Take a fresh look at your lifestyle.

పి.వి. నరసింహరావు దార్శినికతకు నిదర్శనం ‘లుక్‌ ఈస్ట్ ‌పాలసి’

“భారతదేశపు ‘లుక్‌ ఈస్ట్’ ‌విధానం కేవలం దౌత్యపరమైన సానుకూల ఫలితాల సాధనే కాదు, ఈ ప్రాంతంతో పెరుగుతున్న ఆర్థికాభివృధికి నిదర్శనం. ఆసియాన్తో భారతదేశం యొక్క వాణిజ్యం 1990 లో 2.4 బిలియన్‌ ‌డాలర్ల నుండి 2005 లో 23 బిలియన్‌ ‌డాలర్లకు పెరిగింది.  2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఆసియాన్‌ ‌దేశాలతో 47.13 బిలియన్‌ ‌డాలర్ల వాణిజ్యం జరగగా, 2018-19లో 59.32 బిలియన్‌ ‌డాలర్లకు పెరిగింది. ఇది మనదేశ విదేశీ వాణిజ్యంలో దాదాపు  25.86 శాతం వాటా ఉంది. అదే సమయంలో భారతదేశం నుండి ఈ ప్రాంతానికి ఎఫ్డిఐ ప్రవాహాలు కూడా పెరిగాయి.  ‘లుక్‌ ఈస్ట్’ ‌విధానం ఆగ్నేయాసియా, పసిఫిక్‌ ‌దేశాలతో భారతదేశం యొక్క రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసింది.”

భారతదేశ విదేశాంగ విధానంలో కీలకమైన ముందడుగు లుక్‌ ఈస్ట్ ‌పాలసి. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో రూపుదిద్దుకున్న ఈ ‘‘తూర్పువైపుకు చూసే’’ విధానం తరువాతి కాలంలో ఆగ్నేయాసియా దేశాలతో భారతదేశ దౌత్యసంబంధాలలో గణనీయ మార్పుకు నాంది పలికింది. ఈ విధాన ప్రధాన ఉద్ధేశం తూర్పున ఉన్న పొరుగు దేశాలతో ప్రగాఢమైన సాంస్కృతిక సంబంధాలు పెంపొందించుకోవడంతో పాటు ఆర్థిక సమగ్రతను సాధించడం. లుక్‌ ఈస్ట్ ‌విధానంలో భాగంగా ఆసియాన్‌ ‌యొక్క సంస్థాగత విధానాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం భాగస్వామ్యాన్ని కోరుకుంది. భారతదేశంలో 1991 ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన మలుపుగా చెప్పవచ్చు. తూర్పు దేశాలతో సానుకూల ఆర్థిక దౌత్య విధానాలకు ఊతమిచ్చిన ఈ సంస్కరణలు కాలక్రమేణా అనేక లక్ష్యాలను సాధించాయి. ఈశాన్య రాజ్యాలతో తనకున్న అపార్థాలను అంతం చేయడానికి వీలు కల్పించే వాతావరణం కలిపించుకుని, ఈశాన్య ప్రాంతం యొక్క భూభాగపు సరిహద్దులను తెరిచి, మెరుగైన కనెక్టివిటీ ద్వారా ఆ ప్రాంతం ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసుకోవడంలో భారత్‌ ‌విజయవంతమైంది.

