*బ్రోచర్‌ను ఆవిష్కరించిన కెకె
పీవీ తెలంగాణ ఠీవీ అన్నమాట ప్రతిబింబించేలా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని ఎంపీ, ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు ప్రకటించారు. ఈ నెల 28న పివి జయంతి సందర్భంగా శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా కాకతీయ తోరణం, అశోకచక్ర చిహ్నాలు, పీవీ చిత్రపటంతో కూడిన పీవీ శతజయంతి ఉత్సవాల లోగో, బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు రాజీవ్‌శర్మ, కేవీ రమణాచారి, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ కావడం అందరికీ గర్వకారణమని అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఈ నెల 28న ప్రకటిస్తారని వెల్లడించారు. పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని వెల్లడించారు. మాజీ ప్రధాని చేపట్టిన భూసంస్కరణలు చాలా గొప్పవని, బడుగులకు రాజకియాల్లో అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పీవీ సేవలను గుర్తుచేసుకునేలా డాక్యుమెంటరీ తీసుకొస్తామన్నారు. పివి జయంతి వేడుకలను దేశ, విదేవాల్లో కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.