Take a fresh look at your lifestyle.

తొమ్మిది లక్షల కోట్ల రుణాల రద్దు… ప్రజల సొమ్ము బడా సంస్థలకు…

బ్యాంకుల్లో పేదవారికి రుణాలు మంజూరు కావాలంటే ఎంత కష్టపడాలో అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. కార్పొరేట్‌, ‌పారిశ్రామిక సంస్థలకు వేల కోట్ల రూపాయిలు భూరిగా రుణాలు ఇవ్వడమే కాకుండా, వారు చెల్లించలేకపోతే, వాటిని రద్దు చేసే ఉదారగుణాన్ని బ్యాంకులు ప్రదర్శిస్తూ ఉంటాయి. గడిచిన పది సంవత్సరాల్లో బ్యాంకులు దాదాపు 9 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసినట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇం‌డియా తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రజలు దాచుకున్న డబ్బును కార్పొరేట్‌ ‌సంస్థలకు రుణాల రూపంలో ప్రభుత్వం సంతర్పణ చేస్తోందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి. పదేళ్ళలో అంటే ఎక్కువ భాగం ప్రధానిగా నరేంద్రమోడీ అధికారాన్ని చేపట్టిన తర్వాత రద్దు అయినవే. మోడీ హయాంలో బ్యాంకింగ్‌ ‌వ్యవస్థలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి..ఇంకా జరుగుతున్నాయి. అంతమాత్రాన యూపీఏ హయాంలో అంతా సవ్యంగా ఉందని అనుకోవడానికి వీలు లేదు. బ్యాంకులు పారిశ్రామిక సంస్థలకూ, కార్పొరేట్‌ ‌సంస్థలకూ ఉదారంగా రుణాలు ఇవ్వడం యూపీఏ హయాంలోనే ప్రారంభమైంది. దేశంలో ఇంధన సమస్య తీవ్రంగా ఉన్నందున థర్మల్‌, ‌జలవిద్యుత్‌ ‌కేంద్రాల ఏర్పాటు కోసం బ్యాంకులు రుణాలు ఇచ్చాయని ఆనాటి ప్రభుత్వం తెలియజేసింది.

అది నిజమే కావచ్చు. రుణాలను తిరిగి వసూలు చేయడంలో యూపీఏ ప్రభుత్వం అలసత్వం వహించడానికి కారణం ఆ కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి వొచ్చిన వొత్తిడుల కారణంగా రుణాలు తిరిగి వసూలు చేయలేకపోయినట్టు తేలింది. అప్పట్లో యూపీఏలో విభిన్న రాజకీయ పక్షాలు ఉండేవి. ఇప్పుడు ఎన్‌డిఏ ప్రభుత్వం పేరిట మోడీ నడుపుతున్న ప్రభుత్వంలో బీజేపీయే ప్రధాన పార్ట్ణీ. మిగిలిన పార్టీలున్నా మోడీకి అనుకూలంగా నడుచుకునేవే. యూపీఏ ప్రభుత్వం అసమర్దత, చేతగాని తనం వల్ల బ్యాంకుల బకాయిలు పెరిగిపోయాయని మోడీ తరచూ ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు ఆయన హయాంలోనే బ్యాంకుల బకాయిలు విపరీతంగా పెరిగిపోయాయి. యూపీఏ హయాంలో రుణాల ఎగవేత దారులంతా ఇప్పటికీ దేశంలోనే ఉన్నారు. కానీ, మోడీ హయాంలో రుణాలు తీసుకున్న బడా కార్పొరేట్‌ ‌వర్గాల నాయకులు విదేశాల్లో తలదాచుకుంటున్నారు. వారిని తిరిగి రప్పించడానికి మోడీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ ఫలించలేదు. బ్యాంకుల రుణాల విషయానికి వొస్తే రైతులు, సన్నకారు, మధ్యతరహా వ్యాపారస్తులు రుణాలు చెల్లించకపోతే జప్తు చేసే బ్యాంకులు పెద్ద పారిశ్రామిక, కార్పొరేట్‌ ‌సంస్థల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఇప్పటికే వొచ్చాయి. తొమ్మిది లక్షల కోట్ల రూపాయిలను రద్దు చేయడంతో ఆ ఆరోపణలు అసత్యం కాదని రుజువు అవుతోంది. రద్దయిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే ఏకంగా రూ.6,67,345 కోట్ల రుణాలను రద్దు చేయడం గమనార్హం. అంటే 2010 నుంచి రద్దు చేసిన రుణాల్లో పబ్లిక్‌ ‌సెక్టార్‌ ‌బ్యాంకుల వాటా 76 శాతం. ఇక ప్రైవేట్‌ ‌బ్యాంకులు రూ.1,93,033 కోట్ల రుణాలను రద్దు చేయగా, విదేశీ బ్యాంకులు రూ.22,790 కోట్ల రుణాలు రద్దు చేశాయి. అందులోనూ ఒక్క 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు రూ. 2,37,206 కోట్ల రుణాలు రద్దు చేయడం విశేషం. ఇందులో పీఎస్‌బీల వాటా రూ. 1.78 లక్షల కోట్లు కాగా.. ప్రైవేట్‌ ‌బ్యాంక్‌ల వాటా రూ.53,949 కోట్లుగా ఉంది.

