల శాఖ, పౌర సరఫరాలు, లా-జైళ్లు శాఖలను నిర్వహించారు పి.వి. అప్పట్లో జైళ్ల సంస్కరణలు చేపట్టిన పీవీ బాలనేరగాళ్లకు విద్యావకాశాలు కల్పించారు. అదే మంథని నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారాయన 1967 ఎన్నికల్లో. రాష్ట్ర క్యాబినెట్‌లో బ్రహ్మానందరెడ్డిగారి మంత్రివర్గంలో దేవాదాయ-ధర్మాదాయ శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరసింహారావుగారు దేవాదాయ నిధులను ఉపయోగించటానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోస్తరు పద్దతికి సంబంధించిన బిల్లును తీసుకొచ్చారు. అదే మంత్రివర్గంలో వైద్య-ఆరోగ్య శాఖను కూడా నిర్వహించారాయన కొంతకాలంపాటు. ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ప్రాక్టీసు చేయరాదన్న నిబంధనను ఆయన హయాంలోనే తీసుకుని రావటం జరిగింది. పి.వి. నరసింహారావుగారికి అత్యంత ఇష్టమయిన పోర్టు ఫోలియో-విద్యాశాఖను ఆయనకు అప్పగించారు. ఆ తర్వాత తెలుగును రాష్ట్రస్థాయి అధికార భాషగా సూచిస్తూ ఆయన తయారు చేసిన శ్వేతపత్రం ఎందరో విద్యాధికుల నుండి ప్రశంసలను అందుకుంది. అన్ని విశ్వవిద్యాలయాల్లో కళాశాల స్థాయి వరకు తెలుగును మాద్యమంగా ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కింది•. ఇలా1962-70 మధ్య కాలంలో ఆయన ఎన్నో శాఖలను నిర్వహించి ఎంతో అనుభవం గడించారు. ఏ విశాలాంధ్ర కొరకై ఆయన కలలు కన్నారో, సాధించేందుకు కృషి చేసారో, ఆ విశాలాంధ్ర ముక్కలు చేసే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఆరంభమై, అవధులు దాటింది. ఆ క్లిష్ట సమయంలో పరిస్థితులు చేజారిపోయిన-పోతున్న తరుణంలో నాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ, పి.వి. గారైతేనే పరిస్థితిని మెరుగు పర్చగలరన్న నమ్మకంతో ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. సెప్టెంబర్‌ 28, 1971 ‌విజయదశమి పర్వదినాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన పి.వి. అహర్నిశలు రాష్ట్రాభివృద్ధికి కృషి చేసారు. అభివృద్ధికర సంస్కరణలు తీసుకొచ్చారు.

1972 సంవత్సరంలో ఆయన నాయకత్వంలో మళ్లీ జరిగాయి సాధారణ ఎన్నికలు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల ఎంపికలో, యువకులకు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారాయన. అత్యధిక మెజార్టీ సీట్లను గెల్చుకుని మళ్ళీ రాష్ట్ర సారధ్యం వహించారాయన కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా. చారిత్రాత్మక భూసంస్కరణల బిల్లుకు ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడే శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక అసమానతలు తొలగించటానిక, ఉత్పత్తి పెరుగుదలకు ఉద్దేశించిన ఓ సామాజిక సంస్కరణగా అభివర్ణించారు తాను చేపట్టిన ఆ చర్యను పీవీ గారు. పైకి కనిపించిన,వినిపించిన కారణాలు ఏవైనా, ఆయన పదవీచ్యుతుడు కావటానికి, తాను చేపట్టిన అభివృద్ధి సంస్కరణలు అనే విషయంలో సందేహం లేదు. భూ సంస్కరణలు అనే ఏ ఆయుధంతో ఆయన ప్రజలకు చేరువయ్యాడో, అదే ఆయుధాన్ని త్రిప్పి, ఆయనపై గురిచేసి ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే స్థితికి తీసుకొచ్చారు నాటి సంపన్నవర్గాలవారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన పి.వి. నరసింహారావుకి భారత జాతీయ కాంగ్రెసు కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పింది కాంగ్రెసు అధిష్ఠానవర్గం. ఆ హోదాలో ఆయన స్వర్గీయ శ్రీమతి గాంధీకి పార్టీ-పాలన సలహాదారుడుగా వుంటూ, పార్టీని, ఆమెను బలోపేతం చేసే కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. 1977 ఎన్నికల్లో హన్మకొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి పెద్ద మెజార్టీతో మొట్టమొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన ఆ తరుణంలో, ప్రతిపక్ష సభ్యునిగా లోక్‌సభలో ప్రత్యేక గుర్తింపు పొందిన పీవీ నరసింహారావుగారికి పబ్లిక్‌ అకౌంట్స్ ‌కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పచెప్పారు.1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తిరిగి హన్మకొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది, శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పదవినలంకరించారు. ఆ పదవిలో ఆయన జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ గారి విదేశాంగ నీతిని దశ దిశలా ప్రచారం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయనిచ్చిన ఉపన్యాసం పాత రోజులనాటి కృష్ణమీనన్‌ ఉపన్యాసాన్ని మరిపించిందని అందరూ అనేవారు. కొంతకాలం హోమ్‌ ‌శాఖను నిర్వహించారాయన.

