Take a fresh look at your lifestyle.

ఘనంగా పివి శతజయంతి ముగింపు వేడుకలు

  • పివి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌
  • ‌నెక్లెస్‌ ‌రోడ్డుకు పివి మార్గ్‌గా నామకరణం..నామఫలకం ఆవిష్కరణ
  • ఆయన సంస్కరణల భిక్షనే నేటి రాష్ట్రాల బడ్జెట్‌
  • ఆయన సంస్కరణల వల్లనే యువతకు ఉద్యోగ ఉపాధి
  • పివి భూసంస్కరణలు దేశానికి ఆదర్శం
  • పివి ఎప్పటికీ తెలంగాణ ఠీవీ అంటూ ప్రస్తుతించిన సిఎం కెసిఆర్‌
  • ఆర్థిక సంస్కరణల మార్గదర్శి పివి : ట్విట్టర్‌ ‌వేదికగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళి
  • తపాలా బిళ్లను విడుదల చేస్తాం : పివి ఘాట్‌ ‌వద్ద నివాళి అర్పించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి
  • తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పివి : ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి హరీష్‌ ‌నివాళి
  • దేశాన్ని అభివృద్ది బాటలో నడిపిని పివి : ట్వీట్టర్‌ ‌వేదికగా కెటిఆర్‌ ‌నివాళి

భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు సుసంపన్నం అయ్యాయి. ఏడాది పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించు కోవడంతో పాటు.. ఆయన విగ్రహాన్ని జయంతి రోజు సోమవారం గవర్నర్‌ ‌తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి గవర్నర్‌, ‌సీఎం కేసీఆర్‌ ‌ఘన నివాళులర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్‌ను గవర్నర్‌ ‌ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీవీ కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్‌ ‌రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళసై సౌందర్య రాజన్‌, ‌సిఎం కెసిఆర్‌లు పివికి ఘనంగా నివాళి అర్పించడంతో పాటు ఆయన పాలన సంస్కరణలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌మాట్లాడుతూ మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువేనని అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖరం. పరిపూర్ణమైన సంస్కరణ శీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కొరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నప్పటికీ..గతేడాది కాలంలో కేకే ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని అభినందించారు. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన మహేశ్‌ ‌బిగాలకు సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. పివి ఎప్పటికీ తెలంగాణ ఠీవీ అని సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించారు. పివి నరసింహారావు ఎక్కడ ఎలాంటి అవకాశం వొచ్చినా దానిని సద్వినియోగం చేసుకుని సంస్కరణలు అమలు చేశారని అన్నారు.

విద్యా సంస్కరణల్లో భాగంగా గురుకుల, నవోదయ పాఠశాలలను పీవీ నరసింహారావు తీసుకొచ్చారని సీఎం కేసీఆర్‌ ‌గుర్తు చేశారు..పీవీ ప్రారంభించిన గురుకుల పాఠశాలలోనే చదివి డీజీపీని కాగలిగానని మహేందర్‌ ‌రెడ్డి స్మరిస్తూంటారని గుర్తు చేశారు. ఇలా ఎంతో మంది పీవీని స్మరించుకుంటారని సీఎం పేర్కొన్నారు. పీవీ తీసుకొచ్చిన అనేక సంస్కరణలు మన కళ్ల ముందు ఉన్నాయని కేసీఆర్‌ ‌తెలిపారు. పీవీ చేపట్టిన భూ సంస్కరణలు భారతదేశంలో ఇతర రాష్ట్రాలు మార్గదర్శకంగా తీసుకున్నాయి. పీవీ 800 ఎకరాల విలువైన సొంత భూమిని ప్రజలకు ధారదాత్తం చేశారు. ఆ విధంగా తన నిబద్ధతను చాటుకుంటూ భూ సంస్కరణలను అమలు చేశారన్నారు. ఇది ఆషామాషీ విషయం కాదని గుర్తు చేశారు. పివిని స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా కాకతీయ వర్సిటీలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్‌ ‌పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తున్నదని పేర్కొన్నారు. పీవీ అనేక పుస్తకాలు రచించారు. అనేక రచనలను ఆయన అధ్యయనం చేశారు.

