Take a fresh look at your lifestyle.

పీవీగారంటేనే ఒక కౌస్తుభం ! ఎన్ని రత్నాలైతే దానికి సమం?

  • పాఠశాల విద్యార్థి దశ నుండే ప్రకాశించిన సకలరంగ జ్ఞాన విన్యాసం
  • శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి,  పాములపర్తి నిరంజన్‌ ‌రావు

నిన్నటి సంచిక తరువాయి ( Read here )
ఆ రోజుల్లోనే తెలంగాణాలో ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ప్రాచుర్యం పొందింది. దేవులపల్లి రామానుజ రావు ఽశోభ’’ అనే పత్రికను నడిపారు. వరంగల్‌లో 1942 ప్రాంతంలో పాములపర్తి సదాశివరావు మార్గదర్శకత్వంలో పట్టణ వ్యాపార పెద్దల సహకారంతో శ్రీ రాయపరాజు వెంకట్రామారావు గారి అధ్యక్షతన ‘కాకతీయ కళా సమితి’ని నెలకొల్పి ప్రతి యేడూ త్యాగరాజ మహోత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించేవారు. దక్షిణ భారత శాస్త్రీయ సంగీత ప్రముఖుల(ద్వారం వెంకటస్వామి నాయుడు, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, దంతాలపల్లి పురుషోత్తమ శాస్త్రి మొదలగు వారి) సంగీత సమ్మేళనాల్ని నిర్వహించడమే కాకుండా నాటికలు, వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, స్త్రీలకు చర్చా కార్యక్రమాలు, కవి, కథక సమ్మేళనం లాంటివి నిర్వహించే వారు. ఆ మూడు రోజులు వరంగల్‌ ‌ప్రజలకు ఒక పండుగ వాతావరణం వుండేదని అంటారు. ఆ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కవి సమ్మేళనానికి పీవీ అధ్యక్షత వహించిన సందర్భాలు కూడా వున్నాయి. 1943 నుండి 1958 దాకా సుమారు 15 సంవత్సరాలు నిర్విఘ్నంగా పనిచేసిన కాకతీయ కళా సమితి తరువాత కనుమరుగైంది.

శ్రీ కొండబత్తిని జగదీశ్వరరావు గారి మాటల్లో..‘‘కాకతీయ కళా సమితి కార్యక్రమాల్లో శ్రీ పీవీ గారు కూడా అప్పుడప్పుడూ పాల్గొనేవారు. పీవీ గారు తబలా వాయిస్తే, సదాశివరావుగారు హార్మోనియంపై అరుదైన రాగాల గమకాల్ని తమ గొంతుతో చూపించేవారు. ఆ దృశ్యం ఎంతో కమనీయంగా వుండేది’’. ..అదే సమయంలో రచనా వ్యాసంగంలో కూడా ఉత్సుకత వుండటం వల్ల 1945లో సదాశివరావు గారు వారం వారం ‘కాకతీయ సారస్వత సంకలనం’ పేరుతో నాలుగు పేజీల కరపత్రంలాంటి పత్రికను తీసేవారు. ఇందులో వీరికి అడవాల సత్యనారాయణ రావు గారి తోడ్పాటు వుండేది. ఆ సంకలనాలలో పీవీ పలు రచనలు చేశాడు. పీవీ రాసిన ‘మానాపమానాలు’ అనే నవల కూడా అందులో ముద్రింపబడింది. ఆ విధంగా పీవీ రచనలు మొదటి సారిగా ముద్రింప బడటం జరిగింది.

