Take a fresh look at your lifestyle.

పి.వీ. ఒక సుందర స్వప్నం

పి.వి. నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా….

పి.వి. పేరు వినగానే యావత్‌ ‌దేశం ఆయనపట్ల అభిమానాన్ని చూపుతుంది. ఇవ్వాళ దేశం ఆర్థిక ప్రగతిసాధించడానికి ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నది ఎవరూ కాదనలేని విషయం. అలాంటి పి. వీ. మావాడు.. మనవాడని తెలుగు ప్రజలంతా గర్వంగా చెప్పుకుంటారు. పి. వీ. సాబ్‌ అం‌టూ ఆప్యాయంగా పిలుచుకునే తెలంగాణవారి ఆణిముత్యం ఆయన. తెలుగు ప్రాంతంనుండి ప్రధాని స్థాయికి ఎదిగిన మొదటివాడు, చివరివాడుకూడా ఆయనే. భారత ప్రధానుల్లో జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయిలో దేశ, విదేశీయుల మన్నలను పొందినవ్యక్తి పి.వీ. అపర చాణక్యుడు, మహా మేధావి, అసాధారణ స్వాప్నికుడు, బహుభాషాకోవిదుడైన పి.వీ శతజయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఆయనపట్ల తెలంగాణ ప్రజలకున్న గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం పదికోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్ర రాజధానిలోని జ్ఞానభూమిలో ఈ నెల 28న ప్రారంభమయ్యే సంస్మరణ ఉత్సవాలను సంవత్సరంపొడవున వివిధ రూపాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ సందర్భంగా పి. వీ యాదిలో….. దేశ రాజకీయాలన్నీ ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతున్న రోజులవి. అలాంటి పరిస్థితిలో దేశంలోని అత్యున్నత ప్రధాని పదవి ఆయన్ను ఏరికోరి రావడం ఆయన సమర్థతకు దర్పణంలాంటిది. అంతవరకు కేవలం ఉత్తరాదివారికే పరిమితమవుతున్న ప్రధాన మంత్రి పదవి మొట్టమొదటిసారిగా దక్షిణ ప్రాంతానికి అందునా తెలుగువాడిగా దివంగత పాములపర్తి వేంకట నరసింహారావుకు దక్కటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. అలాగే హస్తినలో తెలుగు పతాకాన్ని ఎగురవేసిన శాశ్వితఘనకీర్తికూడా ఆయనకే దక్కుతుంది. విచిత్రమేమంటే సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో ఆయన అలంకరించిన పదవులన్నీ యాదృచ్చికంగా సంక్రమించినవికావడం. ఇతర పదవుల సంగతి ఎలా ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి పదివికూడా ఆయనకు యాదృచ్చికంగా సంక్రమించిందే. ఆయనెప్పుడూ ఫలానా పదవి కావాలని కోరుకున్నవాడుకాదు. అలాగే తాను నమ్మిన సిద్దాంతాలకోసం తనకులభించిన పదవులను త్యాగంచేయడానికికూడా ఏనాడాయన సంశయించిన వ్యక్తి కాదు. అంతటి నిరాడంబరుడాయన. ఆయన ముక్కుసూటితనమే ఆయన్ను ఉన్నత శిఖరాలకు ఎలా తీసుకెళ్ళిందో, అదే చివరిరోజుల్లో అనేక ఇబ్బందులకు గురిచేసింది. అయినా మొక్కవోనిధైర్యం, స్వయంశక్తిసామర్థ్యలే ఆయన్ను వెన్నుతట్టి నిలిపాయి. తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంనుంచి శాశ్వితంగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రాజకీయాలే తనను కట్టిపడేస్తాయని ఆయన కనీస మాత్రంగానైనా ఊహించి ఉండడు. 1991 నాటి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనక ఢిల్లీనివదిలి తనస్వగ్రామమైన వంగరలో స్థిరపడేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నతరుణమది. అనుకోనిరీతిలో దేశంలో రాజకీయ సంక్షోభం వచ్చిపడింది.

ఆ సంక్షోభమే ఆయన్ను ప్రధాని పదవి వెతుక్కుంటూ రావడానికి కారణమైంది. వివాద రహితుడిగా, గ్రూపు రాజకీయాలకు అతీతుడిగా, ముఖ్యంగా నెహ్రూ, గాంధీ వారసులకు అత్యంత సన్నిహితుడిగా, విశ్వాసపాత్రుడిగా ఆయనపైనున్న నమ్మకమే ఆయన్ను అందల మెక్కించింది. తమిళనాడులోని పెరంబుదూరులో రాజీవ్‌గాంధి హత్య సంఘటన ఈమార్పుకు కారణమైంది. ఈ హత్యతో అనేక క్లిష్ట సమస్యలను దేశం ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, రాజకీయ సంక్షోభాన్నికూడా తెచ్చిపెట్టింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలంకూడా లేదు, అలాగే పార్టీలో నాయకత్వలోపం కొట్టవచ్చినట్లు కనిపించింది. ఈ పరిస్థితిలో రాజకీయ, ఆర్థిక సంక్షోభంనుండి దేశాన్ని కాపాడగలవ్యక్తి పి.వీ. మాత్రమేనని గుర్తించిన కాంగ్రెస్‌ అదిష్టానం ఆగమేఘాలమీద మళ్ళీ ఢిల్లీకి పిలిపించుకుని 1991 జూన్‌ 21‌న ప్రధాని పదవిని కట్టబెట్టింది. ఇదొకవిధంగా ఆయన రాజకీయ ప్రస్తానంలో ఊహించని మరోమలుపుకు కారణమైంది. అప్పటికీ పార్లమెంటు సభ్యుడుకూడాకాని పి.వీ., నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుజిల్లా నంద్యాల( 1991 నవంబర్‌) ఉపఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. రాజకీయసన్యాసం తీసుకోవాలను కుంటున్న తరుణంలో జరిగిన ఉపఎన్నికే అయినప్పటికీ అత్యధికమెజార్టీని సాధించి రికార్డు నెలకొల్పిన ఘనతకూడా ఆయనకే దక్కింది. అనంతరం 1996లో బరంపురం నుంచి పదకొండవ లోకసభకు కూడా ఎన్నికైనారు. అయితే మొదటిసారిగా దక్షిణ ప్రాంతానికి, అందునా తెలుగువాడికి ప్రధానమంత్రి పదవి లభించడాన్ని హర్షిస్తూ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు నంద్యాలలో తమపార్టీ అభ్యర్ధినెవరినీ పోటీలో నిలుపకుండా పి.వీ. పట్ల తనకున్న గౌరవాన్ని చాటు కున్నారు. ఇతర ప్రతిపక్షాలుకూడా పోటీనుంచి వైదొలగి పి.వీ. ఎన్నికకు సహకరించడం ఆయనపట్ల తెలుగు ప్రజలకున్న అభిమానాన్ని చాటిచెప్పింది. అదిమొదలు పాలనలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే పదవీస్వీకారంతోపాటు సమస్యలనుకూడా వెంటతెచ్చు కున్నట్లయింది. ఆయన మైనార్టీ ప్రభుత్వాన్ని పడగొ ట్టేందుకు ప్రతిపక్షాలు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అయిదేళ్ళపాటు పదవిలో కొనసా గటం ద్వారా ఆయన అపర చాణక్యుడిగా పేరుతె చ్చుకున్నాడు.

Ravinder Rao
Ravinder Rao
Guest Editor

Leave a Reply