స్వాతంత్య్రానికి పూర్వం వారు జన్మించినప్పటికీ స్వాతంత్య పోరాటంలో పాలు పంచుకున్నారని సీఎం కెసిఆర్‌ ‌గుర్తు చేశారు. దేశం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో.. పీవీ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. నాటి ఆర్థిక సంస్కరణ వల్లే నేడు పెట్టుబడులు వొస్తున్నాయి. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్రాల బ్జడెట్‌ ‌లక్షల కోట్లకు చేరిందన్నారు. మన్మోహన్‌ ‌సింగ్‌ ‌పీవీని ప్రశంసించేవారు. పీవీని గురువు, తండ్రిలాగా స్మరించుకునేవారని గుర్తు చేశారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఆర్థిక మంత్రిగా ఉండటం గర్వంగా ఫీలవుతానని మన్మోహన్‌ ‌సింగ్‌ అనేవారని సీఎం కెసిఆర్‌ ‌గుర్తు చేశారు. పివీ మన తెలంగాణ ఠీవీ అని గతేడాదే తాను చెప్పానని సీఎం కేసీఆర్‌ అన్నారు. సోమవారం ఆవిష్కరించిన పీవీ విగ్రహాన్ని చూస్తుంటే కడుపు నిండిపోయిందని సీఎం అన్నారు. ఈ రహదారికి పీవీ మార్గ్ అని నామకరణం చేయడం సంతోషంగా ఉన్నది. భవిష్యత్‌లో అనేక పథకాలకు పీవీ పేరు పెట్టుకుంటామని చెప్పారు. పీవీ కుమార్తె సురభి వాణిదేవీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుతంగా గెలిపించారు. వాణిదేవీని గెలిపించిన వోటర్లందరికీ సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళసై, కె. కేశవరావు, సురభి వాణీదేవి, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సంస్కరణల మార్గదర్శి పివి: ట్విట్టర్‌ ‌వేదికగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళి
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అని, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలికి నివాళులర్పిస్తున్నానని ట్వీట్‌ ‌చేశారు. స్వావలంబన, స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారని, తద్వారా దేశ భవిష్యత్తుకు బాటలు పరిచారని పేర్కొన్నారు. మాతృభాషకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారని గుర్తుచేసుకున్నారు. పీవీ సేవలను జాతి చిరకాలం గుర్తుంచుకుంటుందని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. ‘భారత మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. స్వావలంబన, స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు పరచిన పీవీ, మాతృభాషకు సైతం అంతే ప్రాధాన్యతనిచ్చారు. విశాల దృష్టితో వీక్షించి, దేశానికి వారు అందించిన సేవలను జాతి యావత్తు చిరకాలం గుర్తు పెట్టుకుంటుంది’ అని వెంకయ్య నాయుడు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పివి: ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి హరీష్‌ ‌నివాళి
హైదరాబాద్‌,‌జూన్‌27(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహా రావు అని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా హరీశ్‌ ‌రావు ఘనంగా నివాలుళర్పించారు. పాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా పీవీ ప్రజ్ఞ అమోఘమని చెప్పారు. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతదేశానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆ మహనీయుని శతజయంతి సందర్భంగా పీవీని ఘనంగా స్మరించుకుందామని ట్వీట్‌ ‌చేశారు. ‘తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహా రావు గారు. ఆలోచనాపరునిగా, సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ అమోఘం, అనితర సాధ్యం. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారత దేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఆ మహానీయుని శతజయంతి సందర్భంగా తెలంగాణ ఠీవీ.. మన పీవీని ఘనంగా స్మరించుకుందాం. ఘన నివాళులు అర్పిద్దాం’ అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

దేశాన్ని అభివృద్ది బాటలో నడిపిని పివి: ట్వీట్టర్‌ ‌వేదికగా కెటిఆర్‌ ‌నివాళి
మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు. పీవీ గొప్ప దార్శనికుడని, తెలంగాణ ముద్దుబిడ్డ అని అన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ‘ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదులు, తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి’ అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

పివి ఘాట్‌ ‌వద్ద పొన్నాలకు చేదు అనుభవం
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు పీవీ ఘాట్‌ ‌వద్దకు వెళ్లి మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్ష్మయ్యను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. పొన్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు పీవీ ఘాట్‌లోకి వెళ్లనివ్వలేదు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. తనను అడ్డుకోవడం ప్రభుత్వ దుశ్చర్య అని అన్నారు. నివాళి అర్పించేందుకు కూడా పర్మిషన్‌ ‌కావాలా అని మండిపడ్డారు. పీవీతో పనిచేసిన చాలామంది ఆయనకు నివాళి అర్పించాలనుకుంటారని పేర్కొన్నారు. గతంలో ఎవరైనా పీవీ ఘాట్‌ను సందర్శించేవాళ్ళన్నారు. అయితే గవర్నర్‌ ‌తమిళసై, సిఎం కెసిఆర్‌ ‌పాల్గొంటున్న కార్యక్రమం కావడంతో పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు.

Leave a Reply