ప్రాంతీయ శక్తిగా పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా యొక్క ప్రత్యక్ష ప్రభావానికి గొడ్డలిపెట్టులా మారిన ఈ విధానం 1991 లో ప్రారంభించబడి, ప్రపంచ దృక్పథంపై భారతదేశ వ్యూహాత్మక మార్పుకు ప్రభావ పూరిత మలుపుగా మారింది. 1947 వరకు భారతదేశ పాలకవర్గం తమ వలస సంబంధాల కారణంగా తప్పనిసరిగా పాశ్చాత్య ధోరణిని కలిగి ఉండేది. అంతేకాకుండా 1970 వరకు ఆగ్నేయాసియా ప్రాంతం ఆర్థికంగా లోపభూయిష్టమైన అభివృద్ధితో ఆకర్షణీయంగా లేదు. అదే సమయంలో మయన్మార్‌ ‌ప్రపంచంలోని ఇతర దేశాలతో ఏటువంటి సంబందాలు లేకుండ అసంపర్క విధానాన్ని పాటించగా, తూర్పు పాకిస్తాన్‌ (‌బంగ్లాదేశ్‌ ) ‌రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అనుకూలంగా లేదు. ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో భారత, ఆగ్నేయాసియా దేశాలు చెరోవైపు అనుకూల వైఖరి కలిగి ఉండడం కూడ ఈ రెండు ప్రాంతాల మధ్య దౌత్య సంబందాలు మరుగున పడడానికి కారణమైంది. అటల్‌ ‌బిహారి వాజపేయ్‌, ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ‌కాలంలో నిక్కచ్చిగా అమలు చేయబడిన ఈ దౌత్యవిధానం ప్రస్తుతం నరేంద్ర మోడి ప్రభుత్వం సైతం అనుసరిస్తోంది.

సోవియట్‌ ‌యూనియన్‌ ‌పతనానికి ముందు ఆగ్నేయాసియా ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించడానికి భారతదేశం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 1947 తరువాత పాశ్చాత్య దేశాలు భారత దేశాన్ని తమ వాణిజ్య భాగస్వామిని చేయడంతో, పొరుగుదేశాలతో వర్తక సంబంధాల పట్ల సంభంధాలు నిర్లక్షం చేయబడ్డాయి. 1962 చైనా-ఇండియన్‌ ‌యుద్ధఅనంతరం ఇరుదేశాలు దక్షిణ, తూర్పు ఆసియాలో వ్యూహాత్మక పోటీదారులుగా మారాయి. పాకిస్తాన్‌ ‌తో వాణిజ్య, సైనిక సంబంధాలను పెంపొందించుకున్న చైనా, అదేసమయంలో నేపాల్‌, ‌బంగ్లాదేశ్‌ ‌దేశాల మీద ప్రభావం కోసం పోటీ పడింది. 1979 లో డెంగ్‌ ‌జియావోపింగ్‌ ‌చైనాలో అధికారంలోకి వచ్చిన తరువాత చైనా కొత్త ఆర్థిక సంస్కరణలతో చైనా విస్తరణవాద విధానాన్ని ప్రారంభించి, ఆసియా దేశాలతో విస్తృతమైన వాణిజ్య, ఆర్థిక సంబంధాలను పెంపొందించుకుంది. 1988 లో ప్రజాస్వామ్య అనుకూల కార్యకలాపాలను హింసాత్మకంగా అణచివేసిన తరువాత అంతర్జాతీయ సమాజం నుండి బహిష్కరించబడిన బర్మా సైనిక జుంటాకు చైనా అత్యంత సన్నిహిత మద్దతుదారుగా మారింది. దీనికి విరుద్ధంగా భారతదేశం ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఆగ్నేయాసియాలోని అనేక దేశాలతో అసంపర్క విధానాన్ని పాటించి దౌత్య సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ సమయంలో ఆగ్నేయాసియాతో బలమైన ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకునే ఒక కీలకమైన అవకాశాన్ని భారతదేశం కోల్పోయింది.