అప్పు తీసుకున్న వ్యక్తి లేదా సంస్థ తిరిగి చెల్లించే అవకాశాలు దాదాపు లేనప్పుడు బ్యాంక్‌లు లోన్లను రైట్‌ ఆఫ్‌ ‌చేస్తాయి. గతేడాది చాలా మంది ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఊహించిన స్థాయిలో లోన్‌ ‌రికవరీలు సాధ్యం కాలేదని, అందుకే లోన్ల రద్దు మొత్తం ఎక్కువగా ఉన్నదని సెక్యూరిటీస్‌ ‌నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి అకౌంట్ల నుంచి భవిష్యత్తులోనూ రికవరీలు సాధ్యమవుతాయని ఆయన తెలిపారు. బ్యాంకులు తమ బ్యాలెన్స్ ‌షీట్లను క్లియర్‌ ‌చేసుకోవడానికి ఈ రుణాలను రద్దు చేసినా..రుణం తీసుకున్న వాళ్లు వాటిని తిరిగి చెల్లించాల్సిందే అని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. బ్యాంకింగ్‌ ‌రంగంలో ప్రభుత్వం జోక్యం ఎక్కువ కావడం వల్లనే రుణాల రికవరీ జరగడం లేదన్న ఆరోపణలు ఇంతకుముందే వొచ్చాయి. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ ‌ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడం వల్లనే తన పదవి నుంచి తప్పుకున్నారు. రిజర్వు బ్యాంకు మూల నిధి నుంచి కూడా ప్రభుత్వానికి నిధులు అందించాలని ప్రభుత్వం వొత్తిడి తెస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి వొచ్చిన వొత్తిడి కారణంగా రిజర్వు బ్యాంకులో దశాబ్దాలుగా పని చేస్తున్న వారు వేరే చోట ఆఫర్లు వొస్తే వెళ్ళిపోతున్నారు.

బ్యాంకులు ఇచ్చే రుణాలకు ష్యూరిటీలు ఉండాలి.కానీ, పెద్ద కంపెనీలు, కార్పొరేట్‌ ‌సంస్థలను ఆ విధంగా డిమాండ్‌ ‌చేయడం లేదన్న ఆరోపణలు వొచ్చాయి. మోడీ ప్రభుత్వం ఉదార వైఖరిని అనుసరిస్తుండటం వల్లనే ఎగవేత దారుల సంఖ్య పెరుగుతోందనీ, అంతకుముందు కూడా ఎగవేతదారులున్నప్పటికీ ఇప్పుడు వారి సంఖ్య పెరిగిందని బ్యాంకింగ్‌ ‌రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్‌, ‌పారిశ్రామికరంగాలకు ఇచ్చే రుణాలతో పోలిస్తే, వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు బాగా తక్కువే. ఇప్పుడు ఆందోళన సాగిస్తున్న రైతులు చేస్తున్న ఆరోపణల్లో బ్యాంకులు తమ పట్ల వివక్ష పాటిస్తున్నాయన్నది కూడా ఉంది. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవడం లేదనీ, పెద్ద కార్పొరేట్‌ ‌సంస్థల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పని చేస్తోందని వ్యవసాయ సంఘాల వారు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాల విషయంలో యూపీఏ ప్రభుత్వం కూడా గతంలో ఇలాగే వివక్ష చూపింది. ఇప్పుడు మరింత ఎక్కువైంది. అదే తేడా.

Leave a Reply