ఒక ‘గురువు’.. ‘లఘువులు’ కాని శిష్యులు ముగ్గురు
గార్లపాటి రాఘవరెడ్డి గారు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత భాషల్లో పాండిత్యము కలిగిన గొప్ప తాత్త్విక కవి. నిరాడంబరంగా ఆర్య సమాజ ‘ఆశ్రమం లో తన జీవనం గడిపి 1966 లో పరమపదించారు.
అహంకార రహిత సహజ సామాన్యత పరిఢవిల్లినఆత్మనివేదనను వేణుగోపాలకుడికి ఛందోమయంగా అతి మనోహరంగా నివేదించిన ఆయన ‘పరిదేవనము’ ఒక గొప్ప శతక కావ్యము. వీరి ఇతర రచనలు సావిత్రి(ఖండ కావ్యం), రతి విలాపం(ఖండ కావ్యం), గోపికా వల్లభ(అసంపూర్ణ శతకము). ఆను నిత్యం సత్యాన్వేషణ తప్ప యేమాత్రం కీర్తి కండూతి, ప్రచార పటాటోపం లేని ఆయన రచనలు, కావ్యాలు అముద్రితాలుగానే మిగిలిపోయాయి. అలనాటి కాకతీయ పత్రికలో (1947 -1956) ఆయన అనేక రచనలు ప్రచురిత మయ్యాయి. కానీ పుస్తక రూపాన ప్రచురితం కాకపోవడం చింతించ వలసిన విషయం.
1945 ప్రాంతాల్లో వరంగల్వచ్చిన ‘‘కవిసామ్రాట్‌’’ ‌శ్రీవిశ్వనాధ సత్యనారాయణగారిని కాళోజీగారి ఇంట్లో కాళోజీ గారి ప్రోద్బలంతో రాఘవరెడ్డిగారు కలవడం జరిగింది. విశ్వనాథవారు అడిగినంతనే రాఘవరెడ్డిగారు తమ ‘పరిదేవనము’ కావ్యం నుండి ఒక పద్యం చదివారు. మొదటి పద్యానికి చకితులైన విశ్వనాథవారు రెండవ పద్యానికి ఆనందంతో రాఘవరెడ్డిగారి ప్రక్కకు చేరారు. ఇక ముచ్చటగా మూడవపద్యం చదవగానే రాఘవరెడ్డిగారిని కౌగలించుకొని ‘ఇక్కడ ఇంత మంచి కవులున్నారా!’ అని ఆనందాశృవులు తెచ్చుకున్నారట. అంతటి కవిరాజు విశ్వనాథవారు మెచ్చిన నిజమైన నిరాడంబర మూడు(తెలుగు, సంస్కృతం. హిందీ) భాషల కవి రాఘవరెడ్డిగారు ! ఇంతటి గొప్ప పండితుడిని ‘గురువు’గా కలిగిన అ ముగ్గురు ప్రియ శిష్యుల గురించి పేర్కొంటే రాఘవరెడ్డి గారి పాండిత్య ప్రతిభ యేమిటో మనకు తెలుస్తుంది. ఆ ముగ్గురూ మహా మహులే! లబ్ధ ప్రతిష్టులే!! తమ తమ రంగాలలో పేరెన్నిక గల వారే!!!మొదటి వారు… ఆయనకు అత్యంత ప్రియ శిష్యుడు శ్రీ కాళోజీ నారాయణ రావు గారు. ప్రజా క్షేత్రంలో తిరుగుతూ ప్రజల బాధల కన్నీటి గుర్తులను తన గొడవలుగా వినిపించి అన్యాయాన్ని ఎదిరించిన ‘కన్నీటి కవి’.

