Take a fresh look at your lifestyle.

పివి మావాడు..

  • మాకు ఎల్లప్పుడూ గర్వకారణం
  • వీడియో సందేశం ఇచ్చిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ
  • నెహ్రూ తర్వాత పరిపాలనలో మార్పులు తెచ్చిన రెండో ప్రధాని పీవీయే : ప్రణబ్‌ ‌ముఖర్జీ
  • ఆయన కేబినేట్‌లో పనిచేయడం అదృష్టమన్న మన్మోహన్‌ ‌సింగ్‌
  • ‌పివి పారిశ్రామిక విధానం అద్భుతమన్న చిదంబరం
  • ఆయనతో పనిచేయడం ఓ భాగ్యం అన్న జైరామ్‌ ‌రమేశ్‌
  • 1991 ‌జూలై 24న పివి బడ్జెట్‌తో మారిన దేశ దిశ
  • ఘనంగా నివాళి అర్పించిన ఉత్తమ్‌ ‌తదితర నేతలు
  • పివిని ఆకాశానికి ఎత్తిన కాంగ్రెస్‌ ‌నేతలు
  • గాంధీభవన్‌లో ప్రారంభమైన శతజయంతి వేడుకలు

తెలంగాణ ప్రభుత్వం పివి శతజయంతి వేడుకలను ప్రకటించడంతో.. కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా పివి శతజయంతి వేడుకలను నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా గతంలో పివిని దూరం పెట్టిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా తాజాగా పివి తమ వాడని..ఎప్పటికీ తమకే సొంతమని ప్రకటించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు
శత జయంతి వేడుకలు శుక్రవారం గాంధీభవన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో సోనియా మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్‌, ‌కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, జైరామ్‌ ‌రమేశ్‌ ‌తదితరులు కూడా మాట్లాడారు. ‘దివంగత నేత, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మనవాడు, పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం’ అని కాంగ్రెస్‌ ‌నాయకురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాందీ వీడియో ద్వారా సందేశాన్ని పంపారు. పీవీ ఘనకీర్తిని కొనియాడారు. పీవీ నరసింహారవు శత జయంతి వేడుకలను పార్టీ ఏడాది పాటు నిర్వహిస్తోందని చెప్పారు. పీవీ గురించి ఎవరు వేడుకలు నిర్వహించినా స్వాగతిస్తామని సోనియా చెప్పారు. పీవీ స్ఫూర్తితో పనిచేసి 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని సోనియా విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీప్రధాని  మన్మోహన్‌ ‌సింగ్‌ ‌మాట్లాడుతూ.. పీవీ శతజయంతి వేడుకల నిర్వహణ మంచి నిర్ణయమని అన్నారు. పీవీ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా తొలి బ్జడెట్‌ ‌ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆదర్శవంతమైన వ్యక్తి పీవీ అని..ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాని పీవీ అన్నారు. దేశం క్లిష్ట సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని.. పీవీ ఆర్థిక సంస్కరణల వల్లనే దేశం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు పీవీ అని మన్మోహన్‌ ‌సింగ్‌ అన్నారు. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మాట్లాడుతూ..పీవీ శత జయంతి నిర్వహణ అభినందనీయమని, పీవీ తనను రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహించారన్నారు. ఆయనతో ఎంతో అనుబంధం ఉందని..యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడిగా ఉన్న నన్ను..ఎంపీగా..పీసీసీగా ప్రోత్సహించారన్నారు. పీవీ పారిశ్రామిక విధానం మరువలేనిదని.. ఆర్థిక సంస్కరణల రూపకర్త పీవీ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పెద్దపీట వేశారని  చిదంబరం తెలిపారు. జులై 24వ తేదీ దేశచరిత్రలో చరిత్రాత్మక దినం అని, పార్లమెంట్‌లో పీవీ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన రోజు అని కేంద్ర మాజీ మంత్రి జైం రాం రమేష్‌ ‌పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో పీవీ మంత్రివర్గంలో ఉన్నందుకు తాను గర్విస్తున్నానని అన్నారు. పీవీ శత జయంతుత్సవాల సందర్భంగా జైరాం రమేష్‌ ‌మాట్లాడారు. పీవీ ఘనతను కొనియాడారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి వివరించారు. అన్ని మంత్రిత్వ శాఖలు చూశాను కానీ.. ఆర్థిక శాఖ చేయలేదని పీవీ సరదాగా చెప్పేవారని జైరాం గుర్తుచేశారు. ఆర్థిక సంస్కరణల విషయంలో తనకు సహకరించాలని ప్రణబ్‌ను పీవీ కోరేవారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల విమర్శలకు తనదైన శైలిలో సమాధానం చెప్పేవారన్నారు. విమర్శలను సైతం సహనంతో స్వీకరించే వారని అన్నారు. పీవీ ప్రధానిగా ఉండగానే నూతన పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిందన్నారు.

