Take a fresh look at your lifestyle.

ఆర్థిక సంస్కరణల క్రాంతదర్శి పివి

  • మూడు దశాబ్దాలుగా దేశాభివృద్దిలో తోడ్పడ్డాయి
  • విశాఖలో నివాళి అర్పించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

విశాఖపట్నం,జూన్‌ 28 : ‌విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా పీవీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. వారి నాయకత్వం, దూరదృష్టి ద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలోకి మరలించారని తెలిపారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వేంకట నరసింహారావు శతజయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అని తెలిపిన ఉపరాష్ట్రపతి వారి మాటల్లో చమత్కారం, చేతల్లో నిర్వహణా సామర్థ్యం మరువలేనివని తెలిపారు. విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి, సోమవారం సర్క్యూట్‌ ‌హౌస్‌ ‌జంక్షన్‌ ‌వద్ద పీవీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. పీవీ నరసింహారావు ప్రారంభించిన విప్లవాత్మక సంస్కరణలు గత మూడు దశాబ్దాలుగా దేశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు దోహదపడ్డాయన్న ఉపరాష్ట్రపతి, వారి సంస్కరణలను మాజీ ప్రధాని వాజ్‌ ‌పేయి అదే స్ఫూర్తితో అమలు చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ మరింత వేగవంతం చేశారని తెలిపారు.

ంస్కరణల అమలు తక్షణ అవసరమన్న ఉపరాష్ట్రపతి, ఉత్తమమైన పద్ధతులు అవలంబిస్తూ ముందుకు సాగాలని సూచించారు. దేశంలో లైసెన్స్ ‌రాజ్‌ ‌ను రద్దు చేసిన ఘనత పీవీ నరసింహారావుదేన్న ఉపరాష్ట్రపతి, భారత ఆర్థిక సరళీకరణల నిర్మాతగా వారిని అభివర్ణించారు. ముఖ్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.వో)లోకి భారతదేశ ప్రవేశానికి వీలు కల్పించింది ఆయనేనని తెలిపారు. దేశ ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించిన పీవీ, ఎంతో క్లిష్టమైన సమయంలో దేశ పాలనా పగ్గాలను చేపట్టి, వ్యూహాత్మకంగా దేశాభివృద్ధిని గాడిలో పెట్టారని తెలిపారు. పీవీ నరసింహారావు భాషాభిమానాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, విశ్వనాథ ’వేయిపడగలు’ నవలను ’సహస్రఫాణ్‌’ ‌గా హిందీలోకి అనువదించిన విషయాన్ని ప్రస్తావించారు.

అంతేగాక ప్రసిద్ధ మరాఠీ నవల ’పాన్‌ ‌లక్షత్‌ ‌కోన్‌ ‌ఘేతో’ని ’అబల జీవితం’ పేరిట తెలుగులోకి అనువదించారని తెలిపారు. బహుభాషా కోవిదుడైన పీవీ మాతృభాషలో ప్రాథమిక విద్య సాగాలని ఆకాంక్షించారన్న ఉపరాష్ట్రపతి, హైస్కూల్‌ ‌స్థాయి వరకూ బోధనా మాధ్యమం మాతృభాషగా ఉండాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థ కంటే దేశమే ఉన్నతమైనదని నమ్మిన దేశభక్తుడైన రాజనీతిజ్ఞుడు’అంటూ పీవీ గురించి మాజీ రాష్ట్రపతి కలాం పలుకులను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఆయన ఈ నేలపై ఘనమైన వారసత్వాన్ని విడిచి వెళ్ళారని, యువతరం వారి నుంచి ప్రేరణ పొంది, దేశాభి వృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. పీవీ నరసింహా రావు లాంటి గొప్ప నాయకుడి సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్న ఉపరాష్ట్రపతి, ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, దేశనిర్మాణంలో పీవీ కృషిని ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Leave a Reply