వంగరలో కుటుంబ సభ్యుల కలయికతో మునుపటి స్వైర విహారాల, చర్చోప చర్చల పీవీ, సంగీత సభల్లో ‘వాహ్’ శ్రోతగా, క్లాసులో ఫస్ట్ మార్క్ ఆన్సర్ షీట్లతో పాటు ఉపాధ్యాయుల ప్రశంసల్ని అందుకున్న విద్యార్థిగా – ఇలాంటి ఎన్నో ఆనందకర పాత్రల్ని పోషించి ఇన్నేండ్లు ఆకాశంలో విహరించిన పీవీ ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు, ఆదాయ వ్యయ చిట్టాలు తెలిసి రావడంతో భూమిపైకి దిగి వచ్చాడు. భావ సంఘర్షణ మొదలయింది. ఏదైనా ఉద్యోగం చేయడమా లేక వంగరలో స్థిరపడి వ్యవసాయం చేసుకోవాలా?… మరో చిన్న కోరిక కూడా మనసులో మెలుగుతోంది. ‘పై చదువులు చదవాలని’ ! వేసవి సెలవుల్లోపల ఈ ‘‘కిం కర్తవ్యం?’’ అనే దానికి సమాధానమివ్వాలి. తరగతి చదువుల ప్రశ్నలకైతే ఠకీమని సమాధానం రాసి మొదటి మార్కులు కొట్టేసే పీవీకి ఈ బ్రతుకు చదువు ప్రశ్నకు బాగా ఆలోచించవలసి వచ్చింది. తుదకు ఉద్యోగం ‘జాన్ తా నహీ’, వ్యవసాయం ‘మాన్ తా నహీ’ అనుకున్నాడు. ‘వకాలత్ పఢ్ నా హీ మేరీ పసంద్ హై’ అని నిర్ణయించుకున్నాడు – అదీ తన ఫేవరిట్ ఊరు నాగ్‌పూర్‌లో.
నాగ్‌పూర్‌లో గది అద్దెకు తీసుకొని కాలేజీలో చేరి ‘లా’ చదువు ప్రారంభించాడు పీవీ. కానీ వెనకటి తిరుగుళ్ళ పీవీ కాదు. ఇకపోతే రెండవ ప్రపంచ యుద్ధం చాయలు మన దేశంలో కూడా వున్నాయి, మరో వైపు బెంగాల్లో దారుణ క్షామ స్థితి. ఇక జాతీయ నాయకులంతా జైళ్ళలో వున్నారు. దేశంలో రాజకీయ స్తబ్ధత, ప్రజలలో నిరుత్సాహం నెలకొని ఉన్నాయి. పరిస్థితులని అర్థం చేసుకున్న పీవీ తన కలానికి పని చెప్పాడు. తనలోని వివిధ భావాలని వ్యక్తపరుస్తూ కొన్ని కవితలు, వ్యాసాలు రాసాడు. వాటిలో బెంగాల్ కరువు భూమికతో రాసిన ఒక కథ ఇతివృత్తం అద్భుతమని పీవీ సన్నిహిత మిత్రులు పేర్కొనే వారు. కథ ఇలా సాగుతుంది.. ‘కరువు రక్కసికి కుటుంబ సభ్యులను కోల్పోయి ఏకాకిగా మిగిలిన ఒక యువతి ఆకలి కాగలేక చివరకు భిక్షమెత్తుకునేందుకు సన్నద్ధమౌతుంది. కాని బిచ్చం కూడా లభ్యం కాని దురవస్థ స్థితిలో తన శరీరాన్ని కూడా అమ్ముకునేందుకు సిద్ధమవుతుంది.’ ఆత్మాభిమానం కల ఆ యువతి తన దిగజారుడు తీరుకు పడే ఆమె మనో వేదనను ‘అద్భుతంగా చిత్రీకరించాడు పీవీ’ అని ఆ మిత్రులు చెబుతారు. అంటే వెనుకటి పీవీకి, ప్రస్తుత చైతన్య పూరిత భావ ప్రకటన చేయగల ఆలోచనా ధోరణులు, రచనా ప్రక్రియలో నేర్పూ గల పీవీకి మధ్య వ్యత్యాసం నాగపూర్ పట్టణానికి కూడా అర్థమయివుంటుంది.