రెండవ వారు.. మహా మేధావి, సాహిత్య దురంధరుడు, రాజకీయ చాణక్యుడు, పూర్వ ప్రధాన మంత్రి – శ్రీ పీ వీ నరసింహా రావు గారు. ఇక మూడవ వారు.. ప్రఖ్యాత మార్క్సిస్టు తత్త్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి సదాశివరావు గారు. ‘‘లఘువులు’’ కాని ఇంతటి విశిష్ఠ శిష్యులను కలిగిన ఆ ‘రాఘవుడు’ నిజమైన గురువుకు నిర్వచనం! ఐతే విచిత్రమేమిటంటే ఆ ముగ్గురు శిష్యులవీ మూడు భిన్న సిద్ధాంతాలు.. మూడు విభిన్న దృక్పథాలు.. మూడు వైవిధ్య జీవన విధానాలు.. ఐనా ఆ ముగ్గురి మధ్య కొనసాగింది స్వార్థ బుద్ధిలేని కల్మష రాహిత్య ముత్యాల చెలిమీ, పగడాల మైత్రీ ! దానికి కారణం ఆ గురుడి ఆలోచనా తరంగాల ప్రసరణ ప్రభావమంటే అతిశయోక్తి లేదు. పీవీ గారు రాసిన ‘ఇన్‌ ‌సైడర్‌’ ‌గ్రంథం ముందు మాటలో గార్లపాటి రాఘవరెడ్డి గారి పేరు, పాములపర్తి సదాశివరావు గారి పేరు పేర్కొనడం జరిగింది. ప్రఖ్యాత హిందీ కవయిత్రి ‘మహా దేవి వర్మ ‘ ప్రభావం ఆయనపై ఎంతైనా వుంది. పీవీకి మహా దేవి వర్మ కవితలపై ఆసక్తి కలిగించిన వారిద్దరు. ఒకరు గార్లపాటి రాఘవరెడ్డి గారైతే మరొకరు కాళోజీ రామేశ్వరరావు గారు. వీరు కాళోజీ నారాయణ రావు గారికి అన్నగారు మరియు ప్రఖ్యాత ఉర్దూ కవి. ఈ పెద కాళోజీ గారు ‘షాద్‌ ‌కవి’ గా పేర్గాంచినారు.

పీవీ సాహిత్యావలోకనం, భావ ప్రకటనలను ఇనుమడింప జేసిన గురు రాఘవుడు
1945లో పీవీ మొదటిసారిగా గార్లపాటి రాఘవరెడ్డి గారిని కలిసారు. ప్రఖ్యాత ఆంగ్ల కవి ‘థామస్‌ ‌గ్రే’ రాసిన కవిత్వం ‘ఎలిజీ’ని పీవీ తెలుగు లోకి అనువాదం చేశాడు. దాన్ని మిత్రుడు సదాశివుడికి వినిపింపగా గార్లపాటి రాఘవరెడ్డి గారు అదివరకే దానిని తెలుగులోకి అనువదించారని మిత్రుడు చెప్పగా ఇద్దరూ కలసి రాఘవరెడ్ది గారుండే ఆశ్రమానికి పోయి ఆయన్ను కలిసారు. ఆ విధంగా రాఘవరెడ్డి గారితో పరిచయం జరిగింది. రెడ్డిగారూ, పీవీ ఇద్దరూ తమ అనువాదాలను పరస్పరం చదివి వినిపించుకున్నారు. ఈ పరిచయం మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరిగి పీవీ రాఘవరెడ్డి గారి శిష్యుడయ్యాడు. అంతకు ముందే రాఘవరెడ్డి ప్రియ శిష్యుడు కాళోజీ నారాయణ రావు. ఆయనకు తోడుగా పీవీ, సదాశివరావులు శిష్యరికం చేసిన గురువు రాఘవరెడ్డి గారు. వీరిద్దరు రాజకీయ ఆలోచనా విధానం తప్పిస్తే సాహిత్యమైనా, సంగీతమైనా ఆస్వాదించడమే కాకుండా వాటిపై సమగ్ర విశ్లేషణను చేసే సామర్థ్యత కలిగిన జంట మేధావులు. ఈ విషయాన్ని ఆనాడే తెలుసుకున్న ఆ గురు రాఘవుడు వారిని ‘జయ- విజయులు’గా సంబోధించే వారు. క్రమేణా ఆ పేర్లే సార్థక నామధేయాలుగా మారాయంటారు. అలనాటి ‘కాకతీయ పత్రిక’లో పీవీ గారు రాసిన ‘గొల్ల రామవ్వ’ కథ రచయిత ‘విజయ’ పేరుతో ప్రచురితమైంది. వీరిద్దరూ రాఘవరెడ్ది గారిని ‘గురు’ అని సంబోధించేవారు.