1991లో సోవియట్‌ ‌యూనియన్‌ ‌పతనంతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ సంఘటన భారత ప్రభుత్వానికి తన ఆర్థిక, విదేశాంగ విధానంలో సమూలమైన మార్పులకు ప్రేరేపించింది. దీని వలన భారతదేశం తన పొరుగు దేశాలతో సంబంధాల పట్ల కొన్ని రకాల మార్పులకు పూనుకుంది. మొదట, భారతదేశం తన రక్షణవాద ఆర్థిక విధానాన్ని మరింత ఉదారవాదంతో సడలింపు చేసింది. అధిక స్థాయి వాణిజ్యానికి తెరతీసి, ప్రాంతీయ మార్కెట్లను విస్తరించింది. ప్రధాని పి.వి.నరసింహారావు నేతృత్వంలో భారతదేశం దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలను ప్రత్యేక వ్యూహాత్మక వేధికగా చూడకుండా ఇండియాకు సన్నిహిత ప్రాంతాలనే భావనను పెంపొందించింది. భారతదేశ లుక్‌ ఈస్ట్ ‌పాలసీ పెద్దమొత్తంలో మయన్మార్‌ ‌తో అనుసంధానమై ఉంది. ఇది భారతదేశంతో సరిహద్దును పంచుకునే ఏకైక ఆగ్నేయాసియా దేశం మాత్రమే కాకుండా ఆగ్నేయాసియాకు భారతదేశం యొక్క ప్రవేశ ద్వారం వంటింది. 1993 లో మయన్మార్‌ ‌యొక్క ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి భారతదేశం తన మద్దతు ఉపసంహరించుకుని, పాలక సైనిక ప్రభుత్వానికి స్నేహ హస్తం అందించింది. నాటి నుండి భారత ప్రభుత్వం, కొంతవరకు ప్రైవేట్‌ ఇం‌డియన్‌ ‌కార్పొరేషన్లు, రహదారులు, పైపులైన్లు, ఓడరేవుల నిర్మాణంతో సహా పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు లాభదాయకమైన ఒప్పందాలను చేసుకుంది. లుక్‌ ఈస్ట్ ‌విధానం అమలుకు ముందు మయన్మార్‌ ‌లోని విస్తారమైన చమురు, సహజ వాయువు నిల్వలపై చైనా గుత్తాధిపత్యాన్ని ఉండగా, ప్రస్తుతం భారతదేశం కూడ వీటి మీద ఆధిపత్యాన్ని వహించింది. ఒకప్పుడు చైనా మయన్మార్‌ ‌యొక్క అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉండగా, నేడు భారతదేశం మయన్మార్తో సైనిక సహకారాన్ని పెంపొందించుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు దారులను ఎదుర్కోవడంలో ఇరు దేశాల మధ్య సమన్వయాన్ని పెంచే ప్రయత్నంలో మయన్మార్‌ ‌సాయుధ దళాలకు శిక్షణనివ్వడానికి మరియు ఆ దేశంతో మేథో పరమైన విజ్ఞానాన్ని పంచుకోవడానికి భారత్‌ ‌ముందుకు వచ్చింది. అదేసమయంలో చైనా రాఖైన్‌ ‌రాష్ట్రంలోని ఎ-1 ష్వే క్షేత్రంలో 2.88 -3.56 ట్రిలియన్‌ ‌క్యూబిట్లకు పైగా సహజ వాయువును వినియోగించే ఒప్పందాలను పొంది, బర్మా తీరం, కోకో దీవులలో నావికాదళ మరియు నిఘా వ్యవస్థాపనలను అభివృద్ధి చేసింది. ఇక్కడ ఓడరేవు అభివృద్ధి, ఇంధనం, రవాణా, సైనిక రంగాలలో పెట్టుబడులను వేగవంతం చేసిన భారతదేశానికి ఇది ఆందోళన కలిగించే అంశం.

2003 నుండి భారతదేశం ఆసియా దేశాలు, ప్రాంతీయ కూటమిలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఏర్పరచుకునే ప్రచారాన్ని ప్రారంభించింది. బంగ్లాదేశ్‌, ‌భూటాన్‌, ఇం‌డియా, మాల్దీవులు, నేపాల్‌, ‌పాకిస్తాన్‌ ‌మరియు శ్రీలంకలలో 1.6 బిలియన్ల స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాన్ని సృష్టించిన దక్షిణ ఆసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2006 లో అమల్లోకి వచ్చింది. 10 సభ్య దేశాల ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌) ‌మరియు భారతదేశం మధ్య 2010లో స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతమైన ఆసియాన్‌-ఇం‌డియా ఫ్రీ ట్రేడ్‌ ఏరియా (ఐఫ్టా) అమల్లోకి వచ్చింది. అంతేకాకుండా శ్రీలంక, జపాన్‌, ‌దక్షిణ కొరియా, సింగపూర్‌, ‌థాయిలాండ్‌ ‌మరియు మలేషియా దేశాలతో భారతదేశం ప్రత్యేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకుంది.