హన్మకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయినా 1984లో మహారాష్ట్రలోని రామ్‌టెక్‌ ‌లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయిన పీవీ-రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో రక్షణశాఖను కొంతకాలం, మానవ-వనరుల అభివృద్ధి శాఖను కొంతకాలం నిర్వహించారు.నూతన విద్యావిధానాన్ని(ఛాలెంజెస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) ఆయనే రూపొందిచారు. ఆయన హయాంలోనే జాతీయ శిక్షణ విధానాన్ని కూడా రూపొందించారు. 1989లోనూ రామ్‌టెక్‌ ‌నుండే గెల్చారు. రాజీవ్‌ ‌పదవీచ్యుతుడైన తర్వాత రాజకీయాలకు దాదాపు స్వస్థి పలికి విశ్రాంతి తీసుకుంటుండగా, మధ్యంతర ఎన్నికలోచ్చాయి. టికెట్‌ ‌కూడా అడగకుండా మూటా ముళ్లా సర్దుకుని స్వరాష్ట్రం వెళ్లే ప్రయత్నంలో వున్న సమయంలో, రాజీవ్‌ ‌గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్‌ అభ్యర్థిగా కాంగ్రెసు పార్టీ అధ్యక్షపదవిని చేపట్టి హత్యానంతర ఎన్నికలకు సారధ్యం వహించి, ఆ పార్టీని ఏకైక పెద్ద పార్టీగా గెలిపించుకున్నారు. పార్టీ ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవటంతో 1991లో మైనార్టీ ప్రభుత్వ ప్రధానమంత్రిగా తొలి దక్షిణాది వ్యక్తిగా ఓ గుర్తింపు పొందారు. స్వతంత్ర భారత చరిత్రలో దక్షిణ భారత దేశం నుండి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా చరిత్రపుటల్లోకి ఎక్కారు. సాహసోపేతమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టి, పార్టీలోని ప్రత్యర్థులను, ప్రతిపక్షాలలోని ఉద్దండులను పల్టీలు కొట్టించి, దాదాపు ప్రతి రాజకీయ పార్టీని-పార్లమెంటరీ పార్టీని చీల్చి తన మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీ ప్రభుత్వంగా మార్చారు. సమకాలీన రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేకత వుందని నిరూపించుకున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబేతరుడుగా, అసాధ్యాన్ని సాధ్యంచేసి, పప్రథమంగా భారత జాతీయ కాంగ్రెసు ఆధిపత్యాన్ని ఆ కుటుంబం నుండి తప్పించి, అయిదేళ్లు సుస్థిర పాలనను అందించి, ఆర్థిక-సామాజిక-రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఆ పునాదుల శిధిలాల్లోనే వాటికి రాళ్లు మోసిన వారి చేతుల్తోనే నెట్టబడ్డారు పి.వి. నరసింహారావు. ఏది ఏమైనా, ప్రపంచంలో అత్యంత అవినీతిమయమైన దేశాలలో ఒకటిగా పేరు పొందిన భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒక మాజీ ప్రధానమంత్రి ఇటువంటి నేరంలో శిక్షపొందడం ఈ దేశానికి మరింత మచ్చగానే మిగిలిపోతుంది. ఉన్నత న్యాయస్థానంలో ఈ తీర్పు మీద అప్పీలు చేసుకునేందుకు పీ.వీ.నరసింహారావుకు అవకాశం ఉంది. ఉన్నత న్యాయస్థానం ఏ తీర్పునిచ్చినా ఈ మచ్చ మాసిపోయేది మాత్రం కాదు.

ప్రధానిగా స్వపక్ష-విపక్షాల వారినుండి, ప్రత్యక్ష-పరోక్ష మన్ననలనందుకున్న శ్రీ పి.వి. నరసింహారావుపై, తమ సహజ ధోరణిలో, ప్రతిపక్షాలు 1993వ సంవత్సరం జులై నెలలో, 28వ తేదీన, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, మైనార్టీలో వున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని గట్టెక్కించి- రక్షించటానికి, జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చాకు చెందిన ఎంపీలకు ముడుపులు ఇచ్చారన్న అభియోగం ఆయనపై వేశారు. అది అభియోగం కాదనీ, ఆయన వద్ద ముడుపులు తీసుకున్న విషయం రుజువైందనీ తేల్చి, ఆయన శిక్షార్హుడని న్యాయస్థానం – న్యాయమూర్తి శ్రీ అజిత్‌ ‌బరిహోక్‌  అక్టోబర్‌ ‌నెల ,2000 సంవత్సరంలో  తీర్పునిచ్చింది.ఆ సందర్బంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీపీఆర్వో గా బాధ్యతలు నిర్వహిస్తున్నవనం  జ్వాలా నరసింహారావు రాసిన వ్యాసం .
‘ప్రజాతంత్ర ‘సంపూర్ణ స్వతంత్ర వార పత్రిక .అక్టోబర్ 28,2000.
vanam jwala narasimha rao
వనం జ్వాలా నరసింహారావు

Leave a Reply