గ్రాణాభివృద్ధిలో కూడా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని జైరాం చెప్పుకొచ్చారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ ‌సింగ్‌ ‌సేవలను పీవీ అద్భుతంగా వినియోగించుకునే వారని అన్నారు. ఆర్థిక సంస్కరణలు, పారిశ్రామిక విధానం తెచ్చినప్పుడు అనేక విమర్శలు ఎదుర్కొన్నారని, కానీ ఆ సంస్కరణలే సత్ఫలితాలు తెచ్చాయని పీవీ ఘనతను వివరించారు. సామాజిక, రాజకీయ రంగంలో కూడా పీవీ హయాంలో పెను మార్పులు వచ్చాయని జైరాం పేర్కొన్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..పీవీ ఓ సామాన్య కార్యకర్తగా పని చేసి ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. పీవీ తనకు వ్యక్తిగతంగా మంచి పరిచయమని..భూసంస్కరణలు తెచ్చిన ఘనత పీవీదన్నారు. పీవీ పుట్టుక నుండి..చనిపోయే వరకు కాంగ్రెస్‌ ‌వాదీ అని..ఉమ్మడి రాష్ట్రంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశామని.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని అదుకున్నది పీవీ సంస్కరణలే అన్నారు. జూలై 24, 1991 నాటి కేంద్ర బ్జడెట్‌ ‌మన దేశ ఆర్థిక పరివర్తనకు మార్గం సుగమం చేసిందని చెప్పారు. పి.వి. నరసింహారావు పదవీకాలం అనేక రాజకీయ, సామాజిక, విదేశాంగ విధాన విజయాలకు నాంది అని ఉత్తమ్‌ ‌తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీవీ సోదరులు మనోహర్‌ ‌రావ్‌, ‌పీవీ శత జయంతి కమిటీ చైర్మన్‌ ‌గీతారెడ్డి, కన్వీనర్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌, ‌ముఖ్యనాయకులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, మల్లు రవి, తదితర కాంగ్రెస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

నెహ్రూ తర్వాత పరిపాలనలో మార్పులు తెచ్చిన రెండో ప్రధాని పీవీయే: ప్రణబ్‌ ‌ముఖర్జీ
పీవి నర్సింహారావు శతజయంతి వేడుకలలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ మాట్లాడుతూ..పీవీ నర్సింహారావు గొప్ప భూమి పుత్రుడని, పీవీ  అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేసేవారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున భూసంస్కరణలు చేపట్టారని, రాష్ట్రంలో భూస్వామ్య పెత్తందార్ల ఆధిపత్యం ఉన్నప్పటికీ తన సంస్కరణలు ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. దేశంలో జవహర్లాల్‌ ‌నెహ్రూ తర్వాత పరిపాలనలో, ఆర్థిక రంగంలో మార్పులు తీసుకొచ్చిన రెండవ ప్రధాని పీవీ నరసింహారావు అని ఆయన కొనియ్యాడరు. ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్‌ ‌సింగ్‌ను తీసుకువచ్చి ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించారని, అత్యంత క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా పి.వి.నరసింహారావు బాధ్యతలు చేపట్టారని తెలిపారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య అనంతరం పీవీ నరసింహారావు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, భారత ప్రధానిగా సమర్థవంతంగా పనిచేశారని అన్నారు. పీవీ నరసింహారావు కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా నిర్ణయం తీసుకునేవారని ఆలస్యం చేయడం కూడా  ఓ నిర్ణయంగా మారేదని గుర్తు చేశారు.

Leave a Reply