ఆసియాన్‌, ‌బే ఆఫ్‌ ‌బెంగాల్‌ ఇనిషియేటివ్‌ ‌ఫర్‌ ‌మల్టీ-సెక్టోరల్‌ ‌టెక్నికల్‌ అం‌డ్‌ ఎకనామిక్‌ ‌కోఆపరేషన్‌ (‌బింస్టెక్‌) ‌మరియు సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌రీజినల్‌ ‌కోఆపరేషన్‌ (‌సార్క్) ‌వంటి ఆసియా ప్రాంతీయ సంఘాలతో ఇండియా తన సహకారాన్ని అందించింది. సింగపూర్తో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం, థాయ్లాండ్తో హార్వెస్ట్ ‌పథకం తదితర ఒప్పందాలు చేసుకుని, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వ్యూహాత్మక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తైవాన్‌, ‌జపాన్‌ ‌మరియు దక్షిణ కొరియాతో సంబంధాలు బలపడ్డాయి. ప్రస్తుతం భారతదేశంలో విదేశీ పెట్టుబడుల పెట్టిన ప్రధాన దేశాలలో దక్షిణ కొరియా, జపాన్‌ ‌లు కూడా ఉన్నాయి.

భారతదేశం ‘‘వన్‌ ‌చైనా’’ విధానానికి మద్ధతు పలికి, తైవాన్పై రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా సార్వభౌమత్వాన్ని గుర్తిస్తూనే తైవాన్తో సంబంధాలు పెంపొందించుకునే విధానాన్ని అనుసరించింది. ఉగ్రవాద నిరోధకత, మానవ విలువల అభివృద్ది, సముద్ర మరియు ఇంధన భద్రతలలో భాగస్వామై., చైనా వంటి శక్తుల ప్రభావాన్ని తూర్పు ఆసియాలో తగ్గించి సమతుల్య స్థితిని ఇండియా కొనసాగిస్తోంది. భారతదేశ వాణిజ్యంలో 50 శాతం కంటే ఎక్కువ మలాకా జలసంధి గుండా వెళుతుండటం వలన భారత నావికాదళం అండమాన్‌ ‌మరియు నికోబార్‌ ‌దీవులలోని పోర్ట్ ‌బ్లెయిర్‌ ‌లో ఫార్‌ ఈస్టర్న్ ‌నావల్‌ ‌కమాండ్‌ ‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం 1993 నుండి సింగపూర్‌ (‌సింబెక్స్) ‌తో, 2000 లో వియత్నాంతో ఉమ్మడి నావికాదళ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా 2002 నుండి అండమాన్‌ ‌సముద్రం ప్రాంతంలో ఇండోనేషియాతో కలిసి సంయుక్త పెట్రోలింగ్లో పాల్గొంటోంది. ఆస్ట్రేలియా, యునైటెడ్‌ ‌స్టేట్స్తో పాటు జపాన్‌ ‌మరియు భారతదేశం కూడా 2004లో హిందూ మహాసముద్రం సునామీ రిలీఫ్‌ ‌రీజినల్‌ ‌కోర్‌ ‌గ్రూపులో సభ్యులయ్యాయి.