ఇకపోతే, పీవీలో నాగ్‌పూర్‌లోని ప్రముఖ వ్యక్తులను కలిసి వారితో పరిచయాలను యేర్పరుచుకోవాలన్న కొత్త వ్యాసంగం మొదలయింది. అప్పటికే నాగ్‌పూర్‌లో వున్న ప్రముఖ తెలుగు వారిని కలిసి వారితో స్నేహమేర్పడి కబుర్లు చెప్పుకొనడం జరుగుతుండేది. ఈ కబుర్లలో పీవీకి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. అక్కడి ఆంధ్ర ప్రముఖులు తెలంగాణా ప్రాంతం గురించి చులకన భావం కలిగి ఉండి తెలంగాణా వారికి తెలుగు సరిగారాదనీ, ఉర్దూ మీడియంలో విద్యా బోధన వుంటుంది కాబట్టి చదువుకున్న వారిలో శాస్త్ర సంబంధిత విషయ పరిజ్ఞానం తక్కువ అనీ ఇంకా ఇతర అభిప్రాయాలను వెలిబుచ్చినప్పడు పీవీ, రామానుజరావు గార్లు వారికి వాస్తవాలు సోదాహరణంగా వివరించేవారట.
మొత్తానికి – పీవీ నాగ్‌పూర్ నుండి లా డిగ్రీ, దానితో బాటు వినూత్న అనుభవాల తోడు తీసుకొని ఇక భవిష్యత్ జీవన సంగ్రామానికై హైదరాబాదు చేరాడు. లా డిగ్రీ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ అని చెప్పనవసరం లేదు కదా!
అనేక భావ సంఘర్షణల మధ్య భవిష్యత్ జీవన దిశా నిర్దేశం – రాజకీయాల వైపుగా చదువు ముగించి భవిష్యత్ బ్రతుకు బాటలో పయనించడానికి 1945లో న్యాయ శాస్త్ర పట్టాతో పీవీ హైదరాబాదు చేరి ప్రఖ్యాత న్యాయవాది శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర జూనియర్‌గా చేరాడు. బూర్గుల గారి నాయకత్వ లక్షణం, నానా ముఖ ప్రతిభ, వ్యవహార దక్షత పీవీకి బాగా నచ్చాయి. చదువులో లాగానే వకాలత్ వ్యవహారంలోనూ పీవీ అందరి మన్నన పాత్రుడయ్యాడు. హైకోర్టులో పీవీ వాదనా పటిమ సీనియర్ లాయర్ల మెప్పును పొందింది. వాదనలో తాను చెప్పే పాయింట్స్ వివరంగా, విషయ పరిజ్ఞానంతో కూడి వుండేవని, కేసు నెగ్గించుకోవడంలో పీవీ చూపే వాదనా చాతుర్యం, అందులో చూపించే ఆధార వివరాలు పేరుమోసిన లాయర్లనే చకితులను చేసేవట.
ఇక పీవీ హైదరాబాదు చేరేసరికి అక్కడ రాజకీయ సాంఘిక పరిస్థితు లెట్లున్నాయో క్లుప్తంగా తెలుసు కుందాం. రెండో ప్రపంచ యుద్ధం తీవ్రంగా సాగుతున్నది. యుద్ధ ఒడిదుడుకుడుల వలన విపరీతంగా పెరిగిన ధరలు, ఆహార రేషనింగ్, సివిల్ సప్లై సరుకుల కొరత మున్నగు నిత్య కష్టాలు హైదరాబాదు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
నిజాం వ్యతిరేక రాజకీయ ఉద్యమం కూడా కొత్త మలుపులు తిరిగింది. అప్పటిదాకా నిషేధంలో వున్న స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం నిషేధం ఎత్తేయడంతో మళ్ళీ ప్రారంభమై నిజాం ప్రభుత్వ ప్రతిపాదిత సంస్కరణలను వ్యతిరేకించింది. ఇక నిజాం వ్యతిరేక ఏకైక తెలంగాణా ప్రజా ఉద్యమ సంస్థ ‘ఆంధ్ర మహా సభ’ రెండుగా చీలి పోయింది. కమ్యూనిస్టుల సారథ్యంలో ‘కమ్యూనిస్ట్ ఆంధ్ర మహాసభ’ అనీ, కమ్యూనిస్టేతర నాయకుల సారథ్యంలో ‘జాతీయ ఆంధ్ర మహాసభ’ అనీ విడివిడిగా పని చేయడం మొదలు పెట్టాయి. ఈ రెండూ కూడా నిజాం సూచించిన సంస్కరణలను వ్యతిరేకించాయి.
పాములపర్తి నిరంజన్ రావు