- Advertisement -

పీవీ తరచూ ఆశ్రమానికి పోయి రాఘవరెడ్డిగారితో కాలక్షేపం చేయడం మొదలు పెట్టాడు. రాఘవరెడ్డిగారికి తిరుపతి వెంకట కవుల, ప్రబంధకవుల, శతక కవుల వందలాది పద్యాలు కంఠస్థం. ఉభయుల మధ్య తిరుపతి వెంకటకవుల పద్యాలు, వెంకట పార్వతీశ్వర కవులు, దువ్వూరి రామిరెడ్డి, గుఱ్ఱం జాషువా, రాయప్రోలు సుబ్బారావు మున్నగు వారి కావ్యశిల్పంపై ఇష్టాగోష్టి సాగేది. అంతేకాదు రాఘవరెడ్డిగారు మను చరిత్ర, నైషధం లాంటి ప్రబంధాలు, కాళిదాసు, భవభూతి లాంటి కవుల శైలీ విన్యాసంపై పీవీకి ఆసక్తి కలిగించారు. పీవీ కూడా గురువుగారికి వర్డ్సువర్తు, షెల్లీ, కీట్స్, ‌బైరన్‌ ‌కవితలు, షేక్సుపియర్‌ ‌నాటకాలు, థాకరే, హార్డీ, డికెన్సు నవలల పరిచయం చేసాడు. ఈ ఇరువురి కలయిక ‘‘ప్రాచీనత – ఆధునికత ‘‘సమ్మిశ్రితమై ఇద్దరిలో నూసమంగా పెంపొందినట్లు తెలుస్తుంది. అందుకు ఉదాహరణగా రాఘవరెడ్డిగారు భావగీతాలు, పీవీగారు శృంగార గీతాలు రచించడం లాంటి ప్రయోగాలు..

1946లో రాఘవరెడ్డి గారి ‘పరిదేవనం’ కావ్యం ప్రచురితమైంది. గురువు గారికి తెలియకుండానే శిష్యుడు సదాశివుడు ప్రచురించడమే కాకుండా అందులో గురు కావ్యరచనకు ‘శిష్య పీఠిక’ గూర్చాడు. ఆ శిష్య పీఠిక ఇలా మొదలవుతుంది : ‘‘శ్రీ కాళోజీ ప్రియ శిష్యుడు, శ్రీ గార్లపాటి గురువుగారు. మా జయ విజయులము వీరిని గురువు గారని సంబోధించుట యాదృచ్ఛికంగా జరిగియున్నను రాను రాను సార్థక సంబోధన యగుచు వచ్చుచున్నది. పిన్నల గ్రంథములకు పెద్దలు పీఠిక వ్రాయుట యాచారం. కానీ ఇట శిష్యుడే గురుని గ్రంథమునకు పీఠిక వ్రాయుచున్నాడు…..’’ ‘‘భారతీయ సాహిత్య సాంప్రదాయాన్ని చదవడానికి నన్ను అమితంగా ప్రోత్సహించడమే కాకుండా స్వతంత్రంగా భావ వ్యక్తీకరణ చేయడానికి నాలో తపన పెంపొందించిన నా సాహిత్య గురువు, దివంగత శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి గారికి నేను కృతజ్ఞున్ని’’ అని శ్రీ పీవీ గారే ఆయన ఆత్మకథలాంటి నవల ‘ది ఇన్‌ ‌సైడర్‌’ (•ష్ట్ర‌వ ×అఱ•వతీ) లో పేర్కొన్నారు.