మెకాంగ్‌-‌గంగా సహకారాభివృద్ది, బింస్టెక్‌ ‌వంటి బహుళ పక్ష ఒప్పందాలతో పర్యావరణం, ఆర్థికాభివృద్ధి, భద్రత మరియు వ్యూహాత్మక వ్యవహారాలపై విస్తృతమైన సహకారాన్ని ఏర్పరచుకోవడంతో ఇండియా వ్యూహాత్మకంగా పావులు కదిపి, దక్షిణాసియాలో పాకిస్తాన్‌, ‌చైనా లతో ఉద్రిక్తత పరిస్థితులకు తెరదించే ప్రయత్నం చేస్తోంది. 1992 లో భారతదేశం ఆసియాన్తో సంభాషణ భాగస్వామిగా మారడమే గాక 1995 లో చైనా , జపాన్‌, ‌కొరియాలతో సమానంగా ఆసియాన్‌ ‌ప్రాంతీయ ఫోరంలోని ఆసియా-పసిఫిక్లోని భద్రతా సహకార మండలిలో భారతదేశం సభ్యత్వ హోదా పొందింది. 2002 లో న్యూఢిల్లీలో మొట్టమొదటి ఇండియా-ఆసియాన్‌ ‌బిజినెస్‌ ‌సమ్మిట్‌ ‌జరిగింది. 2003 లో ఆగ్నేయాసియాలో ఆసియాన్‌ ‌యొక్క అమిటీ అండ్‌ ‌కోఆపరేషన్‌ ఒప్పందానికి భారతదేశం అంగీకరించింది.

చైనా ఆధిపత్యం ఉన్న ఆసియాన్‌ ం3 ‌ప్రక్రియను బలహీన పరచడానికి జపాన్‌ ‌భారతదేశాన్ని ఆసియాన్‌ ం6 ‌లోకి ఆహ్వానించింది. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో భారత్ను భాగస్వామిని చేయడంలో సింగపూర్‌ ఇం‌డోనేషియాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఆసియా-పసిఫిక్‌ ఎకనామిక్‌ ‌కోఆపరేషన్‌ (అపెక్‌) ‌లో భారతదేశం సభ్యత్వం కోసం అమెరికా మరియు జపాన్‌ ‌కూడా గట్టి ప్రయత్నం చేశాయి. భారతదేశాన్ని తూర్పుఆసియాతో సత్సంబంధాన్ని ఏర్పరచడంలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు స్థాపించబడ్డాయి. ఆసియా, పసిఫిక్‌ ‌ప్రాంతాల అభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సాంఘీక మండలి ఆసియా హైవే నెట్వర్క్ ‌మరియు ట్రాన్స్-ఏషియన్‌ ‌రైల్వే నెట్వర్క్ ‌కోసం చేపట్టిన కార్యక్రమాలలో భారత్‌ ‌పాల్గొంటోంది. భారతదేశంలోని అస్సాం రాష్ట్రాన్ని చైనా యొక్క యునాన్‌ ‌ప్రావిన్స్తో మయాన్మార్‌ ‌గుండా అనుసంధానించే రెండవ ప్రపంచ యుద్ధం నాటి స్టిల్వెల్‌ ‌రహదారిని తిరిగి తెరవడంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాలతో గత పది సంవత్సరాలుగా భారతదేశం రక్షణ రంగంలో తన సంబంధాలను క్రమంగా విస్తరించుకుని., ఆసియాన్‌ ‌రీజినల్‌ ‌ఫోరం వంటి సంస్థలతో ప్రాంతీయ విశ్వాసం కలిగి ఉండడం, విభిన్న రంగాలలో సహకారం పొందడం ద్వారా భారతదేశం తన రక్షణ వ్యవస్థను బలపర్చుకుంది. ఆసియాన్‌ ‌దేశాలతో పాటు జపాన్‌, ‌దక్షిణ కొరియాలతో రక్షణపరమైన ఒప్పందాలు చేసుకుంది. ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల అనంతరం తీర ప్రాంత రక్షణకు సముద్ర తీరప్రాంతం మీద గస్తీ, పెట్రోలింగ్‌ ‌వంటి రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నేటి భారతదేశం 1991 నాటి భారతదేశానికి చాలా భిన్నంగా ఉంది. ఇది ఇప్పుడు ఒక శక్తివంతమైన మార్కెట్‌. ‌మన పారిశ్రామికవేత్తలు విదేశాలలో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెడుతున్నారు. భారతదేశం ఉత్పాదక మరియు లాభదాయక పెట్టుబడులకు గమ్యస్థానంగా అవతరించింది. దాదాపు మూడు ట్రిలియన్‌ ‌డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో, ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థతో ప్రతి సంవత్సరం 7-8 శాతం సగటు వృద్దిరేటు సాధిస్తోంది. పి.వి.నరసింహారావు ప్రారంభించిన లుక్‌ ఈస్ట్ ‌పాలసీ విధానం 2014 లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే వరకు కొనసాగింది. ఈ విధానానికి కొనసాగింపుగా నవంబర్‌ 2014 ‌లో మయన్మార్లో జరిగిన ఈస్ట్ ఆసియా సమ్మిట్లో ఆర్థికాభివృద్ధి, భద్రతా, సమైక్యత వంటి అంశాలే ఆలంభనలుగా సౌత్‌ ఈస్ట్ ఆసియా,తూర్పు ఆసియాలతో సంబంధాల మెరుగుకై ‘‘యాక్ట్ ఈస్ట్ ‌పాలసీ’’ ప్రారంభించబడింది. ఆసియాన్‌ ‌ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావానికి అడ్డుకట్టవేస్తూ ఇండియా, ఆసియాన్‌ ‌ల మధ్య 2016-17లో 71.6 బిలియన్‌ ‌డాలర్ల వాణిజ్యం జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 34.20 బిలియన్‌ ‌డాలర్ల ఎగుమతులను ఆసియాన్‌ ‌దేశాలతో చేసిన ఇండియా, 2018-19లో 37.47 బిలియన్‌ ‌డాలరుల ఎగుమతులను చేసింది. ఇందులో ఒక్క సింగపూర్‌ ‌కే 9.57 బిలయన్‌ ‌డాలర్ల ఎగుమతులు చేసింది. 2016-20 కాలానికి సంబంధించిన రాజకీయ-భద్రత, ఆర్థిక మరియు సామాజిక-సాంస్కృతిక రంగాల అభివృద్ధియే లక్ష్యంగా 2015 ఆగస్టులో ఆసియాన్‌-ఇం‌డియా ప్రణాళిక ఆమోదించబడింది.

