Take a fresh look at your lifestyle.

ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు
పట్టు వస్త్రాల బహూకరణ
పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తాననీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలోని పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా మంత్రి హరీష్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పట్టు వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ్ర హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…..మాఘ మాసం అంటే జిల్లాలో గుర్తుకొచ్చేది ప్రధానంగా మూడు జాతరలేనని పేర్కొన్నారు. దుబ్బాక మండలంలోని కూడవెల్లి, హుస్నాబాద్‌లోని సింగరాయ జాతర, సిద్దిపేట గ్రామీణ మండలంలోని పుల్లూరు బండ జాతర ప్రసిద్ది చెందాయన్నారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించేవి ఈ జాతరలన్నారు. సిద్దిపేట జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ జాతరలో పాల్గొంటారనీ, 600ఎకరాలలో ఏకశిలాపై కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకు 800 ఎండ్ల చరిత్ర ఉందన్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంతో పాటు తెలంగాణలోని ఆలయాల అభివృద్ధిపై ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు వివక్షత చూపారన్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు కోట్ల యాభై లక్షలతో ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ. 32 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ, ఆలయ కొండపై లక్షా 20 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ‌ట్యాంక్‌ ‌నిర్మాణం, రూ. 15 నిధులతో సుడా అధ్వర్యంలో అందమైన పార్క్ ‌నిర్మాణం చేపట్టామన్నారు.

రూ.32 లక్షలతో కొండ పైకి సిసి రోడ్డు నిర్మాణం చేశామన్నారు. రూ. 50 లక్షలతో స్వామి వారి కల్యాణ మండపం నిర్మాణం చేపట్టామన్నారు. కొండపై వివాహాలు చేసుకునేందుకు వీలుగా ఫంక్షన్‌ ‌హాల్‌ ‌నిర్మాణం ప్రగతిలో ఉందన్నారు. వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. స్వామి దయతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసుకుని గోదావరి జలాలను పుల్లూరు బండ వద్దకు తెచ్చామన్నారు.బండను ఒడిసిపట్టుకుని గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రసిద్ధ పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా ఆలయంను మరింతగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అర్చకులకు జిల్లా యంత్రాగం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మార్గదర్శనం మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయంను మరింతగా అభివృద్ధి చేస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కలకుంట్ల రంగాచారి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇమాంబాద్‌ ‌పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న హరీష్‌రావు..
ఇమాంబాద్‌లో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి ఆలయంకు రూ.1లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ఇమాంబాద్‌ ‌గ్రామంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రూ. 35 కోట్లతో సిద్దిపేట పట్టణం నుంచి రామంచ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేస్తున్నామన్నారు.ఉగాది తర్వాత ఇమాంబాద్‌ ‌గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలకు వారి స్వంత స్థలంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణంకు ఆర్థిక సహాయం ప్రభుత్వ పక్షాన అందజేస్తామన్నారు.

Leave a Reply