కాళోజీ గారొక చోట యీ విధంగా అన్నారు : ‘‘గురువు గారు రాఘవరెడ్డి గారూ, రామేశ్వరరావు గారూ, పాములపర్తి సదాశివుడూ, పీవీ కలిసి హిందీ కవితలు చదువుకొని వినిపించి చర్చించే వారు. ఆ చర్చల ఫలితమే రాఘవరెడ్డి గారు చేసిన మహాదేవి వర్మ అనువాదాలు, నందలాల్‌ ‌రచించిన ‘ఉద్ధవుడు..గోపికలు’ సంవాదానికి పీవీ అనువాదం’’.గంటల తరబడి సాగే వీరి సాహిత్య దర్బారుకు వేదిక…మట్టెవాడలోని ఫైర్‌ ‌స్టేషన్‌ ‌ప్రక్కగా సాగే ఆ చిన్న సందులోని సదాశివరావు ఇంటి పైన గల చిన్న మేడ గది. దాని ముద్దు పేరు బంగ్లా గది. ఈ లోగా పీవీ హిందీ ‘సాహిత్య రత్న’ పూర్తిచేసాడు. మహాదేవి వర్మ కవితలపై సుదీర్ఘ సమీక్షలను రాసేవాడు, హిందీ సాహిత్యం నుండి అనేక రచనలను తెలుగులోకి అనువదించడం లాంటి వ్యాపకం పెట్టుకున్నాడు. ఇది బహుషా గురు రాఘవుడి ప్రోద్బలమేమో?
ఈ నేపథ్యంలో ‘కాకతీయ పత్రిక’ను ఒక వార పత్రికగా 1948లో ప్రారంభించారు. కాకతీయ పత్రిక ముద్రణాలయం, కార్యాలయం సదాశివరావు ఇంటి ముందు భాగంలోని గదుల్లో వుండేవి. పైన వున్న బంగ్లా రూంలో సదాశివరావు.

ఆయన రచనా వ్యాసంగం, ఇతర మిత్ర బృందంతో చర్చా గోష్టులు. నెలలో 5 లేదా 6 సార్లు పీవీ గారి రాక. వచ్చినప్పుడు ఒకటో రెండు రోజులో మకాం, గార్లపాటి గారు, కాళోజీ సోదరులు వారానికొకసారి. దినమంతా అక్కడే! ఎప్పుడూ సాహిత్య చర్చలూ, ఇతర వ్యాసాంగాలతో కళకళ లాడింది ఆ మేడ గది, 1955 దశకపు అర్ధభాగం దాకా ఈ సాహిత్య సమ్మేళనాలు జరిగేవి. అప్పుడప్పుడూ అనుముల కృష్ణమూర్తి, పల్లా రామకోటార్య, హరి రాధాకృష్ణమూర్తి లాంటి పండితులు కూడా పాల్గొనేవారు. కొన్ని వందల సార్లు ఆ గురు రాఘవుని సాంగత్యంలో జరిగిన ఆ సాహిత్య విమర్శనాత్మక చర్చాగోష్టులు అసలే మేలు రత్నం లాంటి పీవీ గారి మేధస్సుకు మరింత పదును పెట్టాయంటే అతిశయోక్తి లేదు.

విద్యార్ఠి దశలో అంకురించిన సుస్ఫష్టభావ వ్యక్తీకరణం, విలక్షణ ఆలోచనా ధోరణి మొదలగు సుగుణాలు ఆయనలో ఇనుమడించడం జరిగింది గురురాఘవుడి మార్గదర్శకత్వంలో అప్పుడే..అక్కడే! ఒక విధంగా చెప్పాలంటే పీవీ గారి జీవన మధురిమలు వారు వరంగల్‌లో గడిపిన బాల్య విద్యార్థి దశా, ఆ తర్వాతి కాలంలో ఆయన ఆపుడప్పుడూ వచ్చి నెలలో పదిహేను రోజులైనా గడిపిన ఆ కాకతీయ పత్రిక ప్రచురణల సమయం కావచ్చు. ఇందుకు కారణం ఆయన అమితంగా యిష్టపడే సాహిత్య సంగీత రంగాల మిత్రులతో సాగించిన సమ్మేళనాలు- రాజకీయ వాసనలు లేని మిత్ర బృందం నిష్కల్మష వ్యవహారతీరు. ఆమహనీయులందరికీ మా నమస్సుమాంజలులు.

Leave a Reply