భారతదేశపు ‘లుక్‌ ఈస్ట్’ ‌విధానం కేవలం దౌత్యపరమైన సానుకూల ఫలితాల సాధనే కాదు, ఈ ప్రాంతంతో పెరుగుతున్న ఆర్థికాభివృధికి నిదర్శనం. ఆసియాన్తో భారతదేశం యొక్క వాణిజ్యం 1990 లో 2.4 బిలియన్‌ ‌డాలర్ల నుండి 2005 లో 23 బిలియన్‌ ‌డాలర్లకు పెరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఆసియాన్‌ ‌దేశాలతో 47.13 బిలియన్‌ ‌డాలర్ల వాణిజ్యం జరగగా, 2018-19లో 59.32 బిలియన్‌ ‌డాలర్లకు పెరిగింది. ఇది మనదేశ విదేశీ వాణిజ్యంలో దాదాపు 25.86 శాతం వాటా ఉంది. అదే సమయంలో భారతదేశం నుండి ఈ ప్రాంతానికి ఎఫ్డిఐ ప్రవాహాలు కూడా పెరిగాయి. ‘లుక్‌ ఈస్ట్’ ‌విధానం ఆగ్నేయాసియా, పసిఫిక్‌ ‌దేశాలతో భారతదేశం యొక్క రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసింది. అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆర్థికనిర్మాణంలో, భద్రతలో భారతదేశాన్ని ఒక కీలక భాగస్వామిగా చేసింది. భారతదేశం యొక్క విదేశీ వాణిజ్యంలో దాదాపు 45% దక్షిణ మరియు తూర్పు ఆసియా దేశాలతోనే జరుగుతోంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉండి, తన లక్ష్య సాధనలో విజయవంతమైన ‘లుక్‌ ఈస్ట్ ‘ ‌పాలసి ఒక దార్శినికుడి రాజనీతిజ్ఞతకు నిఖార్సైన ఉదాహరణ.

jayaprakash ankam
జయప్రకాశ్‌ అం‌కం

Leave a Reply